ఇస్రో టెలీ మెడిసిన్ సేవలు
- గ్రామీణ ప్రాంత ఆరోగ్య కేంద్రాలను పట్టణాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు అనుసంధానం చేసి టెలీకన్సల్టేషన్, చికిత్సలను అందించడంతోపాటు గ్రామీణ ప్రాంత వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం.
- వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ వైద్య కళాశాలలు, పీజీ మెడికల్ సంస్థలు, మెడికల్ సంస్థలు, ఎయిమ్స్ తరహా ఆసుపత్రులను అనుసంధానం చేసి వైద్య రంగంలో శిక్షణ అందించడం.
- మొబైల్ టెలివిజన్ విధానంలో మొబైల్ మెడికల్ యూనిట్‌ల ద్వారా మారు మూల, పర్వత ప్రాంత గ్రామాల్లో మెడికల్ క్యాంపులను నిర్వహించి టెలీ అఫ్తాల్మాలజీ, డయాబెటిక్ స్క్రీనింగ్ సేవలను అందించడంతో పాటు టీకా కార్యక్రమాలను నిర్వహించడం.
- విపత్తుల కాలంలో అత్యవసర వైద్య సేవలకు కావాల్సిన టెక్నాలజీ కనెక్టివిటీని అందించడం.
1.5 లక్షల మందికి లబ్ధి
ప్రస్తుతం 306 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఇస్రో టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిని 16 మొబైల్ టెలీ మెడిసిన్ యూనిట్స్, 60 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు అనుసంధానించారు. జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్ష దీవులు, ఈశాన్య రాష్ట్రాలు వంటి ప్రాంతాల్లో సైతం టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటక, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో రాష్ట్రస్థాయి టెలీ మెడిసిన్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేశారు. ఏటా సుమారు లక్షన్నర మంది టె లీమెడిసిన్ సేవల ద్వారా లబ్ధి పొందుతున్నారు.
ఆస్ట్రోశాట్
విశ్వ రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో ఆస్ట్రోశాట్‌ను రూపొందించి ప్రయోగించింది. 2015 సెప్టెంబర్ 28న పీఎస్‌ఎల్‌వీ - సీ 30 ద్వారా దీన్ని ప్రయోగించారు.
ఆస్ట్రోశాట్ లిఫ్ట్ ఆఫ్ బరువు 1513 కిలోలు. 650 కి.మీ కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ30 దీన్ని ప్రయోగించింది. ఇది మల్టీ వేవ్‌లెంత్ (బహుళ తరంగదైర్ఘ్య) ఉపగ్రహం. ఆప్టికల్, అతినీలలోహిత, ఎక్స్ కిరణాల వంటి కిరణాల తరంగదైర్ఘ్యంతో ఇది విశ్వాన్ని అధ్యయనం చే స్తుంది.
ప్రధాన లక్ష్యాలు
- న్యూట్రాన్, నక్షత్రాలు, కృష్ణబిలాలు ఉన్న నక్షత్ర సముదాయంలో అధిక శక్తి ప్రక్రియలను అర్థం చేసుకోవడం.
- న్యూట్రాన్, నక్షత్రాలపై అయస్కాంత ప్రభావాలను అంచనా వేయడం.
- పాలపుంత ఆవల ఉన్న నక్షత్ర సముదాయాల్లో కొత్త నక్షత్రాల పుట్టుక, అక్కడి అధిక శక్తి వ్యవస్థలపై సమాచారం సేకరించడం
- అతినీలలోహిత కిరణాల సాయంతో విశ్వాన్ని లోతుగా శోధించడం.
- విశ్వంలో శక్తిమంత ఎక్స్-కిరణాల మూలాలను గుర్తించడం.
పేలోడ్‌లు
ఆస్ట్రోశాట్ ఉపగ్రహంలో మొత్తం 5 పేలోడ్‌లు ఉన్నాయి. అవి...
- అల్ట్రావెలైట్ ఇమేజింగ్ టెలిస్కోపు: ఇది విశ్వాన్ని దృగ్గోచర, అతినీలలోహిత కిరణాలలో అధ్యయనం చేస్తుంది.
- లార్జ్ ఏరియా ఎక్స్ రే ప్రొపల్షనల్ కౌంటర్: పాలపుంతల కేంద్రాలు, నక్షత్రాల నుంచి ఎక్స్-కిరణాల మధ్య భేదాలను అధ్యయనం చేస్తుంది.
- సాఫ్ట్ రే టెలిస్కోపు: సుదూర రోదసి నిర్మాణాల నుంచి వచ్చే ఎక్స్-కిరణాల పటలాన్ని (0.38 జ్ఛుగ పరిధి గల) అధ్యయనం చేస్తుంది.
- కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్: 10- 100 కిలో ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి కలిగి ఎక్స్- కిరణాలను పసిగడుతుంది.
- స్కానింగ్ స్కై మానిటర్: ఆకాశంలో ఎక్స్-రే కిరణాల మూలాలను అధ్యయనం చేస్తుంది.
కార్టోశాట్
ఇస్రో ప్రత్యేకంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం.. కార్టోశాట్. ఇప్పటి వరకు 5 కార్టోశాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. భారత అంతరిక్ష కార్యక్రమాల్లోని రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ (ఐఆర్‌ఎస్) లో భాగంగా కార్టోశాట్ శ్రేణి ఉపగ్రహాలను ఇస్రో అభివృద్ధి చేసింది.
