Skip to main content

భారతదేశంలో ప్రాంతీయ అసమానతలను కొలవడానికి ఉపకరించే సూచికలు ఏవి?

భారత్‌లో ప్రాంతీయ అసమానతలు :
భారత్ అభివృద్ధి వ్యూహంలో ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధన ప్రధానమైంది. వృద్ధి అవకాశాలను దేశంలోని అన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు, ఒకే రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలు అందుకోలేకపోవడానికి సహజ, మూలధన, మానవ వనరుల లభ్యతలోని వ్యత్యాసాలను ప్రధానంగా పేర్కొనవచ్చు. ప్రాంతీయ అసమానతల నివారణలో రాష్ట్రాల పాత్ర ప్రధానమైంది.

1. ప్రాంతీయ అసమానతలు - సూచికలు :

భారతదేశంలో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు, ఒకే రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలను తెలుసుకోవడానికి కింది సామాజిక-ఆర్థిక సూచికలు ఉపకరిస్తాయి.
1. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలోను, రాష్ట్రాల స్థాయిలో అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకరణ
2. వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలు
3. వ్యవసాయ, పారిశ్రామిక రంగ అభివృద్ధిలో రాష్ట్రాలు, ఒకే రాష్ర్టంలో వివిధ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు
4. పేదరిక రేఖ దిగువన నివసించే జనాభా
5. విద్యుత్ తలసరి వినియోగంలో వ్యత్యాసం
6. పట్టణీకరణలో వ్యత్యాసాలు
7. అవస్థాపనా సౌకర్యాల లభ్యతలో తేడా
8. ప్రణాళికా యంత్రాంగం వైఫల్యం
9. నీటిపారుదల వసతి అధికంగా ఉన్న ప్రాంతాలకే హరిత విప్లవం పరిమితం కావడం
10. సామాజిక రంగ అభివృద్ధిలో వ్యత్యాసాలు
11. కేంద్ర పథకాల రూపకల్పనలో ప్రతి రాష్ర్టం తలసరి అవసరాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం
12. వెనుకబడిన రాష్ట్రాలలో అనుబంధ పరిశ్రమల వృద్ధి తక్కువగా ఉండటం.

2. రాష్ట్రాల నిర్మాణత, ఆర్థిక స్థితిగతులు:
  • భారత్‌లో వెనుకబడిన రాష్ట్రాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అవస్థాపనా సౌకర్యాల కొరత కారణంగా ఆయా రాష్ట్రాలు పెట్టుబడులను అకర్షించలేకపోతున్నాయి. సొంత వనరులతో ఆయా సౌకర్యాలను పొందడంలో వెనుకబడిన రాష్ట్రాలు సమస్యను ఎదుర్కొంటున్నాయి. అధిక వెనుకబడిన రాష్ట్రాలు తూర్పు, ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో అసంఘటిత రంగ పరిమాణం అధికం.
  • కేంద్ర గణాంక సంస్థ అంచనాల ప్రకారం 2016-17లో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ జార్ఖండ్, ఒడిశాలు వాస్తవిక తలసరి ఆదాయం పరంగా వెనుకబడిన రాష్ట్రాలు. ఆయా రాష్ట్రాల తలసరి ఆదాయాలలోనూ వ్యత్యాసాలను గమనించవచ్చు. వెనుకబడిన రాష్ట్రాల గ్రూపులో బిహార్ తలసరి ఆదాయం అల్పంగా 2016-17లో రూ.26,693 కాగా ఒడిశా తలసరి ఆదాయం అధికంగా రూ.63,674గా నమోదైంది.
  • వెనుకబడిన రాష్ట్రాల గ్రూపులో ఉత్తరప్రదేశ్ వాటా భారత్ స్థూల దేశీయోత్పత్తిలో 2016-17లో అధికంగా 7.9 శాతం కాగా జార్ఖండ్ వాటా అల్పంగా 1.7 శాతం.
  • పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లు Average Income States గా కేంద్ర గణాంక సంస్థ గణాంకాలు వెల్లడిస్తాయి. ఈ గ్రూపులో పంజాబ్ తలసరి ఆదాయం అధికంగా రూ.1,03,726 కాగా అల్పంగా పశ్చిమ బెంగాల్ (రూ.68,578)లో నమోదైంది.
  • Average Income States గ్రూపులో పశ్చిమ బెంగాల్ వాటా భారత్ స్థూల దేశీయోత్పత్తిలో అధికం (6.5 శాతం) కాగా జార్ఖండ్ వాటా అల్పంగా (1.8 శాతం) నమోదైంది.
  • తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ర్ట, గుజరాత్, హరియాణాలు అధిక ఆదాయ రాష్ట్రాలు. ఈ గ్రూపులో వాస్తవిక తలసరి ఆదాయ పరంగా హరియాణా (రూ.1,43,211) ప్రథమ స్థానంలో నిలువగా, తమిళనాడు చివరి స్థానంలో (రూ.1,18,915) ఉంది.
  • అధిక ఆదాయ రాష్ట్రాల గ్రూపులో భారత్ జి.డి.పి.లో మహారాష్ర్ట వాటా అధికం (14.9 శాతం) కాగా హరియాణా వాటా అల్పంగా (3.6 శాతం) నమోదైంది.
  • వెనుకబడిన రాష్ట్రాలలో పేదరికం 2011-12లో అధికంగా జార్ఖండ్‌లో 36.96 శాతం కాగా అల్పంగా ఉత్తరప్రదేశ్‌లో 29.43 శాతం.
  • Average Income States లో పేదరిక రేఖ దిగువన నివసించే జనాభా అధికంగా చత్తీస్‌ఘడ్ (39.93 శాతం)లో నమోదు కాగా అల్పంగా పంజాబ్ (8.26 శాతం)లో నమోదైంది.
  • అధిక ఆదాయ రాష్ట్రాలలో పేదరిక రేఖ దిగువన నివసించే జనాభా 2011-12లో కర్ణాటకలో అధికం (20.91 శాతం)గాను, అల్పంగా కేరళలో (7.05 శాతం) నమోదైంది.
  • మానవాభి సూచీ విలువ పరంగా 2011లో వెనుకబడిన రాష్ట్రాల గ్రూపులో ఉత్తరప్రదేశ్ (0.468), Average Income States గ్రూపులో పంజాబ్ (0.569), అధిక-ఆదాయ రాష్ట్రాల గ్రూపులో కేరళ (0.625) ప్రథమ స్థానంలో నిలిచాయి.
3. వ్యవసాయ పరపతి స్థూల పంట విస్తీర్ణం - అసమానతలు:
  • గత దశాబ్ద కాలంలో భారత్‌లో వ్యవసాయ పరపతి వృద్ధి 16.5 శాతం. సంస్థాపరమైన వ్యవసాయ పరపతి ఆధారాలయిన షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు నిర్వహించే వ్యవసాయ పరపతి ఖాతాలు 2007-08లో 440 లక్షలు కాగా 2017-18లో 1,139 లక్షలకు పెరిగాయి. మొత్తం వ్యవసాయ పరపతి ఖాతాలు, రుణం మంజూరులో ఐదు దక్షిణాది రాష్ట్రాల వాటా 2017-18లో 43 శాతం. తర్వాతి స్థానం ఉత్తర ప్రాంతం నిలిచింది. అవస్థాపనా సౌకర్యాల అందుబాటు, పరపతి డెలివరీ కేంద్రాలు అధికంగా ఉండటం వల్ల దక్షిణాది రాష్ట్రాలు వ్యవసాయ పరపతి లభ్యతలో అధిక ప్రయోజనం పొందాయి.
  • మొత్తం సంస్థాపరమైన వ్యవసాయ పరపతిలో ఉత్తరాది రాష్ట్రాల వాటా 2017-18లో 22.02 శాతం, సెంట్రల్ 14.43 శాతం, పశ్చిమ ప్రాంతం 12.04 శాతం, తూర్పు ప్రాంతం 8.10 శాతం కాగా ఈశాన్య రాష్ట్రాల వాటా అల్పంగా 0.88 శాతం మాత్రమే. అధిక వ్యవసాయ ఖాతాల పరంగా దక్షిణాది రాష్ట్రాల వాటా మొత్తం వ్యవసాయ ఖాతాలలో 2017లో 43.04 శాతం, సెంట్రల్ 17.63 శాతం, తూర్పు రాష్ట్రాలు 14.29 శాతం, ఉత్తరాది రాష్ట్రాలు 12.71 శాతం, పశ్చిమ రాష్ట్రాలు 10.96 శాతం, ఈశాన్య రాష్ట్రాలు 1.37 శాతం వాటాను కల్గి ఉన్నాయి.
