Skip to main content

EAPCET Engineering Counselling 2024: టెక్నాలజీపై పట్టు సాధించాలని నిపుణుల సూచన... ఏ బ్రాంచ్ తో కెరీర్ బాగుంటుందంటే!

లక్షలాది మంది విద్యార్థుల స్వప్నం ఇంజినీరింగ్‌ చదవడం. తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ కోర్సులపై మక్కువ అంతా ఇంతా కాదు. తమ స్వప్నం సాకారం చేసుకోవడానికి విద్యార్థులు జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, ఏపీ ఈఏపీసెట్‌ వంటి పలు ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. ఆయా ప్రవేశ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి.
Tips for Parents and Students  EAPCET Engineering Counselling 2024  Entrance Exam Results Announcement
EAPCET Engineering Counselling 2024

ఈ క్రమంలో ఏ కళాశాలలో చేరాలి, అందుబాటులో ఉన్న అనేక  ఇంజినీరింగ్‌ బ్రాంచుల్లో ఎందులో చేరితే మంచిది? ఏ కోర్సు చేస్తే భవిష్యత్తు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి? గత టాపర్లు క్రేజీగా భావించిన బ్రాంచ్‌లు, ఇటీవల కాలంలో బీటెక్‌లో బెస్ట్‌గా నిలుస్తున్న బ్రాంచ్‌లు ఏవి అనే విషయాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆరా తీస్తున్నారు.


ఆధునిక టెక్నాలజీపై పట్టుండాలి
ప్రస్తుతం పరిశ్రమల అవసరాల దృష్ట్యా సివిల్‌, సీఎస్‌ఈ, మెకానికల్‌, ఈసీఈ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌ బ్రాంచ్‌లు ముందంజలో నిలుస్తున్న మాట వాస్తవమే. వీటిల్లో సర్టిఫికెట్‌ సొంతం చేసుకుంటే కొలువులు ఖాయం అనే అభిప్రాయముంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏ బ్రాంచ్‌ విద్యార్థులైనా ఆ బ్రాంచ్‌కు సంబంధించి ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించాలి.

రానున్న మూడేళ్లలో ఆటోమేషన్‌ ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాల దృష్ట్యా.. ఇందుకు సంబంధించిన నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. 78 సంవత్సరాల ఘన చరిత గల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏ బ్రాంచ్‌ చదివినా ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి.

– ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌, జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల

టాపర్ల గమ్యం సీఎస్‌ఈ ..

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌.. సీఎస్‌ఈగా సుపరిచితం. బీటెక్‌ ఔత్సాహిక విద్యార్థుల్లో ఎక్కువమంది సీఎస్‌ఈలో చేరడానికే ఆసక్తి చూపుతారు. ఈ బ్రాంచ్‌తో ఐటీ కొలువులు, ఆకర్షణీయ ప్యాకేజీలు లభిస్తాయనే నమ్మకమే కారణం.

అందుకు తగ్గట్టుగానే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో ఐటీ రంగ కంపెనీలు తొలుత సీఎస్‌ఈ విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. నాలుగేళ్ల కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లో ముఖ్యంగా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, నెట్‌ వర్కింగ్‌, అల్గారిథమ్స్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, ప్రోగ్రామ్‌ డిజైన్‌, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా బేస్‌, డేటా స్ట్రక్చర్స్‌, తదితర అంశాలను అధ్యయనం చేస్తారు.

ఈసీఈ అటు కోర్‌.. ఇటు ఐటీ

బీటెక్‌ ఔత్సాహిక విద్యార్థులకు రెండో ప్రాథమ్యంగా ఈసీఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌) నిలుస్తోంది. ఈ బ్రాంచ్‌లో ప్రధానంగా ఎలక్ట్రికల్‌ పరిక రాలు, అనలాగ్‌ ఇంటిగ్రేటేడ్‌ సర్క్యూట్స్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్‌, మైక్రో ప్రాసెసర్స్‌, మైక్రో కంట్రోలర్స్‌, ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్‌, ఎలక్ట్రానిక్‌, కమ్యూనికేషన్‌ పరికరాల తయారీ, యాంటెన్నా, కమ్యూనికేషన్స్‌ సిస్టమ్స్‌ గురించి అవగాహన కలిగిస్తారు.

ఈ బ్రాంచ్‌లో చేరడం వల్ల కోర్‌ సెక్టార్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. నవరత్న కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.

