1.పోషణ - ఆహార సరఫరా వ్యవస్థ
1. పోషణ - ఆహార సరఫరా వ్యవస్థ
క్విక్ రివ్యూ:
స్వయంపోషణ:పత్రహరితం కలిగిన ఆకుపచ్చని మొక్కలు స్వయంపోషణ విధానాన్ని అనుసరిస్తాయి. ఈ విధానంలో సరళమైన ఖనిజ లవణాలను, నేల నుండి నీటిని, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్‌ను ఉపయోగించుకొని ప్రధానశక్తి వనరు అయిన సూర్యకాంతి సమక్షంలో అధికశక్తి గల సంక్లిష్ట కర్బన పదార్థాలు తయారవుతాయి.
కిరణజన్య సంయోగక్రియ:పత్రహరితం గల మొక్కలు సూర్యకాంతి సమక్షంలో కార్బన్‌డైఆక్సైడ్‌ను, నీటిని, ఉపయోగించుకొని గ్లూకోజును తయారుచేసే ప్రక్రియ.
సమీకరణం:
పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్):స్వయం పోషకాలైన మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారుచేసే సంక్లిష్ట పదార్థం. మానవులతోపాటు ఇతర జీవరాశులకు శక్తిని అందించే ఆహార పదార్ధం.
గ్లూకోజు :ఇది మొక్కలు తయారుచేసే సరళ కార్బోహైడ్రేట్ రూపం. దీనిని ఆహారంగా తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది.
సెల్యులోజ్:ఇది వృక్ష కణకవచాలలో ఉండే స్థిరమైన పిండి పదార్థం. మొక్కలలో అదనంగా ఉన్న కార్బొహైడ్రేట్, సెల్యులోజ్ రూపంలో నిల్వ చేయబడుతుంది.
హరితరేణువు:మొక్కలలోని పత్రహరితంలోపలి కణాంగాలలో ఆకుపచ్చని వర్ణంలో హరితరేణువు (క్లోరోప్లాస్ట్)లు ఉంటాయి. దీనిలో మూడు త్వచాలు ఉంటాయి. 3వ త్వచం థైలకాయిడ్ దొంతరలను గ్రానా అంటారు. గ్రానా భాగంలో కాంతి చర్యలు జరుగుతాయి. థైలకాయిడ్ లోపలి అవర్ణికలో స్ట్రోమా ఉంటుంది. స్ట్రోమా భాగంలో నిష్కాంతి చర్యలు జరుగుతాయి.
పరపోషణ: మొక్కలు లేదా ఇతర జీవులపై ఆధారపడి జీవించడమే పరపోషణ విధానం. కుళ్ళుతున్న జంతువులు, మొక్కలపై ఆధారపడి జీవించేవి పూతికాహారులు. ఉదా॥ఈస్టు, రైజోపస్, కుక్క గొడుగులు. కొన్ని జీవులను ఆతిధేయిగా మార్చుకొని ఆహారంగా గ్రహించేవి పరాన్న జీవులు. ఉదా॥జలగ, బద్దెపురుగు, కస్కూట, పేను.
హాస్టోరియాలు:కస్కూటా ప్రజాతి మొక్కలలో (కస్కూట రిప్లెక్సా వంటి) కొద్ది మొత్తంలో పత్రహరితం ఉంటుంది. ఇది హాస్టోరియా (చూషకాల) ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. హాస్టోరియాలు వేళ్ళుమాదిరిగా ఉండి అతిథేయి కణజాలంలోకి చొచ్చుకొనిపోతాయి.
జీర్ణక్రియ:ఎంజైముల సహాయంతో సంక్లిష్ట పదార్థాల సరళపదార్థాలగా విడగొట్టి శరీరం శోషించడానికి అనువుగా మార్చే విధానాన్ని జీర్ణక్రియ అంటారు.
లాలాజల గ్రంథులు:మానవుని ఆస్యకుహరంలో 3 జతల లాలాజల గ్రంథులు కలవు. ఈ గ్రంథులు స్రవించే లాలాజలంలో ప్రధానంగా టయలిన్ (అమైలేజ్) అనే ఎంజైము ఉంటుంది. ఇది సంక్లిష్ట కార్బొహైడ్రేట్‌లను సరళ కార్బొహైడ్రేట్‌లుగా మారుస్తుంది.
పెరిస్టాలిక్ చలనం:లాలాజలంతో కలిసి మెత్తబడిన ఆహారం ఆహారవాహిక ద్వారా ప్రయాణిస్తున్నపుడు తరంగాల మాదిరిగా ఏర్పడే చలనాన్ని పెరిస్టాలిక్ చలనం అంటారు.
కాలేయం: ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడే ప్రధాన అవయవం. దీనిని శరీరంలో అతిపెద్ద గ్రంథిగా పేర్కొంటారు. కాలేయం పైత్యరసంను ఉత్పత్తి చేయును. వీటిలో ఎలాంటి ఎంజైములు ఉండవు.
ఎమల్సీకరణం:కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణంచేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. దీనినే ఎమల్సీకరణం అంటారు.
శోషణం:జీర్ణమైన అంత్య పదార్థాలు చిన్నప్రేగు గోడల ద్వారా రక్తంలోనికి రవాణా కావడాన్ని శోషణం అంటారు. జీర్ణంకాని పదార్థాలు పెద్దప్రేగులోకి పంపబడుతుంది.
