జీవ వైవిధ్యం
ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవ వైవిధ్యానికి ప్రస్తుతం అభివృద్ధి పేరుతో మానవుడు సాగిస్తున్న చర్యల వల్ల నష్టం వాటిల్లుతోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా దీనికి తీవ్ర స్థాయిలో ముప్పు పొంచి ఉన్నట్లు యూఎన్‌ఈపీ (United Nations Environment Programme) ఇటీవల ప్రకటించింది. గత శతాబ్దకాలంలో అనేక వన్య జీవులు కనుమరుగైన నేపథ్యంలో జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సివిల్స్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల్లో పర్యావరణ అంశాల ప్రాధాన్యం పెంచారు. అందువల్ల అభ్యర్థులు ఈ అంశంపై అవగాహన పెంచుకోవాలి.
జీవ వైవిధ్యం - నేపథ్యం
జీవ సంబంధ వైవిధ్యం (Biological Diversity) అనే పదాన్ని మొదట రేమండ్ ఎఫ్. డాస్‌మన్ అనే పరిరక్షణవేత్త 1968లో "A Different Kind of Country" పుస్తకంలో ఉపయోగించాడు. 1985లో వాల్టర్ జి. రోజెన్ అనే శాస్త్రవేత్త ‘జీవ వైవిధ్యం’(Bio diversity) అనే సంక్షిప్త పదాన్ని ప్రతిపాదించాడు.
జీవులతో ముడిపడి ఉన్న అన్ని రకాల వైవిధ్యాలను జీవ సంబంధ వైవిధ్యంగా పేర్కొంటారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (IUCN) ప్రకారం.. ఒక భౌగోళిక ప్రాంతంలోని మొత్తం జన్యువులు, జాతులు, జీవావరణ వ్యవస్థల సముదాయమే జీవ వైవిధ్యం. ప్రకృతిలో ఇది సహజంగా ఉంటుంది. జీవ వైవిధ్య పరిరక్షణ భావన 1980 నుంచి బలపడింది. అడవులను సంరక్షించడంలో భాగంగా.. అక్కడ ఉండే అన్ని రకాల జీవులు, వాటి తెగలు, వాటిలోని విభిన్న జన్యువులు, జీవులు మధ్య ఉన్న సంబంధాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచించారు.
జీవ వైవిధ్యం - వివిధ స్థాయిలు
- జన్యు వైవిధ్యం (Genetic Diversity): ఒక జాతి జీవుల్లో ఉండే విభిన్న జన్యువుల సముదాయమే జన్యు వైవిధ్యం. ఉదా: మనుషుల్లో వివిధ తెగలు (ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్, నిగ్రాయిడ్); మానవుడిలో విభిన్న రక్త గ్రూపులు.
- జాతి వైవిధ్యం (Species Diversity): ఒక నిర్దిష్ట ప్రాంతంలోని విభిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ‘జాతి వైవిధ్యం’గా పేర్కొంటారు. దీని ఆధారంగా ప్రపంచంలో అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న 17 మెగా బయోడైవర్సిటీ దేశాలను గుర్తించారు. ఈ రకమైన వైవిధ్యం జీవుల వర్గీకరణలో ఉపయోగపడుతుంది.
- ఆవరణ వ్యవస్థ వైవిధ్యం (Ecosystem Diversity): విభిన్న రకాల భూచర, జలచర ఆవరణ వ్యవస్థల సముదాయాన్ని ‘ఆవరణ వ్యవస్థ వైవిధ్యం’ అంటారు.
పైన పేర్కొన్నవాటితో పాటు మైక్రోబియల్ డైవర్సిటీ, అగ్రి బయోడైవర్సిటీ లాంటి విభిన్న స్థాయి జీవ వైవిధ్యం కూడా ఉంటుంది. రాబర్ట్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త జీవ వైవిధ్యాన్ని 3 రకాలుగా విభజించాడు.
1. α- జీవ వైవిధ్యం: దీన్ని Species Richness అంటారు. ఒక ఆవరణ వ్యవస్థలోని జాతి వైవిధ్యాన్ని ఇది తెలుపుతుంది.
2. ß- వైవిధ్యం: రెండు భిన్న ఆవరణ వ్యవస్థల్లో జాతి వైవిధ్యంలోని భేదాన్ని ఇది తులనాత్మకంగా తెలుపుతుంది.
3. γ - వైవిధ్యం: ఒక విశాల భౌగోళిక ప్రాంతంలోని విభిన్న జీవ సమాజాల్లో మొత్తం వైవిధ్యాన్ని 'గామా వైవిధ్యం'గా పేర్కొంటారు.
