Inter Admission: ఇంటర్‌లో అడ్మిషన్ల జోష్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ 2023–24 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు బాగా పెరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతేడాది కంటే 6,333 మంది ఇప్పటి వరకూ అదనంగా ప్రవేశం పొందారు. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలతో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా పరీక్షలు తప్పిన విద్యార్థులకు రీ అడ్మిషన్ తీసుకునే అవకాశం కల్పించటం సైతం ఈ సంఖ్య పెరగటానికి దోహద పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ఇది సాధ్యపడిందని విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి సైతం విద్యార్థులు ఉన్నత విద్యవైపు వస్తున్నారనటానికి ఇది నిదర్శనమని వివరిస్తున్నారు.
డ్రాప్ అవుట్స్ లేకుండా చర్యలు..
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు గతంలో చాలా మంది కళాశాల వైపు అడుగులు వేసేవారు కాదు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పదో తరగతి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కళాశాలలో చేరాలి. లేదా పాలిటెక్నిక్ లేకుంటే ఐటీఐ ఇలా ఏదోక కోర్సులో తప్పనిసరిగా చేరాలి. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. పదో తరగతి పూర్తి చేసుకొని హైస్కూల్ నుంచి బయటకు వచ్చే విద్యార్థి ఆయా విద్యాసంస్థల్లో చేరినట్లుగా ప్రభుత్వ రికార్డులో నమోదు కావాలి. దానికి అనుగుణంగా అన్ని సాంకేతిక రికార్డులను ప్రభుత్వం అనుసంధానం చేసింది. దానికి అనుగుణంగా సచివాలయం స్థాయిలో ఆ విద్యార్థి ఎక్కడ ఉన్నది కనుగొంటారు. పది తర్వాత కళాశాలలో చేరకుంటే ఆ కుటుంబానికి సచివాలయం సిబ్బంది కౌన్సెలింగ్ చేస్తారు. ఒక వేళ పదో తరగతి తప్పితే తిరిగి అదే హైస్కూల్‌లో చేర్పిస్తారు. ఇలా తీసుకున్న చర్యలు అన్ని విధాలుగా ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల శాతం పెరగటానికి దోహదపడుతున్నాయి.
చదవండి: AP Inter 1st Year Study Material
ఎన్టీఆర్ జిల్లాలో 3,083.. కృష్ణాజిల్లాలో 3,250..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో గత ఏడాది కన్నా సుమారు ఆరువేలకుపైగా అడ్మిషన్లు పెరిగాయి.
ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 185 కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో గత ఏడాది సుమారుగా 37,359 అడ్మిషన్లు జరిగాయి. కానీ ఈ ఏడాది 40,442 అడ్మిషన్లు జరిగాయి. అంటే 3,083 అడ్మిషన్లు పెరిగాయి.
కృష్ణాజిల్లాలో సుమారు 157 కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో గత ఏడాది 19,098 అడ్మిషన్లు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 22,348 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అదనంగా 3,250 మంది అడ్మిషన్లు తీసుకున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
ఇంటర్మీడియెట్ విద్యలో అడ్మిషన్లు పెంపుపై ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా పలు చర్యలు చేపట్టింది. పదో తరగతి పూర్తయిన తరువాత విద్యార్థి ఎక్కడ ఉన్నది తప్పనిసరిగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియెట్ తప్పిన వారికి రీ అడ్మిషన్ ఇస్తున్నాం. హైస్కూల్ ప్లస్ కాలేజ్‌లో సైతం మంచిగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. రానున్న కాలంలో మరింత పెంచటానికి కృషి చేస్తాం.
– పెదపూడి రవికుమార్, ఆర్‌ఐవో, ఉమ్మడి కృష్ణాజిల్లా
అదనపు సెక్షన్లకు వినతులు..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 342 కళాశాలలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాగా ఆయా జూనియర్ కళాశాలల నుంచి వందకు పైగా అదనపు సెక్షన్లకు వాటి యాజమాన్యాల నుంచి దరఖాస్తులు అందాయి. కృష్ణా జిల్లాలో సుమారుగా 157 కళాశాలలు ఉండగా అందులో సుమారు 99 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 185 కళాశాలలు ఉండగా అందులో సుమారు 136 వరకూ ప్రైవేట్ కళాశాలలు కొనసాగుతున్నాయి.
చదవండి: Intermediate Exams: నేటి నుంచి కళాశాలల్లో ఇంటర్ మార్కుల లిస్టులు