సూక్ష్మచూషకాలు:చిన్నప్రేగు గోడలలో చిన్న వేళ్ళ మాదిరిగా ఉండే నిర్మాణాలు ఇవి. వీటినే చూషకాలు (విల్లై) అంటారు. ఇవి చిన్న ప్రేగుల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. వీటికి రక్త కేశనాళికలు అమరి ఉంటాయి.
కైమ్:జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యే సమయంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు అణువులు చిన్న చిన్న రేణువులుగా, మెత్తగా విడగొట్టబడిన మెత్తటి రూపమే కైమ్. ఇది పాక్షికంగా జీర్ణమైన ఆహారం.
హైడ్రోక్లోరిక్ ఆమ్లం:జీర్ణాశయంలోకి చేరిన ఆహారం జఠర రసంతో కలిసే సందర్భంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది ఆహారంలోని హానికర బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. సరైన వేళలలో ఆహారం తీసుకోని సందర్భంలో హెడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడి జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది.
విటమినులు: జీవక్రియలలో కీలకపాత్ర వహించే కర్బన రసాయనిక పదార్థాలు. ఇవి శరీరానికి అతి స్వల్ప పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు లేదా ఆవశ్యక పోషకాలు. ఇవి శరీరంలో సంశ్లేషణ చెందవు. కాని జీర్ణక్షకియా ఎంజైములను చైతన్యపరుస్తాయి.
విటమినులు- రకాలు: ఇవి రెండు రకాలుగా విభజిస్తారు.
అవి 1. నీటిలో కరిగేవి:ఆ కాంప్లెక్స్, విటమిన్ C
2. కొవ్వులో కరిగేవి:A,D,E,K విటమినులు
ఆ సమూహంలోని విటమినుల శాస్త్రీయమైన పేర్లు:
థయమిన్ - B1
రైబోఫ్లోవిన్ -B2
నియాసిన్ -B3
పిరిడాక్సిన్ -B6
సయనకోబాలమిన్ -B12
విటమినులు
అలాగే - ఫోలిక్ ఆసిడ్, పాంటోథినిక్ ఆమ్లం, బయోటిన్
పోషకాహార లోపం:మనం తీసుకొనే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు తగిన పరిమాణంలో లేకపోతే పోషకాహార లోపం అంటారు. ఇది 3 రకాలుగా జనిస్తుంది. పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను న్యూనతా వ్యాధులు అని కూడా అంటారు. ఉదా॥క్వాషియార్కర్, మెరాస్మస్
స్థూలకాయం: అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల వచ్చే వ్యాధి స్థూలకాయం (ఒబేసిటి) శరీరంలో అధికమైన కొవ్వు చర్మంలోని అంతఃశ్చర్మ కణాలైన ఎడిపోజ్ కణాలలో నిల్వ ఉంటుంది. అంతరంగాలలో గుండె మూత్రపిండం, ఊపిరితిత్తుల చుట్టూ చేరుతుంది. ఇది డయాబెటిస్, గుండె వ్యాధులు, జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతుంది.
Content:
జీవులన్నింటికీ పెరుగుదల, ప్రత్యుత్పత్తి వంటి జీవక్రియలను నిర్వర్తించుకోవడం కోసం ఆహారం అవసరం. ఆహారం నుండి శక్తి లభించాలంటే పదార్థాలు ఆక్సీకరణం చెందించబడాలి. మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు కార్బొహైడ్రేట్‌లు, ప్రొటీన్‌లు, కొవ్వులు మొదలైనవి.
శక్తి విడుదలకు, పెరుగుదలకు శరీర నిర్మాణానికి అవసరమైన రసాయనిక పదార్థాలను పోషక పదార్థాలు లేక పోషకాలు అంటారు.
ఈ పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు:
- వివిధ రకాల పోషణ పద్ధతులు- స్వయం పోషణ, పరపోషణ
- కిరణజన్య సంయోగక్రియ
- అమీబాలో పోషణ, పారమీషియంలో పోషణ
- మానవులలో పోషణ
- పరపోషణ: ఇతర జీవులు తయారుచేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహారంగా తీసుకోవడమే పరపోషణ.
ఎ) పూతికాహారులు: కుళ్ళుతున్న జంతువులు, మొక్కలపై చేరి ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. ఉదా॥ఈస్టులు, కుక్కగొడుగులు, రొట్టె, బూజులు
బి) పరాన్న జీవులు: కొన్ని జీవులు ఆతిధేయి జీవి శరీరంలోకి చేరి ఆహారాన్ని గ్రహిస్తాయి. ఉదా॥కస్కుట, జలగ, బద్దెపురుగు. - స్వయం పోషణలో ప్రధానమైంది మొక్కలు. ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారుచేసుకుంటాయి.
సమీకరణం:
కారకాలు :కాంతి, CO2, H2O , పత్రహరితం.
పదేశం:కిరణజన్య సంయోగక్రియ హరిత రేణువులలో జరుగుతుంది. హరిత రేణువులలోని గ్రానాలో కాంతి చర్యలు స్ట్రోమాలో నిష్కాంతి చర్యలు జరుగుతాయి.
ప్రక్రియలోని ప్రధాన చర్యలు:
1) కాంతిశక్తి రసాయనిక శక్తిగా మారడం
2) నీటి అణువు విచ్ఛిత్తి చెందటం
3) CO2 కార్బోహైడ్రేట్‌లుగా క్షయకరణం చెందడం
4) ఈ ప్రక్రియలో గ్లూకోజు, నీరు, ఆక్సిజన్ అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి.
అమీబాలో పోషణ: ఏకకణ జీవి అయిన అమీబా మిధ్యాపాదాలతో ఆహారాన్ని సేకరించి ఆహార రిక్తికను ఏర్పాటు చేసుకుంటుంది.
పారమీషియంలో పోషణ: ఏకకణజీవి అయిన పారమీషియం శైలికల ఆధారంగా ఆహారాన్ని సేకరించి, శరీరంలో కణముఖంలోకి చేర్చుకుంటుంది.
మానవులలో పోషణ: మానవులలో జీర్ణవ్యవస్థ ఆహారనాళం నుండి మొదలు చిన్నప్రేగు వరకు అనేక అనుబంధ అవయవాలు జీర్ణరస గ్రంథులు ఉంటాయి. ఆహారం జీర్ణం కావడంలో జీర్ణరస ఎంజైముల పాత్ర ముఖ్యమైనది. వీటిలో టైలిన్, అమైలేజ్, పెప్సిన్, ట్రిప్సిన్, మాల్టోజ్, లైపేజ్ మొదలగునవి.
పోషకాహార లోపం: మనం తీసుకొనే ఆహారంలో ఒకటికంటే ఎక్కువ పోషకాలు లోపిస్తే ఆ స్థితిని ‘‘పోషపకాహార లోపం‘‘ అంటారు. పోషకాహార లోపం 3 రకాలుగా ఉంటుంది.
విటమినులు: మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. ఇవి 2 రకాలు
1. నీటిలో కరిగేవి: B కాంప్లెక్స్, విటమిన్ C
2. కొవ్వులో కరిగేవి: A,D,E,K విటమినులు
4 మార్కుల ప్రశ్నలు- జవాబులు
1. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ముడి పదార్థాల గురించి రాయండి? (AS-1)
జ. కిరణజన్య సంయోగక్రియకు కావలసిన ముడి పదార్థాలు రెండు రకాలు అవి..
1. బాహ్య కారకాలు: కాంతి, కార్బన్ డై ఆక్సైడ్, నీరు
2. అంతర కారకాలు:పత్రహరితం
1. బాహ్య కారకాలు:1.కాంతి: కాంతి సూర్యుని నుండి లభించే శక్తి వనరు. ఇది విద్యుదయస్కాంత వికిరణం. మనకు కనబడే దృశ్యకాంతి 400 నుండి 700nm ల తరంగదైర్ఘ్యం మధ్య ఉంటుంది. వీటిలో ఎరుపు, నీలివర్ణాలు ఉంటాయి. సూర్యకాంతిలోని ఈ వర్ణాలు ఆకులోని హరిత రేణువులలో ఉండే థైలకాయిడ్ పొర మీద ఉన్న పత్రహరిత అణువులు కాంతి శక్తిని శోషించి కిరణజన్య సంయోగక్రియ చర్యలను ప్రారంభిస్తాయి.
2.నీరు:మొక్కలు భూగర్భంలోని వేరు వ్యవస్థ మట్టి రేణువులతో కూడిన నీటిని పీల్చుకొని మొక్కలోని ప్రతిభాగానికి అందజేస్తాయి.
3. కార్బన్ డై ఆక్సైడ్(CO2): కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోని, నీటిలో కరిగి ఉండే అకర్బనిక ముడి పదార్థం. ఇది సహజ వాతావరణంలో 0.03 శాతంగా ఉంటుంది. ఇది పత్ర రంధ్రాల ద్వారా కణాలలోకి విసరణం చెందుతుంది. పత్రరంధ్రాలు ఆకు అడుగు భాగాన అధికంగా ఉంటాయి.
అంతర కారకాలు:
4. పత్రహరితం:కిరణజన్య సంయోగక్రియకు పత్రాలు ముఖ్య స్థావరం. పత్రాలు ఆకుపచ్చగా ఉండటానికి కారణమైన పత్రహరితం హరిత రేణువులలో ఒక భాగం. ఆకుపచ్చ మొక్కలన్నింటిలోనూ త్వచంతో కూడిన హరితరేణువులు ఉంటాయి. పత్రాలలోని పత్రాంతర కణాలలో ముఖ్యంగా హరిత రేణువులు ఉంటాయి.
ఇతర కారకాలు: ఉష్ణోగ్రత, ఎంజైములు మొదలైన కారకాలు కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుటలో సహకరిస్తాయి.
2.పోషకాహార లోపం వల్ల వచ్చే న్యూనతా వ్యాధులపై అవగాహన పెంచుకోవాలంటే డాక్టరు గారిని ఏఏ ప్రశ్నలు అడుగుతావు?(AS - 2)
జ.పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులపై సమాచారం కొరకు కింది ప్రశ్నలు అడుగుతాను.
- పోషకాహార లోపం ఏ వయస్సు వారికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది?
- పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులకు ఏదైనా ప్రత్యేక చికిత్స ఉన్నదా?
- గ్రామీణుల్లో సహజంగా పోషకాహార లోపాలు ఏర్పడటానికి కారణం ఏమిటి?
- ఆహారంలో ముఖ్యమైన పోషక విలువలు ఏవి?
- పోషకాహార లోపాలను సరిదిద్దడానికి ఏవైనా సులభమైన చిట్కాలు చెప్పండి?
- పోషకాహార లోపాల సవరణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది?
జ. 1. హరిత రేణువులు మొక్క కణంలోని ప్రత్యేక కణాంగాలలో ఉంటాయి. ఇవి త్వచంతో కూడిన కణాంగాలు. ఇందులో మూడు త్వచాలు ఉంటాయి.
2. మూడో త్వచంలో దొంతరల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ థైలకాయిడ్ దొంతరలను ‘గ్రానా’ అంటారు. గ్రానాలోనే కాంతిశక్తి గ్రహించబడుతుంది.
3. దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. దీనిని స్ట్రోమా అంటారు. స్ట్రోమాలో జరిగే ఎంజైముల చర్యల వలన గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది.
4. హరిత రేణువుల్లోని కాంతిని శోషించే పదార్థాలను ’కిరణజన్య సంయోగక్రియా వర్ణదాలు‘ అంటారు.
5. హరితరేణువుల్లోని థైలకాయిడ్ దొంతరలో రెండు ప్రధానమైన పత్రహరిత వర్ణదాలు ఉంటాయి. అవి
1. క్లోరోఫిల్ ’ఎ’ (నీలి-ఆకుపచ్చ వర్ణదం)
2. క్లోరోఫిల్ ’బి’(పసుపు- ఆకుపచ్చ)గా ఉంటుంది.
6. హరితరేణువులోని గ్రానాలో కాంతిచర్య, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది.
4. జీవ ప్రపంచమంతా ఆహారం కోసం మొక్కల మీదనే ఆధారపడటం అనివార్యమైంది. మొక్కల ఆహారం తయారుచేసే విధానాన్ని నీవు ఎలా అభినందిస్తావు? (AS - 6)
జ. జీవ ప్రపంచమంతా ఆహారం కోసం మొక్కల మీదనే ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఆధారపడుతోంది. కారణం ఆహారం తయారుచేసే ప్రక్రియ అనగా కిరణజన్య సంయోగక్రియ కేవలం మొక్కల్లోనే జరుగుతుంది. మొక్కల్లో ఈ ప్రక్రియ జరిగే ప్రధానభాగం ఆకు. అందుకే ఆకును ‘ఆహార కర్మాగారం’ అంటారు. ఆకు ముఖ్యంగా పత్రహరితమును కలిగి ఉండి సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చడంలో ఒక అద్భుతమైన, సహజమైన యంత్రంగా పరిగణించవచ్చు.
ఇలా సౌరశక్తిని ఉపయోగించి ఆకువంటి మరోయంత్రాన్ని మానవుడు తనకున్న శాస్త్రీయ విజ్ఞానంతోనూ, సాంకేతిక నిపుణతతోనూ, నేటివరకు తయారు చేయలేకపోయాడు. ఈ ప్రక్రియ వలననే భూమిమీద ఉండే జీవ రాసులన్నింటికి ఆహారాన్ని అందించడంతో పాటు మానవునికి కలప, ఔషధాలు, ఇంధనం వంటి నిత్యావసరాలను కూడా తీర్చుతుంది. అలాగే ప్రాణవాయువు వంటి ఆక్సిజన్‌ను సమకూర్చుతుంది. ఇంతటి గొప్ప యంత్రాంగాన్ని ప్రకృతి మనకు కానుకగా అందించడం అభినందనీయమే.
5. "సజీవ ప్రమాణానికి" కిరణజన్య సంయోగక్రియ ఒక్కటే శక్తి మూలాధారమని ఎలా చెప్పగలవు? (AS-1)
జ.
- భూమిమీద సమస్త జీవరాశుల మనుగడ ప్రకృతిపై, అందులోని మొక్కలపై ఆధారపడి ఉందనడానికి సజీవ సాక్ష్యమే కిరణజన్య సంయోగక్రియ.
- ఈ సజీవ ప్రపంచానికి ఆహారాన్ని అందించే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ ఒక్కటే. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బొహైడ్రేట్స్ మానవునికి ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు గింజల రూపంలో శక్తినివ్వడానికి తోడ్పడుతుంది.
- సరళ అకార్బనిక మూలకాలైన కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లను సంక్లిష్ట కార్బనిక పదార్ధాలుగా మార్చగలిగే ప్రక్రియ ఇదొక్కటే.
- ఈ ప్రక్రియ వలన గృహోపకరణాలకు అవసరమయ్యే కలప, ఇంధనానికి అవసరమయ్యే వంటచెరకు, బొగ్గు, పెట్రోల్ వంటి పదార్ధాలు లభిస్తున్నాయి.
- అత్యధిక పోషకాలు, ఔషధాలు వంటి విలువైన పదార్థాలు ఈ ప్రక్రియ వలనే లభ్యమవుతున్నాయి.
- ఈ భూమ్మీద కిరణజన్య సంయోగక్రియ ఒక్కటే వాతావరణంలోకి ప్రాణవాయువులాంటి ఆక్సిజన్‌ను అందించి సమస్త జీవరాశుల మనుగడ సాధ్యం చేస్తుందనడంలో సందేహమే లేదు.
6. పోషకాహార లోపం అంటే ఏమిటి? దీనివల్ల కలిగే 2 న్యూనతా వ్యాదుల గురించి రాయండి? (AS-1)
జ. మనం తీసుకొనే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు తగిన పరిమాణంలో లేకపోవడాన్ని పోషకాహార లోపంగా పేర్కొంటారు. పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను ’న్యూనత వ్యాధులు’ అని కూడా అంటారు. ఉదా॥క్వాషియార్కర్, మెరాస్మస్
1. క్వాషియార్కర్:
- ఇది ప్రొటీన్‌స లోపం వలన కలిగే వ్యాధి
- శరీరంలోని కణాంతరాలలో నీరు చేరి శరీరం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది.
- కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది.
- కాళ్ళు, చేతులు, ముఖం ఉబ్బి ఉంటాయి
- పొడిబారిన చర్మం విరేచనాలతో బాధపడుతూ ఉంటారు.
2.మెరాస్మస్:
- ఈ వ్యాధి ప్రొటీన్‌లు, కెలోరీల లోపం వల్ల కలుగుతుంది.
- సాధారణంగా తల్లి మొదటికాన్పు, రెండవ కాన్పుకు మధ్య తక్కువ వ్యత్యాసంతో పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది.
- ఈ వ్యాధిగ్రస్తుల పిల్లలు నీరసంగా బలహీనంగా, ఎముకలు తేలిన శరీరంతో కనిపిస్తారు.
- కండరాలలో పెరుగుట లోపం, కీళ్ళవాపుతో బాధపడతారు
- పొడిబారిన చర్మం, విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయి.
జ.
ఉద్దేశ్యం:కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ఆవశ్యకతను నిరూపించుట
పరికరములు: కుండీ మొక్క, వెడల్పుమూతి గల గాజుసీసా, రబ్బర్ కార్‌క, KOH అయొడిన్ (రసాయన పదార్థాలు)
ప్రయోగ విధానం:
1) ఒక వెడల్పు గల గాజు సీసాను తీసుకొనవలెను.
2) అందులో KOH ద్రావణాన్ని తీసుకొనవలెను. KOH కు CO2ను పీల్చే గుణం ఉంది.
3) నిలువుగా చీల్చబడిన ఒక బెండు బిరడాను తీసుకొని గాజుసీసా మూతికి బిగించవలెను.
4) మొక్కలో ఎంపికచేసుకున్న ఆకును సగభాగం సీసాలోనికి, సగభాగం బయటకి ఉండేవిధంగా అమర్చవలెను.
5) ఈ ప్రయోగ అమరికను సూర్యరశ్మిలో ఉంచవలెను.
6) కొన్ని గం॥తర్వాత సీసాలో అమర్చిన ఆకును, మొక్కలో మరోఆకును తీసుకొని అయొడిన్ ద్రావణంతో పరీక్షించవలెను.
ఫలితం:
1. గాలి, వెలుతురు సోకిన ఆకును అయొడిన్ పరీక్ష చేయగా నీలి-నలుపు రంగులోకి మారినది.
2. సీసాలోపల ఉన్న ఆకును పరీక్షించగా అది నీలి నలుపురంగులోకి మారలేదు. కారణం సీసాలోని KOH ద్రావణం CO2 ను పీల్చివేసింది. కావున కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు.
నిర్ధారణ:ఈ ప్రయోగం - కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని తెలుస్తుంది.
గమనిక:పిండి పదార్థం తొలగించబడిన మొక్క ఈ ప్రయోగానికి అవసరం. కనుక కనీసం ఒక వారంరోజులు ఆ మొక్కను చీకటిలో ఉంచాలి. ఆకులో ఇదివరకే ఉన్న పిండిపదార్థం తొలగించబడుతుంది.
8.కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని ఎలా నిరూపిస్తావు?(AS - 3)
జ.ఉద్దేశ్యం:కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించుట
పరికరాలు:కుండీలో మొక్క, లైట్ స్క్రీన్, అయోడిన్
పయోగ విధానం:
- కుండీలో ఉన్న ఆరోగ్యమైన మొక్కను తీసుకొని, 2 రోజులు దానిని చీకటిలో ఉంచాలి. దీనివల్ల ఆకులోని పిండిపదార్ధం పూర్తిగా అదృశ్యమవుతుంది.
- ఒక ఆకును కాంతి సోకకుండా లైట్‌స్క్రీన్ అమర్చాలి.
- లైట్ స్క్రీన్ మీద ఆకారపు నమూనా ఉంటుంది.
- మొక్కకు తగినంత నీరుపోసి 4-5 గం॥ఎండలో ఉంచాలి. మూతమీద చెక్కిన ఆకారపు నమూనా ద్వారామాత్రమే ఆకుపై కాంతి ప్రసరిస్తుంది.
- మొక్కనుండి ఆకును వేరుచేసి, లైట్ స్క్రీన్‌ను కూడా ఆకు నుండి తీసివేయాలి.
- ఆకులో పిండి పదార్థం తెలుసుకొనుటకు అయొడిన్ పరీక్ష చేయాలి.
- ఆకు కాంతి గ్రహించిన చోటు మాత్రమే నీలంగా మారుతుంది. నీలంరంగు కలిగిన నమూనాలో కిరణజన్య సంయోగక్రియ జరిగినది.
- కాంతి గ్రహించని నమూనా చుట్టు నీలంగా మారలేదు. అంటే ఆ భాగంలో కిరణజన్య సంయోగక్రియ జరగలేదు.
నిర్ధారణ:దీనినిబట్టి కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని ఋజువు చేయబడినది. - కాంతిచర్యలు, నిష్కాంతి చర్యల మధ్య తేడాలు రాయండి? (AS - 1)
జ.