మెగా బయోడైవర్సిటీ దేశాలు
మెక్సికో 2002లో ప్రపంచవ్యాప్తంగా అధిక జీవ వైవిధ్యం, సంప్రదాయ విజ్ఞానానికి నిలయంగా ఉన్న దేశాలను (Like-minded Mega Diverse Countries) గుర్తించింది. Conservation International గుర్తించిన 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితా..
1. ఆస్ట్రేలియా | 2. బ్రెజిల్ |
3. చైనా | 4. కొలంబియా |
5. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో | 6. ఇక్విడార్ |
7. ఇండియా | 8. ఇండోనేషియా |
9. మడగాస్కర్ | 10. మలేషియా |
11. మెక్సికో | 12. పపువ న్యూగినియా |
13. పెరూ | 14. ఫిలిప్పీన్స్ |
15. దక్షిణాఫ్రికా | 16. యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా |
17. వెనిజులా |
ఈ జాబితాలో పేర్కొన్న మొదటి దేశంలో అత్యధిక జీవ వైవిధ్యం, చివరి దేశంలో తక్కువ జీవ వైవిధ్యం ఉంటుంది.
జీవ వైవిధ్య హాట్ స్పాట్స్
అధిక జీవ వైవిధ్యానికి నిలయంగా ఉండి ముప్పు పొంచి ఉన్న జీవ భౌగోళిక ప్రాంతాలను ‘బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్’గా పేర్కొంటారు. నార్మన్ మేయర్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఈ భావనను మొదటిసారిగా ప్రతిపాదించాడు. 1985-90లో ఈయన ప్రచురించిన "The Environment" అనే ఆర్టికల్‌లో దీని గురించి ప్రస్తావించాడు. 1996లో Conservation International ఈ భావనపై పరిశోధన చేసి మేయర్స్ తో ఏకీభవించింది.
ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌గా గుర్తించడంలో రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
- కనీసం 1500 జాతుల నాళిక కణజాలయుత మొక్కలు (Vascular Plants) ఎండమిక్ (స్థానియ) జాతులుగా ఆ ప్రాంతానికే పరిమితమై ఉండాలి.
- కనీసం 70 శాతం తమ సహజ ఆవాసాన్ని లేదా వృక్షజాలాన్ని కోల్పోయి ఉండాలి.
ప్రపంచంలో ప్రస్తుతం 35 బయోడైవర్సిటీ హాట్‌స్పాట్లు ఉన్నాయి. అవి:
ఉత్తర, మధ్య అమెరికా
1. కాలిఫోర్నియా ఫ్లోరిస్టిక్ ప్రావిన్స్
2. మ్యాడ్రియన్ పైన్ ఓక్ ఉడ్‌లాండ్స్
3. మిసో అమెరికా
4. కరేబియన్ దీవులు
దక్షిణ అమెరికా
1. టంబెస్ చోకో మ్యాగ్డెలిన
2. ట్రాపికల్ ఆండీస్
3. చిలీయన్ వింటర్ రెయిన్‌ఫాల్ వాల్దీవియన్ ఫారెస్ట్
4. బ్రెజిల్ సిర్రాడో
5. బ్రెజిల్ అట్లాంటిక్ ఫారెస్ట్
యూరప్, మధ్య ఆసియా
1. కాకాసస్
2. మధ్య ఆసియా అడవులు
3. మధ్యదరా ప్రాంతం
4. ఇరాన్ అనతోలియన్
ఆఫ్రికా
1. పశ్చిమ ఆఫ్రికా - గినియా అడవులు
2. సక్కులెంట్ కరూ
3. కేప్ ఫ్లోరోస్టిక్ ప్రాంతం
4. మపుటలాండ్ - పాండో లాండ్ ఆల్బని
5. తూర్పు ఆఫ్రికా తీర అడవులు
6. ఈస్ట్రన్ అఫ్రోమోంటేన్
7. హార్‌న ఆఫ్ ఆఫ్రికా
8. మడగాస్కర్ - హిందూ మహాసముద్ర దీవులు
ఆసియా పసిఫిక్
1. పశ్చిమ కనుమలు - శ్రీలంక | 2. హిమాలయాలు |
3. ఇండో బర్మా | 4. నైరుతి చైనా |
5. ఫిలిప్పీన్‌స | 6. సుందా లాండ్ |
7. వాలేసియా | 8. న్యూ కాలిడోనియా |
9. ఈస్ట్ మెలనేసియా అడవులు | 10. పాలినేసియా మైక్రోనేసియా |
11. న్యూజిలాండ్ | 12. జపాన్ |
13. నైరుతి ఆస్ట్రేలియా | 14. తూర్పు ఆస్ట్రేలియా |