రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు?
1. భారత ప్రధానమంత్రి రాజ్యాంగం ప్రకారం...
1) నియమించబడతాడు
2) ప్రత్యక్షంగా ఎన్నిక అవుతాడు
3) పరోక్షంగా ఎన్నిక అవుతాడు
4) అధిష్టానం నియమిస్తుంది
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(1) ప్రకారం ప్రధానమంత్రిని రాష్ర్టపతి నియమిస్తాడు. లోక్‌సభలో మెజారిటీ పార్టీ నాయకున్ని ప్రధానిగా రాష్ర్టపతి నియమిస్తాడు. ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు మెజారిటీ పార్టీల కూటమి నాయకున్ని ప్రధానిగా రాష్ర్టపతి నియమిస్తాడు.
- సమాధానం: 1
2. రాజ్యసభ సభ్యత్వంతో భారత ప్రధాని అయిన తొలి వ్యక్తి?
1. లాల్ బహదూర్ శాస్త్రి
2. ఇందిరా గాంధీ
3. చరణ్ సింగ్
4. దేవేగౌడ
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత ప్రధానిగా నియమించబడే వ్యక్తి పార్లమెంట్ ఉభయసభల్లో ఏ సభలోనైన సభ్యులై ఉండాలి. ఒకవేళ ఏ సభలో సభ్యుడు కాకున్నప్పటికి ప్రధాని కావచ్చు. కానీ 6 నెలల్లో ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి. ఇప్పటికి 14 మంది భారత ప్రధానుల్లో నలుగురు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానులు అయ్యారు. వారిలో ఇందిరాగాంధీ 1966లో రాజ్యసభకు నియామక సభ్యురాలిగా ప్రధానమంత్రి పదవి చేపట్టారు. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానులు అయిన మిగిలినవారు హెచ్.డి. దేవేగౌడ (1996), ఐ.కె. గుజ్రాల్ (1997); మన్మోహన్ సింగ్ (2004, 2009)
- సమాధానం: 2
3. కేంద్రంలో ప్రధానమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య గరిష్టంగా ఎంత ఉండవచ్చు?
1. పార్లమెంట్ సభ్యుల్లో 10% మంది
2. లోక్‌సభ సభ్యుల్లో 10% మంది
3. పార్లమెంట్ సభ్యుల్లో 15% మంది
4. లోక్‌సభ సభ్యుల్లో 15% మంది
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగం ప్రకారం ప్రారంభంలో మంత్రి మండలి సంఖ్యకు నిర్ణీత పరిమితి లేదు. కాని 91వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ప్రకారం మంత్రి మండలి పరిమాణం దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. ఆ విధంగా ప్రస్తుతం కేంద్రంలో ప్రధానితో కలుపుకొని మంత్రులు గరిష్టంగా 81 మంది ఉండవచ్చు. రాష్ట్రాల్లో కూడా దిగువసభ అయిన అసెంబ్లీ సభ్యుల సంఖ్య లో 15% మించకూడదు. చిన్న రాష్ట్రాల విషయంలో 12 మంది మంత్రులు ఉండవచ్చు.
- సమాధానం: 4
4. భారత ప్రధానమంత్రి కింది ఏ పద్ధతుల్లో పదవీచ్యుతుడు అయ్యే అవకాశం ఉంటుంది?
1) అవిశ్వాస తీర్మానం
2) విశ్వాస తీర్మానం
3) దన్యవాద తీర్మానం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత ప్రధానమంత్రి, మంత్రి మండలిని తొలగించటానికి లోక్‌సభకు వివిధ పద్ధతులు ఉన్నాయి.
అవి..
1) ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ సాధారణ మెజారిటీ ఆమోదించినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి.
2) అధికార పక్షం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ తిరస్కరించినప్పుడు ప్రభుత్వం పడిపోతుంది.
3) రాష్ర్టపతి ప్రసంగానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభ తిరస్కరించినప్పుడు
4) ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించినప్పుడు కూడా ప్రభుత్వం పడిపోతుంది.
- సమాధానం: 4
5. భారత ప్రధానమంత్రి హోదాలో పార్లమెంట్లో అడుగుపెట్టని భారత ప్రధానమంత్రి ఎవరు?
1) వి.పి. సింగ్
2) చంద్రశేఖర్
3) చరణ్ సింగ్
4) మొరార్జీ దేశాయ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత 4వ ప్రధాని మొరార్జీ దేశాయ్ 1979లో రాజీనామా చేయటంతో 64 మంది లోక్‌సభ సభ్యులు ఉన్న లోక్‌దళ్ పార్టీ నేత చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతుతో 1979 జూలై 28న భారత 5వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ లోక్‌సభ విశ్వాసం పొందటానికి ముందే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటంతో 1979 ఆగస్ట్ 20న రాజీనామా చేశారు. దీనితో అప్పటి రాష్ర్టపతి నీలం సంజీవరెడ్డి లోక్‌సభను రద్దు చేయటంతో ఆపద్దర్మ ప్రధానిగా కొనసాగారు. ఈ విధంగా 23 రోజులు ప్రధానిగా; 4నెలలు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగిన చరణ్ సింగ్ తన పదవీ కాలంలో పార్లమెంట్లో అడుగు పెట్టలేదు.
- సమాధానం: 3
6. కేంద్ర మంత్రిమండలి సమష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
1) రాష్ర్టపతి
2) పార్లమెంట్
3) లోక్‌సభ
4) సుప్రీంకోర్టు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు, వ్యక్తిగతంగా రాష్ర్టపతికి బాధ్యత వహిస్తారు. లోక్‌సభ విశ్వాసం మేరకు ప్రభుత్వం పదవిలో ఉంటుంది. ఆర్టికల్-75(3) ప్రకారం అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని తొలగించే అధికారం లోక్‌సభకు ఉంటుంది. ప్రధానిపై లేదా ఏదైనా మంత్రిపై అభియోగాలు వస్తే దానికి మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించాలి. ప్రధానితోనే మంత్రి మండలి ఏర్పడుతుంది. అతని రాజీనామాతో మంత్రి మండలి అంతా రద్దు అవుతుంది. ప్రధాని, మంత్రి మండలి ‘సమష్టి బాధ్యత’ సూత్రంపై పనిచేస్తుంది.
- సమాధానం: 3
7. భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ....
1) సమానులే
2) కేబినేట్ మంత్రులు ఉన్నతులు
3) మంత్రులు మూడు రకాలు
4) పైవన్నీ సరైనవి
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ సమానులే. రాజ్యాంగంలో మంత్రిమండలి వర్గీకరణ గురించి లేదు. కాని 1949లో జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గ వర్గీకరణకై గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ వేశారు. ఈ కమిటీ మంత్రి మండలిని మూడు రకాలుగా విభజించింది.
అవి..
1. కేబినేట్ మంత్రులు: వీరు అత్యంత ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తారు.
2. సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా): అంతగా ప్రాముఖ్యత లేని శాఖలు నిర్వహిస్తారు.
3. సహాయ మంత్రులు: వీరు కేబినేట్ మంత్రులకు సహాయకంగా ఉంటారు.
- సమాధానం: 1
8. రెండు సార్లు భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి?
1) వల్లభబాయ్ పటేల్
2) చరణ్ సింగ్
3) దేవీలాల్
4) వై.బి. చవాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజ్యాంగం ప్రకారం ఉప ప్రధానమంత్రి పదవి లేదు. కానీ కొన్నిసార్లు పాలనా సౌలభ్యం కోసం లేదా రాజకీయ అవసరాల కోసం ఉపప్రధానమంత్రి పదవి ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏడుగురు ఉపప్రధానులుగా పనిచేయగా వల్లభ్‌భాయ్ పటేల్ (1947-50) మొదటి ఉపప్రధాని కాగా, ఎల్. కె. అద్వాని 7వ ఉప ప్రధాని (2002-04)గా పనిచేశారు. హరియాణకు చెందిన జనతాదళ్ నేత దేవీలాల్ రెండుసార్లు (1989-90, 1990-91) ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించారు.
- సమాధానం: 3
9. 1989లో భారతదేశ 7వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన వి. పి. సింగ్ ఏ కూటమికి నాయకత్వం వహించాడు?
1) యునెటైడ్ ఫ్రంట్ (UF)
2) నేషనల్ ఫ్రంట్ (NF)
3) నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స (NDA)
4) యునెటైడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స (UPA)
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1989లో జరిగిన 9వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 197 సీట్లతో మొదటి స్థానంలో నిలువగా జనతాదళ్-143; బీజేపీ-85 స్థానాలతో రెండు, మూడు స్థానాలలో నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవటంతో వి.పి. సింగ్ నేతృత్వంలో జనతాదళ్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ మొదలగు పార్టీలు నేషనల్ ఫ్రంట్ కూటమి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1996లో హెచ్.డి. దేవేగౌడ, 1997లో ఐ.కె. గుజ్రాల్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం: యునెటైడ్ ఫ్రంట్ కూటమి. 1998, 1999లలో వాజ్పాయ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా 2004, 2009లలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన కూటమి యూపీఏ ప్రభుత్వం.
- సమాధానం: 2
10. 1966లో భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన చారిత్రక ఒప్పందం ఏమిటి?
1) సిమ్లా ఒప్పందం
2) తాష్కెంట్ ఒప్పందం
3) పంచశీల ఒప్పందం
4) లాహోర్ ఒప్పందం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1965లో భారత్-పాక్ యుద్ధం తర్వాత పరస్పర సహకారానికై 1966లో తాష్కెంట్ ఒప్పందం జరిగింది. దీనిపై భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకాలు చేశారు. పంచశీల ఒప్పందంపై (1954) భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ-ఎన్-లైలు సంతకాలు చేశారు. సిమ్లా ఒప్పందంపై (1972) భారత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. లాహూర్ ఒప్పందంపై (1999) భారత ప్రధాని వాజ్పాయ్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు సంతకాలు చేశారు.
- సమాధానం: 2
11. కింది వాటిలో సరికానిది ఏది?
1) విదేశాంగ విధాన రూపకర్త - నెహ్రూ
2) సంక్షేమ పథకాలకు ఆద్యుడు - లాల్ బహదూర్ శాస్త్రి
3) సమాచార సాంకేతిక విప్లవానికి ఆద్యుడు -రాజీవ్ గాంధీ
4) ఆర్థిక సంస్కరణల పితామహుడు - పీవీ నరసింహారావు
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. బ్యాంక్‌ల జాతీయకరణ (1969), రాజభరణాల రద్దు (1969), 20 సూత్రాల పథకం (1975) వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. 1971లో లోక్‌సభ ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీని సాధించి పెట్టారు.
- సమాధానం: 2
12. ఆర్టికల్-352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు విధించారు?
1) ఒకసారి
2) రెండు సార్లు
3) మూడు సార్లు
4) విధించలేదు
- View Answer
- సమాధానం: 2
వివరణ: జాతీయ అత్యవసర పరిస్థితిని ఇప్పటి వరకు మూడు సార్లు (1962, 1971, 1975) విధిస్తే అందులో రెండు సార్లు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు విధించారు. 1971లో భారత్-పాక్ యుద్ధం సందర్భంగా విధించగా; 1975లో అంతర్గత కల్లోలం కారణంగా మరోసారి విధించారు.
- సమాధానం: 2
13. రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు?
1) గుల్జారిలాల్ నందా
2) హిదయతుల్లా
3) చరణ్ సింగ్
4) ఐ.కె. గుజ్రాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతదేశానికి రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి గుల్జారీలాల్ నంద. 1964 మే 27న తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణంతో నాటి హోంశాఖ మంత్రి గుల్జారీలాల్ నంద తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. 1966 జనవరి 11న రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో రెండోసారి తాత్కాలిక ప్రధానిగా రెండోసారి కొంత కాలం గుల్జారీలాల్ నంద తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించాడు.
- సమాధానం: 1
14. వెనుకబడిన వారి స్థితిగతులను పరిశీలించి తగిన సూచనలు చేయటానికి మండల్ కమిషన్‌ను నియమించిన ప్రధానమంత్రి?
1) ఇందిరా గాంధీ
2) మొరార్జీ దేశాయ్
3) వి.పి. సింగ్
4) పీవీ నరసింహారావు
- View Answer
- సమాధానం: 2
వివరణ: మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1978లో బి.పి. మండల్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించటానికి బి.సి. క మిషన్‌ను వేశారు. ఇది 1980లో నివేదిక సమర్పిస్తూ బీసీలకు ఓబీసీ పేరుతో 27% రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. 1990లో వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దీని అమలుకై ప్రయత్నించగా దేశవ్యాప్తంగా ఉద్యమం రావడంతో నిలిపి వేశాడు. ఇందిరా సహాని కేసులో (1992) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత నాటి ప్రధాని పి.వి. నరసింహారావు విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లను కల్పించాడు.
- సమాధానం: 2
15. భారత్ పోఖ్రాన్లో అణు పరీక్షలకు ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు నిర్వహించింది?
1) జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ
2) లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ
3) ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్
4) ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పాయ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్ తొలిసారిగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజస్థాన్ రాష్ర్టంలో థార్ ఎడారిలో పోఖ్రాన్ ప్రాంతంలో ‘బుద్దుడు నవ్వాడు’ అనే నామంతో 1974 మే14న అణుపరీక్ష నిర్వహించింది. అనంతరం వాజ్పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1998 మే11న, 1998 మే13న ‘శక్తి-98’ అనే నామంతో మరోసారి అణు పరీక్షలు నిర్వహించింది. తద్వార భారత్ అణుబాంబు సామర్థ్యం ఉన్న 6వ దేశంగా గుర్తించబడింది.
- సమాధానం: 4
16. విశ్వాస తీర్మానంలో ఒకే ఒక ఓటుతో లోక్‌సభలో ఓడిపోయి పదవిని కోల్పోయిన భారత ప్రధానమంత్రి ఎవరు?
1) వి.పి. సింగ్
2) హెచ్.డి. దేవేగౌడ
3) ఐ.కె. గుజ్రాల్
4) అటల్ బిహరీ వాజ్పాయ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1998లో 12వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచింది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి అటల్ బిహారీ వాజ్పాయ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్డీఏ కూటమికి 1999లో ఏఐఏడీఎంకే పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్పాయ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. నాటి రాష్ర్టపతి కె.ఆర్. నారాయణన్ ఆదేశానుసారం వాజ్పాయ్ ప్రభుత్వం 1999 ఏప్రిల్ 17లో లోక్‌సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా దానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 270 ఓట్లు వచ్చాయి. ఈ విధంగా ఓకే ఓటుతో వాజ్పాయ్ ప్రభుత్వం పడిపోయింది.
- సమాధానం: 4