కాంతి చర్య |
నిష్కాంతి చర్య |
1. కిరణజన్య సంయోగక్రియలో మొదటి దశ |
1. కిరణజన్య సంయోగక్రియలో రెండవదశ |
2. హరితరేణువులోని థైలకాయిడ్(గ్రానా)లో జరుగుతుంది. |
2. హరితరేణువులోని అవర్ణిక (స్ట్రోమా)లో జరుగుతుంది. |
3. కాంతిశక్తిని ఉపయోగించుకొని రసాయనిక కర్బన పదార్థాలు ఏర్పడతాయి. |
3. కాంతి శక్తి ప్రమేయం లేకున్నా రసాయనిక శక్తిని ఉపయోగించుకొని శక్తిగా మార్చబడుతుంది. |
4. ATP,NADPH2ను అంత్య ఉత్పన్నాలు |
4. పిండిపదార్థాలు (గ్లూకోజు) అంత్య ఉత్పన్నాలు |
5. శక్తి గ్రాహకాలు ఏర్పడతాయి. |
5. శక్తిగ్రాహకాలు వినియోగించబడతాయి |
6. దీనిలో ప్రధానంగా ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి |
6. దీనిలో క్షయకరణ చర్యలు జరగుతాయి |
7. దీనిలో నీటికాంతి విశ్లేషణ- జరుగుతుంది. |
7. దీనిలో కార్బన్ స్థాపన జరుగుతుంది. |
8. ఆక్సిజన్ వాయువు విడుదలగును |
8. ఆక్సిజన్ విడుదల కాదు. |
2 మార్కుల ప్రశ్నలు- జవాబులు
1. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమిటి? సమీకరణం సూచించండి?
జ.పత్రహరితం కలిగిన మొక్కలు సూర్యకాంతిలో కార్బన్ డై ఆక్సైడ్, నీటిని ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు)ను తయారుచేసుకొనే ప్రక్రియను ‘కిరణజన్య సంయోగక్రియ‘ అంటారు. ఇది సరళపదార్థాలను సంక్లిష్ట పదార్థాలుగా తయారుచేసే కాంతి రసాయన చర్య. ఈ క్రియలో గ్లూకోజు, నీరు, ఆక్సిజన్ అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి.
సమీకరణం:
2. ఆహారనాళంలో వివిధ అవయవాల ద్వారా ఆహారం ప్రయాణించే మార్గాన్ని ప్లోచార్టు ద్వారా తెలపండి?
జ. నోరు ఆహార వాహిక్ధజీర్ణాశయం్ధచిన్న ప్రేగ్ధుపెద్ద ప్రేగు పాయువుుుపురీషనాళం
3. విటమినులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జ. విటమినులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
అవి 1. నీటిలో కరిగేవి: B - కాంప్లెక్స్, విటమిన్ - C
2. కొవ్వులో కరిగేవి: A,D,E,K విటమినులు
4. ఆరోగ్యవంతునికి అజీర్తి కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (AS - 1)
జ.ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అజీర్తి కలగకుండా కింది జాగ్రత్తలు పాటించాలి.
1) మెత్తటి సమతుల ఆహారం తీసుకోవడం
2) నెమ్మదిగా ప్రశాంతంగా తినడం
3) ఆహారాన్ని బాగా నమిలి తినడం
4) ద్రవరూప ఆహారం తీసుకుంటే మంచిది
5) తిన్నవెంటనే శరీరం కాస్త చలనస్థితిలో ఉండాలి.
కాని వ్యాయామం వంటి పనులు చేయకూడదు.
5. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియా ఎంజైముల పాత్ర గురించి రాయండి? (AS - 1)
జ.సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్‌లు, ప్రొటీన్‌లు, లిపిడ్‌స, సరళ అణువులుగా ఎంజైమ్‌ల సహాయంతో విడగొట్టబడతాయి. విడగొట్టబడిన ఆహారం చిన్నప్రేగులో శోషించబడి సూక్ష్మ చూషకాల ద్వారా రక్తంలో కలుస్తుంది. అక్కడినుండి ప్రతి కణానికి అందించబడుతుంది. ఈ ఎంజైములు నీటిలోని లాలాజల గ్రంథులు, జీర్ణాశయంలో జఠరరస గ్రంథులు, క్లోమ గ్రంథులు, పేగులోని గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతాయి.
6. పోషకాహార లోపం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలుగా ఉంది? (AS - 1)
జ.మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు లోపించడాన్ని పోషకాహార లోపం అంటారు. పోషకాహార లోపం 3 రకాలుగా విభజించవచ్చు.
1. కెలోరీల పరమైన పోషకాహార లోపం
2. ప్రొటీన్‌ల సంబంధిత పోషకాహార లోపం
3. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం
7.పోషణ పాఠం చదివిన తర్వాత నీ ఆహారపు అలవాట్లలో ఏఏ మార్పులు చేసుకుంటావు? (AS - 6)
జ.1. అన్ని పోషక విలువలు కలిగిన సంతులిత ఆహారం తీసుకుంటాను.
2. ప్రతిరోజు నిర్దిష్ట సమయాలలో ఆహారం తీసుకుంటాను
3. నేను తీసుకొనే ఆహారంలో పీచుపదార్థాలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటాను. దీనివలన మలబద్ధకం నివారించవచ్చు.
4. ప్రతిరోజూ 4-5 లీటర్ల నీటిని త్రాగుతాను. జీర్ణాశయంలో ఆమ్లత్వం పెరగదు.
5. తాజా ఆకుకూరలు లేదా కూరగాయలు, పాలు గుడ్లు ప్రధానంగా ఉండేలా రోజువారీ ఆహారంతో జాగ్రత్త పడతాను.