ఎవర్‌గ్రీన్‌ కోర్సు ..ఈఈఈ

ఈఈఈ ద్వారా అటు ఎలక్ట్రికల్‌, ఇటు ఎలక్ట్రానిక్స్‌ రెండింటిపైనా పట్టు లభిస్తుంది. ఫలితంగా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో కొలువు దీరొచ్చు. అందుకే ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కోర్సు భరోసాగా నిలుస్తోంది. ఎలక్ట్రికల్‌ టెక్నాలజీ , మెషీన్స్‌, మోటార్లు, జనరేటర్లు, సర్క్యూట్‌ అనాలసిస్‌, పవర్‌ ఇంజినీరింగ్‌, తదితర అంశాలను ఇందులో చదువుతారు.

ప్రభుత్వ పరంగా విద్యుత్‌ రంగంలో అమలవుతున్న పథకాలు, ప్రైవేట్‌ రంగంలో ఏర్పాటు అవుతున్న హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల కారణంగా రానున్న నాలుగేళ్లలో రెండు లక్షల మంది ఈఈఈ ఇంజినీర్ల అవసరం ఉంటుందని అంచనా.

క్రేజీ తగ్గని సివిల్‌ ఇంజినీరింగ్‌

కోర్‌ బ్రాంచ్‌లలో మరో ముఖ్యమైన బ్రాంచ్‌.. సివిల్‌ ఇంజినీరింగ్‌. రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, హాస్పిటళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణాలు, అపార్ట్‌మెంట్లు తదితర మౌలిక వసతుల ప్రాజెక్టులు అన్నింటికీ ప్లానింగ్‌, డిజైనింగ్‌, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలన్నీ చూసేది సివిల్‌ ఇంజినీర్లే. సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ముఖ్యంగా సాలిడ్‌ మెకానిక్స్‌, హైడ్రాలిక్స్‌, స్ట్రక్చరల్‌ అనాలసిస్‌, సర్వేయింగ్‌, డిజైన్‌ ఆఫ్‌ ఆర్‌సీ స్ట్రక్చర్స్‌, డిజైన్‌ ఆఫ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌, క్యాడ్‌ తదితర అంశాలను బోధిస్తారు. రియాలిటీ రంగం దూకుడు మీద ఉండడంతో సివిల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు డిమాండ్‌ పెరుగుతోంది.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌..

మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు ఎవర్‌ గ్రీన్‌ బ్రాంచ్‌గా పేరుంది. ద్విచక్ర వాహనాల నుంచి విమానాల తయారీ వరకు మెకానికల్‌ ఇంజినీర్ల పాత్ర కీలకం. ముఖ్యంగా యంత్రాలు, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రికల్‌ మోటార్లు, భారీ వాహనాల డిజైన్‌, తయారీ అనేది మెకానికల్‌ ఇంజినీర్లు లేకుండా సాధ్యం కాదు. నాలుగేళ్ల మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో భాగంగా థర్మోడైనమిక్స్‌, మెషిన్‌ డ్రాయింగ్‌, ఇంజినీరింగ్‌ మెటీరియల్స్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ, డిజైన్‌ ఆఫ్‌ మెషిన్‌ ఎలిమెంట్స్‌, డైనమిక్స్‌ ఆఫ్‌ మెషినరీ, హీట్‌ అండ్‌ మాస్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు.

జాతీయ స్థాయిలో కెమికల్‌ ఇంజినీరింగ్‌కు డిమాండ్‌..

విద్యార్థులను ఆకట్టుకుంటున్న మరో బ్రాంచ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌ సమ్మిళితంగా కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఉంటుంది. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పరిశోధనల కారణంగా నానో టెక్నాలజీ, బయో ఇంజినీరింగ్‌, బయో మాలిక్యులర్‌ ఇంజినీరింగ్‌, మెటీరియల్‌ ప్రాసెసింగ్‌ వంటి సరికొత్త విభాగాలు పుట్టుకొస్తున్నాయి.

మానవ జీనోమ్‌ ప్రాజెక్ట్‌, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ వంటివి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. ఎయిర్‌ పొల్యుషన్‌ కంట్రోల్‌, కెమికల్‌ ప్రాసెస్‌ ఇండస్ట్రీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, ఫెర్టిలైజర్‌ టెక్నాలజీ వంటి అంశాలను విద్యార్థులు చదువుతారు.

Published date : 29 Jun 2024 11:33AM

Photo Stories