Inter certificates: ఇంటర్ సర్టిఫికెట్లు వచ్చేశాయ్!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ఒరిజినల్(పాస్) సర్టిఫికెట్లు ఎట్టకేలకు విద్యార్థులకు చెంతకు చేరుతున్నాయి. ఇప్పటికే జూనియర్ కాలేజీలకు చేరిన ఇంటర్మీడియెట్ మార్క్స్ మెమోలను పకడ్బందీగా అందజేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో పంపిణీలో కాస్త జాప్యం జరిగినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి విద్యార్థులకు త్వరితగతిన చేరేలా చొరవ తీసుకున్నారు. మొత్తంమీద తమకు పాస్ సర్టిఫికెట్లు అందించడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
విద్యార్థులతో కళకళ..
పాస్ సర్టిఫికెట్ల కోసం వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళాశాలలు కళకళలాడుతున్నాయి. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈ ఏడాది మార్చి 15 నుంచి నెలాఖరు వరకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి. అనంతరం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నెలాఖరు వరకు నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు కలిసి 39410 మంది పరీక్షలు రాశారు. ఇందులో 20650 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిందరి మార్క్స్ మెమోలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా ఇంటర్‌బోర్డు కార్యాలయం నుంచి వెనువెంటనే కాలేజీలకు చేరేలా డీవీఈవో కోట ప్రకాశరావు నేతృత్వంలో ఆర్‌ఐఓ పి.దుర్గారావు, సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. కాలేజీలకు హాజరవుతున్న విద్యార్థులకు డిజీలాకర్ యాప్‌పై ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాప్‌లో అన్ని సర్టిఫికెట్లు లభ్యమౌతున్నాయని తెలియజేస్తున్నారు.
చదవండి: Inter Admission: ఇంటర్‌లో అడ్మిషన్ల జోష్
ఇదీ పరిస్థితి..
జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 191 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఫంక్షనింగ్ జరుగుతున్న కళాశాలలు 168. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38, సోషల్ వెల్ఫేర్ 9, ట్రైబల్ వెల్ఫేర్ 1, మోడల్‌స్కూల్/కళాశాలలు 13, కేజీబీవీలు 25, జెడ్పీహెచ్ స్కూల్ కాలేజీలు 5, కోపరేటివ్ 2, ప్రైవేటు జూనియర్ కళాశాలలు 73 ఉన్నాయి. వీటిల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరం కలిపి 49490 మంది విద్యార్థులు చదువుతున్నారు.
అన్ని కాలేజీలకు చేరవేశాం..
ఇంటర్మీడియెట్ పాస్ సర్టిఫికెట్లు(మార్క్స్ మెమోలు) జిల్లాకు చేరిన వెంటనే కాలేజీలకు అందజేసేలా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు త్వరితగతిన పంపిణీ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సిబ్బంది, అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు సమాచారం అందించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలా ఆదేశించాం.
– పి.దుర్గారావు, ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్‌ఐఓ, శ్రీకాకుళం జిల్లా
‘డిజీలాకర్’పై అవగాహన..
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్ల అందజేసే ప్రక్రియ వాయువేగంతో సాగుతోంది. డిజీలాకర్ యాప్‌పై విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఇన్‌స్టాల్ మొదలు పనిచేసే విధానంపై ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించాం. విద్యార్థులతోపాటు సామానుల్యకు సైతం చాలా ఉపయుక్తమైన యాప్ డిజీలాకర్.
– కోట ప్రకాశరావు, ఇంటర్మీడియెట్ విద్య, శ్రీకాకుళం డీవీఈవో