Skip to main content

Botsa Satyanarayana: టెన్త్, ఇంటర్‌ టాపర్లకు ప్రభుత్వ సత్కారం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Botsa Satyanarayana
టెన్త్, ఇంటర్‌ టాపర్లకు ప్రభుత్వ సత్కారం

టెన్త్, ఇంటర్‌ ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు బొత్స ప్రకటించారు. మే 17న విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరిస్తామన్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు.

చదవండి: What After Inter HEC: హెచ్‌ఈసీ విద్యార్థులకు విభిన్న కోర్సులు, వినూత్న కెరీర్‌ అవకాశాలు ఇవే..

మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్‌లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు చెప్పారు. విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్‌ సంకల్పమన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అధునాతన వసతులు, డిజిటల్‌ విద్యా బోధన తదితరాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమాలకు తోడు ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లను కూడా సత్కరిస్తామన్నారు.

చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

ఆరోగ్యకరమైన పోటీతో ప్రోత్సహించేందుకే..

మే 23న నియోజకవర్గ స్థాయిలో సత్కార వేడుక నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పతకం, సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని బొత్స తెలిపారు. మే 27న జిల్లా స్థాయిలో సత్కారంలో విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు నగదు అందచేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున నగదు పురస్కారాలతో సత్కరిస్తామని వెల్లడించారు.

చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

మే 31న జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకరమైన పోటీతో ప్రతిభను ప్రోత్సహించేందుకే మెరిట్‌ అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్య పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సెక్రటరీ ఆర్‌.నరసింహారావు, సమగ్ర శిక్షా ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

Published date : 18 May 2023 02:55PM

Photo Stories