మండలానికి 2 జూనియర్ కాలేజీలు
రాష్ట్రంలో 679 మండలాలు ఉండగా 1,358 ఇంటర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 474 జూనియర్ కాలేజీలున్నాయని, మిగతా 884 కళాశాలల్లో కూడా తరగతులు ఈ ఏడాదే కొత్త విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని బొత్స వెల్లడించారు. టెన్త్ పాసైన విద్యార్ధులు ఇంటర్‌లో చేరేందుకు వీలుగా ఆయా మండలాల్లో రెండేసి హైస్కూళ్లలో ఇంటర్ తరగతులు (10 + 2) ప్రారంభిస్తారు. వీటిలో ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజీ కాగా రెండోది ప్రత్యేకంగా బాలికల కోసమే నిర్వహించనున్నారు. జూన్ 22న విజయవాడలో ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు.
చదవండి: Intermediate - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్
ప్రైవేట్ కాలేజీల కంటే మిన్నగా..
జూనియర్ కాలేజీలలో కొన్నిటిని బాలికల కళాశాలలుగా మార్పు చేస్తున్నందున 25 చోట్ల సమస్యలు తలెత్తుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తామని బొత్స వెల్లడించారు. ప్రైవేట్ కాలేజీల కంటే మిన్నగా మంచి సదుపాయాలతో పాటు ఉత్తమ బోధన అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్చి అధిక ఫీజుల భారంతో ఒత్తిడికి గురి కాకుండా ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్చాలని సూచించారు. విద్యారంగాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్ విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని బొత్స పేర్కొన్నారు. మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన తదితర కార్యక్రమాలతో విద్యార్ధులను ప్రోత్సహించడమే కాకుండా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూల్, హై స్కూల్, హైస్కూల్ ప్లస్ లాంటి కొత్త విధానంతో పాఠశాల విద్యను పరిపుష్టం చేసే చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రపంచంలో అందరికన్నా మిన్నగా మన విద్యార్ధులు ప్రత్యే క గుర్తింపు సాధించాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు.