Skip to main content

EAPCET Engineering Counselling 2024: కోర్సులు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి!

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఏపీ ఈఏపీసెట్‌–2024) కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఈమేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ ఈఏపీసెట్‌–2024 (ఎంపీసీ స్ట్రీమ్‌)లో అర్హత సాధించి, ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఎదురు చూస్తున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది.
AP EAPCET Counselling 2024 important dates

నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌–2024 కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏపీఈఏపీసెట్‌ దరఖాస్తు సమయంలోనే పూర్తి అయిన సర్టిఫికెట్ల పరిశీలన అసంపూర్తిగా ఉన్న విద్యార్థులకే హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో పరిశీలన ఈనెల 8వ తేదీన ప్రారంభంకానున్న వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉమ్మడి గుంటూరు జిల్లాలోమూడు హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో 40 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అందుబాటులో 22,290 సీట్లు. 

ఏపీ ఈఏపీసెట్‌–2024 కౌన్సెలింగ్‌

  • 1 నుంచి 7 వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌,
  • ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు 4 నుంచి 10 వ తేదీ వరకు
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, వెబ్‌ ఆప్షనల్స్‌ ఎంపిక 8 నుంచి 12 వరకు
  • 13న ఆప్షనల్స్‌ మార్పునకు అవకాశం
  • 16న సీట్ల కేటాయింపు 

Check: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)

ఉమ్మడి జిల్లాలో సీట్ల సంఖ్య ఇలా..

గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లో రెండు ప్రభుత్వ, 38 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో 22,290 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఏపీ ఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు 25వేలకు పైగా ఉన్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 ఇంజినీరింగ్‌ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా, నూతన కృష్ణా జిల్లా పరిధిలో ఆయా కళాశాలలు ఉన్నాయి. 32 కళాశాలలకు సంబంధించి వివిధ బ్రాంచ్‌లలో సుమారు 19 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. కళాశాలలు, కోర్సులు, సీట్లు వివరాలను తెలుసుకొని విద్యార్థులు తమ ర్యాంకులకు అనుగుణంగా ఎక్కడ, ఏ సీటు వస్తుందో తెలుసుకొని కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవుతున్నారు.

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుతో మొదలయ్యే ప్రక్రియ

ఏపీ ఈఏపీసెట్‌–2024లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సోమవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు సెట్స్‌.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందు కోసం ఏపీఈఏపీసెట్‌ హాల్‌ టికెట్‌, జనన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి లాగిన్‌ కావాలి.

ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజును తిరిగి ఇదే వెబ్‌సైట్‌లో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ మార్గాల్లో చెల్లించాలి. ఏపీ ఈఏపీ సెట్‌ డీటైల్డ్‌ నోటిఫికేషన్‌, యూజర్‌ మాన్యువల్‌, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్‌లో పొందుపర్చారు.

అందుబాటులో నూతన బ్రాంచ్‌లు

జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీఎస్‌సీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌ వంటి రెగ్యులర్‌ కోర్సులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. తాజాగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పాత బ్రాంచ్‌లతోపాటు కొన్ని కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. సీఎస్‌ఈలో అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ సైన్స్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటా సైన్స్‌, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, మైరెన్‌ మైనింగ్‌ వంటి కొత్త బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటుగా ఏరోనాటికల్‌ వంటి కోర్సులను సైతం కొన్ని కళాశాలలు ఆఫర్‌ చేస్తున్నాయి.

సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి

● ఏపీ ఈఏపీ సెట్‌–2024లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసే సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్‌, ఇంటర్‌ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వెబ్‌ బేస్డ్‌ విధానంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది.


● ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే ‘నో యువర్‌ రిజిస్ట్రేషన్‌’ పై క్లిక్‌ చేయాలి. తద్వారా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఏ స్థాయిలో ఉన్నదీ తెలుసుకోవచ్చు.


● ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే పూరైయిన విద్యార్థులకు కంప్యూటర్‌ స్క్రీన్‌పై కేండెట్‌ ఈజ్‌ ఎలిజిబుల్‌ ఫర్‌ ఎక్సర్‌సైజింగ్‌ ఆప్షన్స్‌ అని కనిపిస్తే, విద్యార్థులు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు సిద్ధం కావచ్చు.

● ఈ విధంగా కాకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ హెల్ప్‌లైన్‌ కేంద్రంలో పురోగతిలో ఉన్న పక్షంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఈజ్‌ అండర్‌ ప్రోగ్రెస్‌ అని కనిపిస్తుంది.

● ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన ధ్రువపత్రాలు అసంపూర్తిగా ఉండటం, వివరాలు అసమగ్రంగా ఉన్న పరిస్థితుల్లో కాంటాక్ట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌(హెచ్‌ఎల్‌సీ) అని డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్‌ప్లే అయితే ఆన్‌లైన్‌లో పొందుపర్చిన హెల్ప్‌లైన్‌ కేంద్రాల జాబితా నుంచి తమకు సమీపంలోని కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం విద్యార్థులకు సంబంధించి అసమగ్రంగా ఉన్న సర్టిఫికెట్ల వివరాలు డిస్‌ప్లేలో ప్రత్యక్షమవుతాయి. సంబంధిత సర్టిఫికెట్లను విద్యార్థులు తిరిగి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తరువాత సంబంధిత హెచ్‌సీఎల్‌లో అధికారులు వాటిని పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

● గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థులు అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను ఆయా హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ఈనెల నాలుగు నుంచి 10వ తేదీ వరకు పరిశీలించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూరైయిన విద్యార్థులు ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. కోర్సులు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఫోన్‌కు వచ్చే సమాచారం కూడా ముఖ్యమే కాబట్టి సెల్‌ నంబర్‌ విద్యార్థి లేదా తల్లిదండ్రుల నంబర్లు ఇవ్వాలి.


కౌన్సెలింగ్‌లో అప్రమత్తత అవసరం

రిజిస్ట్రేషన్‌ నుంచి ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, కళాశాల, కోర్సు ఎంపిక వంటి అంశాల్లో అన్నీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులే స్వయంగా చూసుకోవాలి. అలా కాదని స్నేహితులు లేదా ఇతరుల ద్వారా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేయించుకుంటే ఏవైనా పొరపాట్లు జరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కోసారి కోరుకున్న చదువు దూరమయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. విద్యార్థి అభీష్టం మేరకు కళాశాల, కోర్సు ఆప్షన్లను కొన్ని ప్రైవేటు కళాశాలల సిబ్బందే స్వయంగా ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. కౌన్సెలింగ్‌ దశ చాలా కీలకం కాబట్టి విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్‌ పొందాలి. వెబ్‌ కౌన్సెలింగ్‌ అనేది విద్యార్థుల స్వీయపర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఏం జరిగినా వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

– సీహెచ్‌ సాయిబాబు, డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ ఆడిట్‌, జేఎన్‌టీయూ, కాకినాడ

ఆసక్తి ఉన్న బ్రాంచినే ఎంచుకోవాలి

విద్యార్థులు కళాశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆసక్తి ఉన్న బ్రాంచినే ఎంచుకుని, అందులో ప్రతిభ చూపాలి. ముఖ్యంగా ఒకే కోర్సుకు డిమాండ్‌ ఉందనే భావన నుంచి బయటపడాలి. అందుబాటులో ఉన్న కోర్సులకు బయటి పరిశ్రమల్లో ఉన్న ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో వాటికి ఉన్న డిమాండ్‌ తదితర అంశాలపై విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఆమేరకు బ్రాంచి ఎంచుకోవాలి. ఒకే కోర్సులో అందరూ చేరడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. ఇటీవల సాఫ్ట్‌వేర్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. తద్వారా సీఎస్‌ఈ కోర్సు ఒక్కటే ముఖ్యమైనది కాదన్నది గుర్తించాలి. అభివృద్ధి అనేది కేవలం ఒక్క రంగంతోనే సాధ్యపడదు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు కావలసిన అన్ని పత్రాలూ సరి చూసుకోవాలి. ఈడబ్ల్యూఎస్‌కు గత ప్రభుత్వం 10 శాతం కోటా ప్రారంభించింది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థీ దీనిని వినియోగించుకోవాలి.

– డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, ఉప కులపతి, జేఎన్‌టీయూ–కాకినాడ

కోర్సులు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి

ఈఏపీ సెట్‌లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు రిజిస్టేషన్‌ నుంచి ఆన్‌లైన్‌ ఫీజ చెల్లింపు, కళాశాల, కోర్సులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. స్నేహితులు, మరొకరి సహకారంతో ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేస్తే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరే స్వయంగా వెళ్లి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాలి. ఇందుకు సంబంధించి విద్యార్థి, లేదా వారి తల్లిదండ్రులకు సంబంధించిన సెల్‌ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే సమాచారం వస్తుంది. మొదటి దశే కీలకం. ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకోవాలి.

డాక్టర్‌ ఎస్‌.మణికంఠ, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్లేస్‌మెంట్స్‌ పీఎస్‌సీఎంఆర్‌ కాలేజ్‌


Published date : 01 Jul 2024 04:44PM

Photo Stories