  • మొత్తం స్థూల పంట విస్తీర్ణంలో సెంట్రల్ ప్రాంత వాటా అధికంగా 2017-18లో 27.26 శాతం కాగా, ఉత్తరాది రాష్ట్రాలు 20.11 శాతం, దక్షిణాది రాష్ట్రాలు 18.68 శాతం, పశ్చిమ ప్రాంతం 16.47 శాతం, తూర్పు ప్రాంతం 14.65 శాతం, ఈశాన్య రాష్ట్రాలు 2.83 శాతం వాటాను కల్గి ఉన్నాయి. మొత్తం స్థూల పంట విస్తీర్ణంకు సంబంధించి తన వాటాకు అనుగుణంగా తూర్పు ప్రాంతం వ్యవసాయ పరపతిని పొందలేకపోయింది. రైతు కుటుంబాల సంఖ్య, వ్యవసాయ ఖాతాల మధ్య అధిక తేడాను సెంట్రల్, తూర్పు ప్రాంతాలలో గమనించవచ్చు. దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి వ్యవసాయ పరపతికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ తగిన మొత్తంలో పరపతి లభ్యం కానందు వల్ల వ్యవసాయ రంగ అభివృద్ధిలో ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగాయి. సంస్థాపరమైన పరపతి ఆధారాల శాఖలు గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో కలుపుకొని దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ. మొత్తం శాఖలలో దక్షిణాది రాష్ట్రాల వాటా 2017-18లో 27.74 శాతం కాగా, సెంట్రల్ ప్రాంతం 21.51 శాతం, తూర్పు ప్రాంతం 17.99 శాతం, ఉత్తర ప్రాంతం 16.62 శాతం, పశ్చిమ ప్రాంతం 12.98 శాతం, ఈశాన్య ప్రాంతం 3.16 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
4. పారిశ్రామికాభివృద్ధి - ప్రాంతీయ అసమానతలు :
  • స్వాతంత్య్రానంతరం భారత్‌లో పారిశ్రామికాభివృద్ధి కొన్ని రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనే కేంద్రీకృతమైంది. తద్వారా పారిశ్రామికాభివృద్ధిలో ఇతర ప్రాంతాలు వెనుకబడి ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. మహారాష్ర్టలోని ముంబై, థానే, పుణెలో; పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, హౌరా, అసన్‌సోల్; తమిళనాడులోని చైన్నై, కోయంబత్తూరు, గుజరాత్‌లోని బరోడా, అహ్మదాబాద్‌లో పారిశ్రామికాభివృద్ధి కేంద్రీకృతం కాగా ఆయా రాష్ట్రాలలోని మిగిలిన ప్రాంతాలు పారిశ్రామికంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి.
  • పట్టణ ప్రాంతాలలో పరిశ్రమల కేంద్రీకరణ ప్రాంతీయ అసమానతలను పెంచడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై ‘సాంఘిక వ్య యం’ రూపంలో అధిక భారం పెరగడానికి కారణమైంది. ముంబై, కోల్‌కత్తాతో పాటు దేశంలోని ఇతర నగరాలలో సాంఘిక వ్యయంలో పెరుగుదల అధికమవుతుంది. సరిపోను స్థలం లేనందువల్ల భూమి వ్యయాలు పెరుగుదలతో పాటు సర్వీసింగ్, యుటిలిటీస్ ధరలు పెరిగాయి.
  • పారిశ్రామికాభివృద్ధి ద్వారా ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధనలో ప్రణాళికా రచయితలు విఫలమయ్యారు. బిహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఒడిశాలతో పోల్చినప్పుడు మహారాష్ర్ట, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అధిక పారిశ్రామికీకరణ జరిగింది. ఆయా రాష్ట్రాలలోను పారిశ్రామికీకరణను అన్ని ప్రాంతాలకు విస్తరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
  • భారత్‌లో ప్రాంతాల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిశీలించినప్పుడు 2000-2017 మధ్య కాలంలో మొత్తం ఎఫ్.డి.ఐ.లలో మహారాష్ర్టలోని ముంబై వాటా 30.7 శాతం కాగా, న్యూఢిల్లీ 20.8 శాతం, తమిళనాడులోని చెన్నై 7.5 శాతం, కర్ణాటకలోని బెంగళూరు 6.9 శాతం, గుజరాత్‌లోని అహ్మదాబాద్ 5.1 శాతం, తెలంగాణలోని హైదరాబాద్ 4.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
5. తలసరి విద్యుత్ వినియోగం :
  • తలసరి విద్యుత్ వినియోగంలో తేడా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలు పెరగడానికి కారణమైంది. తలసరి విద్యుత్ వినియోగం ఆధారంగా ఆయా రాష్ట్రాలలో ఆర్థిక కార్యకలాపాల స్థాయిని తెలుసుకోవచ్చు. పంజాబ్, గుజరాత్, హరియాణా, మహారాష్ర్టలో అధిక పారిశ్రామికీకరణ, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కారణంగా అధిక తలసరి విద్యుత్ వినియోగం నమోదు అవుతుంది. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలయిన అస్సాం, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లో తలసరి విద్యుత్ వినియోగం తక్కువగా ఉండటాన్ని బట్టి రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం స్పష్టమవుతుంది. పారిశ్రామికీకరణ వేగవంతమైన రాష్ట్రాల జనాభాలో పారిశ్రామిక శ్రామికుల జనాభా నిష్పత్తి అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు.