ఉపగ్రహం | ప్రయోగ నౌక | ప్రయోగ తేది |
కార్టోశాట్ - 1 | పీఎస్‌ఎల్‌వీ-సీ6 | మే 5, 2005 |
కార్టోశాట్ - 2 | పీఎస్‌ఎల్‌వీ-సీ7 | జనవరి 10, 2007 |
కార్టోశాట్ - 2 ఏ | పీఎస్‌ఎల్‌వీ-సీ9 | ఏప్రిల్ 28, 2008 |
కార్టోశాట్ - 2బీ | పీఎస్‌ఎల్‌వీ-సీ15 | జూలై 12, 2010 |
కార్టోశాట్ - 2సీ | పీఎస్‌ఎల్‌వీ-సీ34 | జూన్ 22, 2016 |
ఈ ఉపగ్రహాలను ప్రధానంగా కార్టోగ్రఫీ అనువర్తనాలను విస్తరించేందుకు ఉద్దేశించారు. భారీ స్థాయి భూ ఉపరితల పటాలను రూపొందించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలికసదుపాయాల అభివృద్ధికి ఈ ఉపగ్రహాలు తోడ్పడతాయి.
ముఖ్య ఉపయోగాలు
- గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ రూపకల్పన.
- జల, భౌమ, జీవ, ఖనిజ, అటవీ వనరుల సమాచార సేకరణ, నిర్వహణ.
- తీర ప్రాంత ఆవరణ వ్యవస్థల అధ్యయనం, వాతావరణ పరిశోధన.
- ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం అండ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం అభివృద్ధి.
ఈ ఉపగ్రహాల్లో అత్యాధునిక పాన్‌క్రొమాటిక్ కెమెరాలు అనే రిమోట్ సెన్సింగ్ సెన్సర్లు ఉంటాయి. దృగ్గోచర కాంతిలో అధిక సృష్టతతో భూమి ఉపరితలాన్ని చిత్రీకరించేందుకు ఇవి ఉపయోగపడతాయి. కార్టోశాట్ -2సీతో ఇస్రో అత్యధికంగా 0.6 మీటర్ల రిజల్యూషన్ శక్తిని సాధించింది.
బ్యాండ్‌విడ్త్ - ట్రాన్స్‌పాండర్ల ఉపయోగాలు
ఉపగ్రహ కమ్యూనికేషన్‌లో సమాచార ప్రసారానికి ఉపయోగించే ఒక అప్‌లింక్, డౌన్‌లింక్ పౌన:పున్యాల కలయిక బ్యాండ్‌విడ్త్. గ్రౌండ్ స్టేషన్ నుంచి అంతరిక్ష కక్ష్యలోని ఉపగ్రహానికి సమాచారాన్ని ప్రసారం చేసే పౌన:పున్యం.. అప్ లింక్. ఉపగ్రహం నుంచి తిరిగి భూమిపై ఉన్న ఎర్త్ స్టేషన్‌కి సమాచారాన్ని ప్రసారం చేసే పౌన:పున్యం.. డౌన్‌లింక్. సమాచారాన్ని ప్రసారం చేసే అప్‌లింక్, డౌన్‌లింక్ పౌన:పున్యాలు వేరుగా ఉంటాయి. ఈ రకమైన సమాచార ప్రసారాన్ని నిర్వహించేందుకు కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఉన్న ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలు ట్రాన్స్‌పాండర్లు.
రిసీవర్, మాడ్యులేటర్, ట్రాన్స్‌మిటర్‌ల కలయిక ట్రాన్స్‌పాండర్. ఇది అప్‌లింకింగ్ ద్వారా సమాచారాన్ని సేకరించి, మాడ్యులేషన్ ద్వారా కొద్దిగా మార్చి, డౌన్‌లింకింగ్ ద్వారా భూమికి ప్రసారం చేస్తుంది. జెనీవాలోని ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్.. పౌర సేవలకు సంబంధించి దేశాలకు బ్యాండ్‌విడ్త్‌లను కేటాయిస్తుంది.
ఇస్రో నిర్వహిస్తున్న వివిధ బ్యాండ్‌విడ్త్‌లు/ట్రాన్స్‌పాండర్లు
- s బ్యాండ్: అప్‌లింకింగ్ 5.855 - 5.935 GHz, డౌన్‌లింకింగ్ 2.555 - 2.635 GHz
- cబ్యాండ్ లోయర్: అప్‌లింకింగ్ 5.725 - 5.925 GHz, డౌన్‌లింకింగ్ 3.4 - 3.7 GHz
- cబ్యాండ్: అప్‌లింకింగ్ - 5.925 - 6.425 GHz, డౌన్‌లింకింగ్ - 3.7 - 4.2 GHz
- cబ్యాండ్ (అప్పర్):అప్‌లింకింగ్ 6.425 - 7.075 GHz, డౌన్‌లింకింగ్ 4.2 - 4.8 GHz
- ku బ్యాండ్ : అప్‌లింకింగ్ 12.75 - 14.25 GHz, డౌన్‌లింకింగ్ 10.7 - 13.25 GHz
- kaబ్యాండ్: అప్‌లింకింగ్ 27 - 31.0 GHz, డౌన్‌లింకింగ్ 18.3 - 22.20 GHz
ట్రాన్స్‌పాండర్ల ద్వారా దూరదర్శన్ కార్యక్రమాల ప్రసారం, మొబైల్ కమ్యూనికేషన్, డెరైక్ట్- టు -హోం టీవీ బ్రాడ్‌కాస్టింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి.