Skip to main content

Inter Online Admissions: ఇంటర్ ప్రవేశాలకు ‘ఆన్ లైన్’ రద్దు

ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు కొత్తగా తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్ లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియెట్ స్ట్రీమ్ను హైకోర్టు రద్దు చేసింది.
Inter Online Admissions
ఇంటర్ ప్రవేశాలకు ‘ఆన్ లైన్’ రద్దు

2021 విద్యా సంవత్సరానికి పాత విధానంలోనే ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఆన్ లైన్ ప్రవేశాలకు చట్టం చేసేందుకు, నిబంధనలు రూపొందించేందుకు ఈ తీర్పు ఏమాత్రం అడ్డంకి కాదంది. ఇదే సమయంలో ఆన్ లైన్ విధానం తేవాలంటే లబ్ధిదారులందరి హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కొత్త విధానం గురించి ముందు విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు వెలువరించారు. ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ఆన్ లైన్ విధానాన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఆన్ లైన్ ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ కు ఎలాంటి చట్టపరమైన దన్ను లేదన్నారు. ఈ కొత్త విధానం లబ్ధిదారులందరి హక్కులను కాపాడటం లేదని చెప్పారు. కోవిడ్ వల్ల పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన నేపథ్యంలో.. ఇంటర్ ప్రవేశాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే లక్షల మంది విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించారని ఇంటర్ బోర్డు చెబుతున్నప్పటికీ ఈ విధానాన్ని సమర్థించలేమని స్పష్టం చేశారు. ఆన్ లైన్ ప్రవేశాల విషయంలో లబ్ధిదారులందరి హక్కులను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించి ఉండాల్సిందన్నారు. ఆ అధికారాన్ని ఇంటర్ బోర్డుకు బదలాయించకుండా ఉండాల్సిందని చెప్పారు. ఈ అధికార బదలాయింపు చట్టప్రకారం చెల్లుబాటు కాదన్నారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదని పేర్కొన్నారు. కోవిడ్ నుంచి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కాపాడేందుకే ఆన్ లైన్ విధానం తెచ్చామని ఇంటర్ బోర్డు చెబుతోందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేనప్పటికీ.. నోటిఫికేషన్ లోనే ఈ విషయాన్ని పొందుపరచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

Published date : 07 Sep 2021 01:36PM

Photo Stories