  • 2016-17లో తలసరి విద్యుత్ వినియోగం గుజరాత్‌లో 2279 Kwh కాగా, పంజాబ్‌లో 2028 Kwh, హరియాణా 1975 Kwh, తమిళనాడులో 1847 Kwh కాగా తెలంగాణలో 1551 Kwh, ఆంధ్రప్రదేశ్‌లో 1319 Kwh గా నమోదైంది.
6. ప్రభుత్వ విత్త యాజమాన్యం :
  • వనరుల బేస్, విత్త నిర్మాణత ఆధారంగా 2015-16లో ముఖ్య రాష్ట్రాలను పరిశీలించినప్పుడు బీహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలను అల్ప రెవెన్యూ బేస్ రాష్ట్రాలు గాను; మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ర్టను Average బేస్ రాష్ట్రాలుగాను, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, హరియాణా, కర్ణాటక, ఒడిశా, కేరళను అధిక-బేస్ రాష్ట్రాలుగాను వర్గీకరించవచ్చు. పన్ను- జి.ఎస్.డి.పి. నిష్పత్తి పరంగా అల్ప-బేస్ రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ (7.2 శాతం), Average - base రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ (7.6 శాతం) అధిక-బేస్ రాష్ట్రాలలో కర్ణాటక (7.5 శాతం) ప్రథమ స్థానంలో నిలిచాయి. మొత్తం పన్ను-జీడీపీ నిష్పత్తి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలలో మిగిలిన దేశంలోని ముఖ్య రాష్ట్రాలతో పోల్చినప్పుడు తక్కువగా నమోదైంది.
  • కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా పరిశీలించినప్పుడు పదకొండో ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం అల్పాదాయ రాష్ట్రాల వాటా 48.28 శాతం కాగా 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 42.89 శాతానికి తగ్గింది.
  • పదమూడో ఆర్థిక సంఘం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు మొత్తం బదిలీ రూ.17.07 లక్షల కోట్లు కాగా పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఈ మొత్తం రూ.42.60ల కోట్లకు పెరిగింది. మొత్తం బదిలీలో పెరుగుదల 149.6 శాతం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ మొత్తాన్ని పరిశీలించినప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన పంజాబ్, మహారాష్ర్ట, కేరళలు అధికంగా లబ్ది పొందగా పేద రాష్ట్రాలైన బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లు తక్కువ ప్రయోజనం పొందాయి.
  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులలో నాలుగు రాష్ట్రాల (మహారాష్ర్ట, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గుజరాత్) వాటా 40 శాతం. బీహార్‌తో పోల్చినప్పుడు తలసరి స్థూల పెట్టుబడి మహారాష్ర్టలో ఏడు రెట్లు ఎక్కువ.
  • అభివృద్ధి ప్రక్రియలో బహిర్గత సహాయం ప్రధాన పాత్ర వహిస్తుంది. 2002 ఏప్రిల్ నుంచి 2017 అక్టోబర్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ హామీపై రాష్ర్ట ప్రభుత్వాలు సమీకరించిన మొత్తం బహిర్గత సహాయంలో తక్కువ పెట్టుబడి ప్రాంతం 23.6 శాతం, అధిక పెట్టుబడి ప్రాంతం వాటా 31.5 శాతంగా నమోదైంది.
  • 2002 ఏప్రిల్ నుంచి 2017 అక్టోబర్ మధ్యకాలంలో మొత్తం బహిర్గత సహా యంలో మూడు దక్షిణాది రాష్ట్రాల (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక) వాటా 30 శాతం కాగా జార్ఖండ్ వాటా 0.8 వాతం మాత్రమే, జార్ఖండ్ తో పోల్చినప్పుడు కేరళకు సంబంధించి తలసరి బహిర్గత సహాయం ఏడు రెట్లు ఎక్కువ.
  • బ్యాంకింగ్ రంగంలోని మొత్తం డిపాజిట్లలో పేద రాష్ట్రాల వాటా 18 శాతం కాగా పరపతిలో వాటా 10 శాతం మాత్రమే. పేద రాష్ట్రాల పరపతి- డిపాజిట్ నిష్పత్తి 40.5 శాతం కాగా అధిక- ఆదాయ రాష్ట్రాల నిష్పత్తి 88.6 శాతం. ముఖ్య రాష్ట్రాలకు సంబంధించి 2016-17లో పరపతి- డిపాజిట్ నిష్పత్తి మహారాష్ర్టలో అధికం కాగా జార్ఖండ్‌లో తక్కువ.
Published date : 11 Jan 2020 04:16PM

Photo Stories