8. రోగికి గ్లూకోజు ఎక్కించినపుడు అది శక్తిని ఎలా అందిస్తుంది? (AS - 1)
జ.రోగి పూర్తిగా నీరసించినపుడు తప్పనిసరిగా గ్లూకోజు సిరల ద్వారా ఎక్కించాల్సిన అవసరం ఉంది. గ్లూకోజు అనేది శక్తినిచ్చే సరళ పదార్థం. ఇది త్వరగా రక్తంలో కలిసిపోయి కణాలకు శక్తిని అందిస్తుది. దీనివలన అలసట, నీరసం, త్వరగా తగ్గి జీవక్రియా స్థాయి మెరుగుపడుతుంది.
9. తగినన్ని నీళ్ళు తాగడం మంచిదని సూచిస్తారు. ఎందుకు? (AS - 2)
జ.నీరు విశ్వద్రావణి. నీరు అనేక జీవరసాయనిక చర్యలకు మాధ్యమం. జీర్ణమైన ఆహార పదార్థాలు, హార్మోనులు, విసర్జక పదార్థాలు శరీరంలో ఒక చోటనుండి మరొక చోటుకు నీటిద్వారా రవాణా జరుగుతుంది. నీరు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయటంలో తోడ్పడుతుంది. రోజూ తగినంత నీటిని తాగడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లత్వం ఏర్పడదు.
10.పోషకాహార లోపం ఏర్పడటానికి కారణం ఏమిటి? (AS - 1)
జ.పోషకాహార లోపం ఏర్పడటానికి సహజంగా కింది కారణాలు ఉంటాయి.
1. నిరక్షరాస్యత లేదా పోషక విలువలపై సరైన అవగాహన లేకపోవడం
2. తరచుగా ఉపవాసాలు, ఆనారోగ్యానికి గురి కావడం.
3. వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురికావడం
4. ఆహారపు అలవాట్లలో తప్పుడు అభిప్రాయాలు - మూఢనమ్మకాలు
5. పేదరికం, పరిశుద్ధమైన నీరు లభించకపోవడం.
11. కస్కూట మొక్క పరాన్నజీవి అని ఎలా చెప్పగలవు? (AS - 1)
జ.కస్కూట ప్రజాతికి చెందిన బంగారుతీగ లేదా డాడర్ మొక్కల్లో పత్రహరితం ఉండదు. కస్కూటా రిప్లెక్సాలో కొద్దిమొత్తంలోనే పత్రహరితం ఉంటుంది. పత్రాలు సన్నని పొలుసుల మాదిరిగా క్షీణించి ఉంటాయి. బంగారు తీగ కాండం సన్నగా, పొడవుగా ఉండి తీగవలె ఆతిధేయి మొక్కచుట్టు పెనవేసుకుంటుంది. దానిపక్కనున్న మరొక మొక్కపై కూడా వల మాదిరిగా ఆక్రమిస్తుంది. ఇది హిస్టోరియా(చూషకాల) ద్వారా ఆహారంసేకరిస్తుంది. హిస్టోరియాలు వేళ్ళమాదిరిగి ఉండి అతిధేయి కణజాలంలోకి చొచ్చుకొని పోతాయి. ఒక్కొక్కసారి అతిధేయిని కూడా చంపివేస్తాయి.
12.గర్భవతులకు ఫోలిక్ ఆసిడ్ ఉండే మాత్రలను, ఆకుకూరలను బాగా తీసుకోవాలంటారు. ఎందుకు? (AS - 2)
జ. గర్భందాల్చిన వారి గర్భాశయంలో పెరుగుతున్న భ్రూణానికి పోషక పదార్థాలను రక్తం ద్వారా అందించాలి. కాబట్టి గర్భిణి ఎర్రరక్తకణాలలో హిమోగ్లోబిన్ శాతం తగిన మోతాదులో (12శాతం) పైన ఉండాలి. సాధారణ పోషకాలతో పాటు ఫోలిక్ ఆసిడ్ మాత్రలను తీసుకుంటే ఐరన్ మూలకం అదనంగా లభిస్తుంది. తద్వారా ఎనీమియా (రక్తహీనత) కు గురయ్యే పరిస్థితి ఉండదు. అలాగే తాజా ఆకుకూరలు తీసుకోవడం వల్ల విటమిన్ - ఎతో పాటు ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరలు సులభమైన జీర్ణక్రియకు కూడా తోడ్పడుతాయి.
1 మార్కుల ప్రశ్నలు- జవాబులు
1. కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యే కారకాలు ఏవి?
జ. సూర్యకాంతి, కార్బన్ డై ఆక్సైడ్, నీరు, పత్రహరితం.
2. కిరణజన్య సంయోగక్రయను సూచించే సమీకరణం రాయండి?
జ.
3. NADP ను విస్తరించుము.
జ.నికోటినమైడ్ ఎడినైన్ డై ఫాస్ఫేట్
4. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన కాంతి తరంగ దైర్యం ఎంత?
జ. 400-700nm మధ్య ఉంటుంది. ఇందులో అరుణ, నీలి కాంతులు కిరణజన్య సంయోగక్రియకు అవసరం.
5. కాంతిచర్యలో ఏర్పడే అంత్య పదార్థాలు ఏవి?
జ. NADPH, ATPలు ఏర్పడతాయి. వీటిని శక్తి గ్రాహకాలు అని కూడా అంటారు.
6.పత్రహరిత వర్ణద్రవ్యాలు ఎక్కడ ఉంటాయి? అవి ఏవి?
