Skip to main content

రేడియో ధార్మికత

అస్థిర కేంద్రకం నుంచి యాదృచ్ఛికంగా జరిగే వికిరణ ఉద్గారమే రేడియో ధార్మికత. సహజ రేడియో ధార్మికతను ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఎ.హెన్రీ బెకెరెల్ కనుగొన్నాడు. హెన్రీ బెకెరెల్, మేరీ క్యూరీ, రూథర్‌ఫర్డ్ జరిపిన పరిశోధనల్లో రేడియో ధార్మికత ఒక సంక్లిష్ట ప్రక్రియ అని, రేడియో ధార్మిక పదార్థాల నుంచి ఆల్ఫా, బీటా, గామా కిరణాలు ఉద్గారం చెందుతాయని తేలింది. రేడియో ధార్మికతకు కారణమైన అస్థిర కేంద్రకంపై జరిపిన పరిశోధనల వల్ల కేంద్రక చర్యలపై అవగాహన ఏర్పడింది. కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం వంటి చర్యల ద్వారా అపారమైన శక్తి విడుదలవుతుందని గుర్తించారు. దీన్ని విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించొచ్చు.

ఒక అస్థిర కేంద్రకంపైకి నెమ్మదిగా సాగే న్యూట్రాన్‌ను తాడనం చేస్తే, అది రెండు సమాన కేంద్రకాల్లోకి అపార శక్తిని, వేగంగా సాగే న్యూట్రాన్లను విడుదల చేస్తుంది. ఈ చర్యను కేంద్రక విచ్ఛిత్తి(న్యూక్లియర్ ఫిషన్) అంటారు. 1939లో అట్టోహాన్, ఫ్రిట్జ్ స్ట్రాస్‌మన్ ఈ చర్యను గుర్తించారు. అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ద్వారా విధ్వంసక శక్తి విడుదలవుతుంది. దీన్ని ఆటం బాంబ్ అంటారు. విచ్ఛిత్తి చర్యను నియంత్రించి ఉత్పత్తి చేసే శక్తిని అణుశక్తిగా పేర్కొంటారు. దీని కోసం రియాక్టర్ అనే భారీ పరికరాన్ని నిర్మిస్తారు. రియాక్టర్లు రెండు రకాలు. అవి.. పరిశోధన రియాక్టర్లు, శక్తి రియాక్టర్లు. రేడియో ధార్మిక ఐసోటోపుల ఉత్పాదన, మానవ వనరుల శిక్షణ, సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి, మూల పరిశోధనల్లో పరిశోధన రియాక్టర్లు ఉపయోగపడతాయి. శక్తి ఉత్పాదనలో శక్తి రియాక్టర్లను వినియోగిస్తారు.
భారత అణుశక్తి కార్యక్రమం
డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో భారత అణుశక్తి కార్యక్రమం ప్రారంభమైంది. 1944లో ఆయన ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో అణు మూల పరిశోధనలు చేశారు. స్వాతంత్య్రానంతరం 1948లో ఒక అణుశక్తి సంఘం ఏర్పడింది. అణుశక్తి విధానాన్ని ఈ సంఘం రూపొందిస్తుంది. 1954లో ఒక అణుశక్తి విభాగం ఏర్పాటైంది. స్థాపిత శక్తి సామర్థ్యంలో అణు శక్తి వాటాను పెంచడం, రేడియో ఐసోటోపుల ఉత్పాదన, మూడు దశల అణుశక్తి కార్యక్రమ అభివృద్ధి, టెక్నాలజీ బదిలీ, అంతర్జాతీయ సహకారం, ఉమ్మడి పరిశోధనలు అణుశక్తి విభాగం ముఖ్య లక్ష్యాలు.
అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో ఈ పరిశోధన కేంద్రాలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు అణుశక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి
పరిశోధన కేంద్రాలు

  • బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ట్రాంబే, ముంబై)
  • ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (కల్పక్కం, చెన్నై)
  • రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్‌‌సడ్ టెక్నాలజీ(ఇండోర్)
  • వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (కోల్‌కతా)
  • అటామిక్ మినరల్స్ డెరైక్టోరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (హైదరాబాద్)

పరిశ్రమలు

  • హెవీ వాటర్ బోర్డు, ముంబై
  • న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాద్.
  • బోర్‌‌డ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ, ముంబై.

ప్రభుత్వ రంగ సంస్థలు

  • న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ముంబై.
  • యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జాదుగూడా, జార్ఖండ్.
  • ఇండియన్ రేర్ ఎర్‌‌త్స లిమిటెడ్, ముంబై.
  • ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్.
  • భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, కల్పక్కం, చెన్నై.

ఎయిడెడ్ సంస్థలు

  • టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబై.
  • టాటా మెమోరియల్ సెంటర్, కోల్‌కతా.
  • సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, కోల్‌కతా.
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్, భువనేశ్వర్.
  • హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, అలహాబాద్.
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్, చెన్నై.
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్, అహ్మాదాబాద్.
  • ఫెసిలిటేషన్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ ప్లాస్మా టెక్నాలజీస్, గాంధీనగర్.
  • అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ, ముంబై.
  • బోర్డ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ న్యూక్లియర్ సైన్స్, ముంబై.
  • నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్, ముంబై.

