Skip to main content

2020-21 కేంద్ర బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు ఎంత కేటాయించారు?

కేంద్ర బడ్జెట్ 2020-21 విశ్లేషణ :
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక సమష్టి చర్యల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే క్రమంలో అనేక రంగాల్లో సంస్కరణలను కేంద్రబడ్జెట్ 2020-21లో పొందుపర్చారు. ‘Ease of living' theme ఆధారంగా కేంద్రబడ్జెట్ రూపొందించారు. ఆకాంక్ష భారత దేశం, అందరికీ ఆర్థికాభివృద్ధి ఫలాలు, సమాజ సంరక్షణ అనేవి కేంద్ర బడ్జెట్ ప్రధాన థీమ్స్. పనిచేసే జనాభాను 2030 నాటికి భారత్ అధికంగా కలిగి ఉంటుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవల డెలివరీ, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ద్వారా భౌతిక జీవననాణ్యత పెంపు, Disaster resilience ద్వారా నష్టభయ నివారణ, పెన్షన్, బీమా Penetration ద్వారా సాంఘిక భద్రత కల్పన బడ్జెట్ లక్ష్యాలుగా ఆర్థికమంత్రి పేర్కొన్నారు. దేశంలో ప్రతిపౌరుని ease of living మెరుగుపరచడంతోపాటు అధిక ఉపాధికల్పనకు బడ్జెట్‌లో, నేషనల్ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌కు రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించారు.

  1. వివిధ పథకాలకు కేటాయింపులు 2020-21:
    • రైతులకు ఆదాయ మద్ధతుకు సంబంధించిన పి.ఎం. కిసాన్ పథకానికి 2020-21 కేంద్ర బడ్జెట్‌లో అధికంగా రూ. 75,000 కోట్లు కేటాయించారు. 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21లో ఈ మొత్తంలో పెరుగుదల 37.9 శాతం.
    • మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వనరుల కేటాయింపులో రెండో స్థానం పొందింది. ప్రస్తుత బడ్జెట్‌తో ఈ పథకానికి రూ. 61,500 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోల్చినపుడు ఈ మొత్తంలో తగ్గుదల 13.4 శాతం.
    • పి.ఎం. కిసాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తర్వాత పథకాలకు సంబంధించిన వనరుల కేటాయింపులో వరుసక్రమంలో జాతీయ విద్యామిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఐసీడీఎస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రాధాన్యత పొందాయి.
    • ప్రధానమంత్రి గ్రామసడక్ యోజనకు రూ.19,500 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోల్చినపుడు ఈ మొత్తంలో పెరుగుదల 38.6 శాతం.

  2. మంత్రిత్వ శాఖ వ్యయం: 2020- 21:
    • బడ్జెట్ మొత్తం వ్యయంలో 53 శాతం అధిక కేటాయింపుల రూపంలో 13 మంత్రిత్వ శాఖలు పొందాయి. రక్షణ మంత్రిత్వశాఖకు బడ్జెట్‌లో అధికంగా రూ. 4,71,378 కోట్లు కేటాయించారు. కేంద్రప్రభుత్వ మొత్తం బడ్జెట్ వ్యయంలో రక్షణ శాఖకు కేటాయించిన మొత్తం 15 శాతం. తర్వాత హోం అఫైర్‌‌స; వ్యవసాయం, రైతు సంక్షేమం, కన్స్యూమర్ అఫైర్‌‌స, ఆహారం, ప్రజాపంపిణీ, గ్రామీణా భివృద్ధి వరుసక్రమంలో వనరుల కేటాయింపులో ప్రాధాన్యత పొందాయి.
    • 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2020-21లో రక్షణశాఖకు 5 శాతం, హోం అఫైర్‌‌స 20.2 శాతం, వ్యవసాయం, రైతు సంక్షేమం 30.1 శాతం, కన్స్యూమర్ అఫైర్‌‌సకు 6.2 శాతం అదనంగా కేటాయించారు. సమాచార రంగానికి జరిగిన కేటాయింపులో 129.3 శాతం పెరుగుదల ఏర్పడింది. BSNL, MTNL కు capital infusion తో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ప్రకటించిన గ్రాంటు కారణంగా సమాచార రంగానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 81,957 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులో 1.7 శాతం తగ్గుదల ఏర్పడింది.
    • 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21లో మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు కేటాయింపులో 4.7 శాతం, రోడ్లు, రవాణా, హైవేలు 10. 6 శాతం, రైల్వే 3.2 శాతం, హౌసింగ్, అర్బన్ అఫైర్‌‌స 18.4 శాతం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు కేటాయింపులో 3.9 శాతం పెరుగుదల ఏర్పడింది.

  3. సబ్సిడీలపై వ్యయం:
    • సబ్సిడీలపై వ్యయాన్ని ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 2,62,109 కోట్లుగా ప్రతిపాదించారు. 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21లో సబ్సిడీలపై వ్యయంలో తగ్గుదల 0.5 శాతం. ఎరువుల సబ్సిడీపై వ్యయం తగ్గుదల కారణంగా సబ్సిడీల మొత్తంలో తగ్గుదల ఏర్పడింది.
    • ఆహార సబ్సిడీకి 2020-21లో రూ. 1,15,570 కోట్లు కేటాయించారు. 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు ప్రస్తుత బడ్జెట్‌లో పెరుగుదల 6.3 శాతం. ఇదే కాలంలో ఎరువుల సబ్సిడీలో తగ్గుదల 10.9 శాతం కాగా, పెట్రోలియం సబ్సిడీలో పెరుగుదల 6.1 శాతం.
    • ప్రభుత్వ పథకాలకు సంబంధించి వడ్డీ సబ్సిడీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరల మద్ధతు పథకానికి సబ్సిడీ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ర్ట ఏజెన్సీలకు సహాయం లాంటి అంశాలు ఇతర సబ్సిడీల్లో భాగంగా ఉంటాయి. 2020-21 బడ్జెట్‌లో ఇతర సబ్సిడీలపై వ్యయాన్ని రూ. 34,315 కోట్లుగా ప్రతిపాదించారు. 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం ఇతర సబ్సిడీలపై వ్యయంలో తగ్గుదల 5.5 శాతం.

  4. రాబడి-వ్యయం-లోటు:
    ముఖ్యాంశాలు ..
    • 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21లో ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల 12.7 శాతం. బడ్జెట్ అంచనాల ప్రకారం 2020-21లో కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ. 30,42,230 కోట్లు.
    • 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020 -21లో రుణాలు మినహాయించిన ప్రభుత్వ రాబడిలో పెరుగుదల 16.3 శాతం. బడ్జెట్ అంచనాల ప్రకారం 2020-21లో కేంద్ర ప్రభుత్వ మొత్తం రాబడులు రూ. 22,45,893 కోట్లుగా అంచనా.
    • నామినల్ జి.డి.పి. వృద్ధి 2019-20లో 12 శాతం కాగా, 2020-21లో 10 శాతంగా అంచనా.
    • 2019-20లో సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూలోటు జి.డి.పి.లో 2.4 శాతం కాగా, 2020-21లో 2.7 శాతం గా అంచనా.
    • 2019-20లో సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు జి.డి.పి.లో 3.8 శాతం కాగా, 2020 -21లో 3.5 శాతంగా అంచనా.
    • ప్రాథమికలోటు 2019-20లో సవరించిన అంచనాల ప్రకారం జి.డి.పి.లో 0.7 శాతం కాగా, 2020-21లో 0.4 శాతంగా అంచనా.
    • 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21లో రెవెన్యూరాబడిలో 9.2 శాతం, మూలధన రాబడిలో 175.7 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. ఇదే కాలంలో రెవెన్యూ వ్యయంలో 11.9 శాతం, మూలధన వ్యయంలో 18.1 శాతం పెరుగుదల ఉండగలదని అంచనా.
    • బడ్జెట్‌లో పొందుపరచిన వ్యయానికి అదనంగా ప్రభుత్వం ‘అదనపు బడ్జెటరీ వనరులను’ వ్యయం చేస్తుంది. బాండ్ల జారీ, చిన్నమొత్తాల పొదుపు నుంచి రుణం రూపేణా ప్రభుత్వం ఈ వనరులకు సమీకరిస్తుంది. 2020-21 బడ్జెట్‌లో అదనపు బడ్జెట్ వ్యయాన్ని రూ.1,86,100 కోట్లుగా ప్రతిపాదించారు. చిన్న మొత్తాల పొదుపు నుంచి భారత ఆహార సంస్థకు ఆర్థిక సహాయం అందించడానికి రుణంగా సమీకరించే మొత్తం 2020-21 అదనపు బడ్జెటరీ వ్యయంలో అధికంగా ఉంటుంది.
    • కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 2000- 01లో జి.డి.పి.లో 55.5 శాతం కాగా, 2020-21 లో 50.1 శాతానికి తగ్గుతుందని అంచనా. 2024-25 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణం జి.డి.పి.లో 40 శాతంగా ఉండాలని ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం లక్ష్యంగా తీసుకుంది.
    • 2020-21 బడ్జెటరీ అంచనాల ప్రకారం స్థూల పన్నురాబడిలో వస్తు, సేవల పన్ను వాటాను అధికంగా ప్రతిపాదించారు. వస్తు, సేవల పన్ను రాబడి రూ.6,90,500 కోట్లుగా అంచనా. తర్వాత స్థానాల్లో కార్పొరేషన్ పన్ను, ఆదాయపు పన్ను, యూనియన్ ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ సుంకం నిలిచాయి.
    • 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21లో ఆదాయపు పన్ను రాబడిలో 14 శాతం, వస్తు సేవల పన్నులో 12.8 శాతం, కార్పొరేషన్ పన్నులో 11.5 శాతం. కస్టమ్స్ సుంకంలో 10.4 శాతం, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీల్లో 7.7 శాతం పెరుగుదల ఉండగలదని అంచనా.
    • కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వడ్డీరాబడులు, డివిడెండ్లు, లాభాలు, బహిర్గత గ్రాంట్లు, ఆర్థిక, సాంఘిక, సాధారణ సేవల నుంచి రాబడులు పన్నేతర రాబడిలో భాగంగా ఉంటాయి. 2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం పన్నేతర రాబడి రూ. 2,18,580 కోట్లు. 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21లో పన్నేతర రాబడిలో పెరుగుదల 11.4 శాతం. పన్నేతర రాబడిలో డివిడెండ్ల లాభాల వాటా అధికంగా ఉంటుందని అంచనా.

  5. విధానపరమైన అంశాలు:
    • సహకార బ్యాంకుల్లో ఉత్తమ గవర్నెన్స్ కోసం ‘ది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949’ ను సవరించడం జరుగుతుంది. ఖాతాదారుల డిపాజిట్లపై బీమాను లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచడానికి ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్’ను అనుమతించారు.
    • ఐ.పి.ఓ. ద్వారా ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయిస్తుంది. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తనకున్న బ్యాలెన్స్ వాటాను విక్రయించాలని భావిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని 2020-21లో రూ. 2,10,000 కోట్లుగా ప్రతిపాదించారు. 2019-20 సవరించిన అంచనాలతో పోల్చినపుడు 2020-21లో ఈ మొత్తంలో పెరుగుదల 223.1 శాతంగా అంచనా.
    • మొబైల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమీ-కండక్టర్ ప్యాకేజింగ్ తయారీని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రతిపాదించారు. ‘ది నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్‌ను రూ. 1,480 కోట్ల వ్యయంతో 2020-21 నుంచి 2023-24 వరకు అమలు చేస్తారు.
    • నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద ప్రభుత్వం 6,500 ప్రాజెక్టులను నిర్మిస్తుంది. హౌసింగ్, సురక్షిత తాగునీరు, ఆరోగ్యసంరక్షణ వీటిలో భాగంగా ఉంటాయి. జాతీయ లాజిస్టిక్ విధానాన్ని రూపొందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలు, ముఖ్య నియంత్రణ సంస్థల పాత్రను నిర్ణయిస్తారు. నూతన విద్యావిధానాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది. జన్ ఔషది కేంద్ర పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించడం ద్వారా 2 వేల మందులు, 300 సర్జికల్స్‌ను 2024 నాటికి అందిస్తారు. ప్రభుత్వం, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల నియమానికి, ‘జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ’ ఏర్పాటు చేస్తారు.


మాదిరి ప్రశ్నలు :
Published date : 13 Feb 2020 04:21PM

Photo Stories