Skip to main content

ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఏపీఈఏపీసెట్‌–2023 ద్వారా ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 17న ప్రభుత్వం సీట్ల కేటాయింపు జరపనుంది. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌ల వారీగా కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం విద్యార్థులందరూ ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. వివిధ ఫార్మసీ కళాశాలల్లో విద్యార్థుల కోసం ఉచిత రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు నడుస్తున్నాయి.

8 నుంచి ఎంపీసీ స్ట్రీమ్‌లో సర్టిఫికెట్ల పరిశీలన

ఎంపీసీ స్ట్రీమ్‌లో బీ ఫార్మసీ, ఫార్మాడీ కోర్సులకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న విద్యార్థులకు ఈనెల 8, 9వ తేదీల్లో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో విద్యార్థులు అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో పరిశీలించనున్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అన్నీ సక్రమంగా ఉంటే, విద్యార్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొని కళాశాలల ఎంపికకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. సర్టిఫికెట్ల పరిశీలన అసంపూర్తిగా ఉన్న పక్షంలో సంబంధిత ధ్రువపత్రాలను తీసుకుని, ఆన్‌లైన్‌లో ఉన్న హెల్ప్‌లైన్‌ కేంద్రాల జాబితాలో నుంచి ఎంపిక చేసుకుని, అదే హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సర్టిఫికెట్లతో భౌతికంగా హాజరు కావాలి.

Also Read : Free training in Spoken English: Spoken Englishలో ఉచిత శిక్షణ
 

ఈనెల 9, 10, 11 తేదీల్లో

ఎంపీసీ స్ట్రీమ్‌ పరిశీలన

బైపీసీ స్ట్రీమ్‌లో బీఈ, బీటెక్‌లలో బయోటెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌, బీ.ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను ఈనెల 9,10,11 తేదీల్లో పరిశీలిస్తారు.

వెబ్‌ ఆప్షన్ల నమోదు

ఎంపీసీ స్ట్రీమ్‌లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈనెల 10,11,12వ తేదీల్లో ఆన్‌లైన్‌లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అదే విధంగా బైపీసీ స్ట్రీమ్‌లో ఈనెల 11,12,13వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఎంపీసీ స్ట్రీమ్‌లో ఈనెల 14న బైపీసీ స్ట్రీమ్‌లో ఈనెల 17న సీట్ల కేటాయింపు జరగనుంది.
 

Published date : 06 Nov 2023 01:26PM

Photo Stories