Inter Online Admissions: ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై హైకోర్టు సంచలన నిర్ణయం...
ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై అమరావతి హైకోర్టు విచారణ చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డితో పాటు విద్యార్థులు పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపించారు. ఆన్‌లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని, నిర్వహణ విధానాన్ని ప్రకటించలేదని పిటిషనర్లు కోర్టుకు వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం, బోర్డు చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని.. నిబంధనలు రూపొందించకుండా ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు. కోవిడ్ సమయంలో ప్రవేశాల పేరుతో కళాశాలల చుట్టూ తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్‌ను కోట్టేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.