భారత అణు రియాక్టర్లు
భారతదేశంలో మూడు దశల అణు రియాక్టర్లు అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలో తక్కువగా ఉన్న యురేనియం వనరులను, సమృద్ధిగా ఉన్న థోరియం నిల్వలను సమర్థంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో అణుశక్తి విభాగం ఒక క్లోజ్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్‌ను రూపొందించింది.
మొదటి దశ రియాక్టర్లు: ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (పీహెచ్‌డబ్ల్యూఆర్).. వీటిలో యురేనియాన్ని ఇంధనంగా వాడుతారు. ఈ రియాక్టర్లలో ఒకవైపు యురేనియం ఖర్చయితే, మరోవైపు కొద్దిగా ప్లూటోనియం ఏర్పడుతుంది. మొదటి దశ రియాక్టర్లలో ఏర్పడిన ప్ల్లూటోనియాన్ని రెండో దశ రియాక్టర్లలో వినియోగిస్తారు.
రెండో దశ రియాక్టర్లు: ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్.. ఖర్చయిన ఇంధనం కన్నా అధిక ఇంధనాన్ని ఉత్పత్తి చేసే రియాక్టర్లు. దీనిలో యురేనియం, ప్లూటోనియం మిశ్రమాన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ రియాక్టరులో థోరియాన్ని ప్రవేశ పెట్టి దాన్ని యురేనియం-233గా మారుస్తారు. దీన్ని మూడో దశలో వినియోగిస్తారు.
మూడో దశ రియాక్టర్లు: అడ్వాన్‌‌సడ్ హెవీ వాటర్ రియాక్టర్.. దేశంలో అపారంగా ఉన్న థోరియం నిల్వలను సమర్థంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో నిర్మించనున్న రియాక్టర్. దీనిలో థోరియాన్ని యురేనియంగా మార్చి ఇంధనంగా ఉపయోగిస్తారు.
ప్రస్తుతం రాజస్థాన్‌లో రెండు (2×700 మెగావాట్లు), కాక్రాపార్(గుజరాత్)లో రెండు (2×700 మెగావాట్లు), కుడంకుళం (తమిళనాడు)లో రెండో యూనిట్ (1×1000 మెగావాట్లు) నిర్మాణంలో ఉన్నాయి. 2032 నాటికి 63,000 మెగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నది అణుశక్తి విభాగం లక్ష్యం.

భారతదేశంలోని అణు విద్యుత్ రియాక్టర్లు

అణు రియాక్టర్

ప్రాంతం

సామర్థ్యం (మెగావాట్లలో)

టీఏపీఎస్-1

తారాపూర్, మహారాష్ర్ట

160

టీఏపీఎస్-2

తారాపూర్, మహారాష్ర్ట

160

ఆర్‌ఏపీఎస్-1

రావత్‌భట్టా, రాజస్థాన్

100

ఆర్‌ఏపీఎస్-2

రావత్‌భట్టా, రాజస్థాన్

200

ఎంఏపీఎస్-1

కల్పక్కం, తమిళనాడు

220

ఎంఏపీఎస్-2

కల్పక్కం, తమిళనాడు

220

ఎన్‌ఏపీఎస్-1

నరోరా, ఉత్తరప్రదేశ్

220

ఎన్‌ఏపీఎస్-2

నరోరా, ఉత్తరప్రదేశ్

220

కేఏపీఎస్-1

కాక్రాపార్, గుజరాత్

220

కేఏపీఎస్-2

కాక్రాపార్, గుజరాత్

220

కైగా-1

కైగా, కర్ణాటక

220

కైగా-2

కైగా, కర్ణాటక

220

ఆర్‌ఏపీఎస్-3

రావత్‌భట్టా, రాజస్థాన్

220

ఆర్‌ఏపీఎస్-4

రావత్‌భట్టా, రాజస్థాన్

220

టీఏపీఎస్-3

తారాపూర్, మహారాష్ర్ట

540

టీఏపీఎస్-4

తారాపూర్, మహారాష్ర్ట

540

కైగా-3

కైగా, కర్ణాటక

220

కైగా-4

కైగా, కర్ణాటక

220

ఆర్‌ఏపీఎస్-5

రావత్‌భట్టా,రాజస్థాన్

220

ఆర్‌ఏపీఎస్-6

రావత్‌భట్టా,రాజస్థాన్

220

కుడంకుళం-1

తమిళనాడు

1000

మొత్తం స్థాపిత సామర్థ్యం 5780 మెగావాటు్ల

భారతదేశంలో భార జలప్లాంట్లు

ప్లాంటు

రాష్ర్టం

బరోడా

గుజరాత్

హజీర

గుజరాత్

కోట

రాజస్థాన్

మణుగూరు

తెలంగాణ

తాల్చేర్

ఒడిశా

థాల్

మహారాష్ర్ట

ట్యుటికోరిన్

తమిళనాడు

Published date : 21 Jul 2021 12:50PM

Photo Stories