జ. హరితరేణువుల్లోని థైలకాయిడ్ దొంతరలలో రెండు పత్రహరిత వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. అవి
1. క్లోరోఫిల్ -ఎ (నీలి - ఆకుపచ్చ)
2) క్లోరోఫిల్ - బి (పసుపు- ఆకుపచ్చ)
7. ఎమల్సీకరణం అంటే ఏమిటి?
జ.కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. ఈ విధానాన్ని ఎమల్సీకరణం అంటారు.
8. అమీబాలో పోషణ ఎలా జరుగుతుంది?
జ.అమీబాలో పోషణ అనేది వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. మిధ్యాపాదాల ద్వారా ఆహారాన్ని పట్టుకొని ఆహార రిక్తికలోకి పంపి, సరళ పదార్ధాలుగా విడగొట్టి వ్యాపనం చెందుతుంది.
9. స్థూలకాయత్వం వల్ల వచ్చే వ్యాధులు ఏవి?
జ.డయాబెటిస్ (మధుమేహం) గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు
10, శస్త్ర చికిత్స సమయంలో వైద్యుడు రోగికి ఇచ్చే విటమిన్ ఇంజక్షన్ ఏది?
జ.విటమిన్ -కె. ఇది రక్తస్రావాన్ని నిరోధిస్తుంది.
11. కైమ్ ఆనగానేమి?
జ. ఆహారంలో ఉండే ప్రొటీన్లు మరియు కార్బొహైడ్రేట్స్ అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి చిక్కటి రూపంలోకి మారుతుంది. దీనినే కైమ్ అంటారు.
12. విటమినులు లభించే మార్గాలు ఏవి?
జ. విటమినులు లభించే మార్గాలు రెండు అవి
1. మనం తినే ఆహారం ద్వారా
2. జీర్ణవ్యవస్థలె ఉండే బ్యాక్టీరియాలు సంశ్లేషణం చేయుట ద్వారా శరీరానికి అందజేయబడతాయి.
13.ఎనీమియా దేని లోపం వల్ల సంభవిస్తుంది?
జ. ఎనీమియా అనగా రక్తహీనత. ఇది పిరిడాక్సిన్ (B6), ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల సంభవిస్తుంది.
14. రికెట్సు వ్యాధి లక్షణాలు ఏమిటి?
జ. రికెట్సు వ్యాధి ’డి’ విటమిన్ లోపం. దీనివల్ల ఎముకలు సరిగా పెరుగుదల చూపకపోవడం, పెళుసు బారడం, ముంజేతివాపు,దొడ్డికాళ్ళు ఏర్పడటం, దంత సమస్యలు.
15.వాంతి జరగడానికి కారణం ఏమిటి?
జ.మనం తీసుకొనే ఆహారంలో కొవ్వుశాతం ఎక్కువైనపుడు, జీర్ణంకానపుడు లేదా విషతుల్యమైన ఆహారం తీసుకున్నపుడు వాంతి కావడం సహజం.
16.కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి?
జ.హరిత రేణువులోని గ్రానాలో కాంతి చర్యలు, స్ట్రోమాలో నిష్కాంతి చర్యలు జరుగుతాయి.
బహుళైచ్చిక ప్రశ్నలు- జవాబులు
1. కణాలలో శక్తి నిలువ ఉండే ప్రదేశం? (బి)
ఎ) కేంద్రకం
బి) మైటోకాండ్రియా
సి) కణ కవచం
డి) రైబోసోమ్‌లు
2. పత్రహరితంలో ఇమిడి ఉండే లోహం ఏది? (బి)
ఎ) కాల్షియం
బి) మెగ్నీషియం
సి) జింక్
డి) ఐరన్
3. కిందివానిలో ఎంజైమ్ లేని జీర్ణరసం (సి)
ఎ) జఠర రసం
బి) ఆంత్రరసం
సి) పైత్యరసం
డి) లాలాజలం
4. థయమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి? (ఎ)
ఎ) బెరిబెరి
బి) గ్లాసైటిస్
సి) పెల్లగ్రా
డి) అనీమియా
5. పారమీసియంలో ఆహార సేకరణ భాగాలు ఏవి? (డి)
ఎ) మిధ్యాపాదాలు
బి) రిక్తికలు
సి) కంటకాలు
డి) శైలికలు
6. ఉదయాన్నే సూర్యరశ్మి నుండి లభించే విటమిన్ ఏది? (సి)
ఎ) విటమిన్ B1
బి) విటమిన్ B6
సి) విటమిన్ D
డి) విటమిన్ E
7. ఆక్సిజన్ వాయువును నామకరణం చేసిన శాస్త్రజ్ఞుడు
జ.లెవోయిజర్
8. పత్రహరితంలో పిండి పదార్థాలను పరీక్షించుటకు వాడే కారకం?
జ.అయోడిన్ లేదా బెటాడిన్
9. మలబద్ధకాన్ని నివారించుటకు ఆహారంలో ______పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.
జ.పీచు
10. శస్త్ర చికిత్సలో వైద్యులు ఇంజక్షన్‌గా ఉపయోగించే విటమిన్ ?
జ. విటమిన్ K
11.బంగారు తీగ ఏ ప్రజాతికి చెందినది?
జ. కస్కూట
12. కార్బన్ డై ఆక్సైడ్ ను శోషణం చేసుకునే రసాయనం
జ. పాటాషియం హైడ్రాక్సైడ్ (KOH)
13.కిరణజన్య సంయోగ క్రియలో CO2 ను మొక్క ______ నుండి గ్రహిస్తుంది.
జ. పత్రరంధ్రం
14. ATP సంక్షిప్త రూపం
జ. అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్
15.గాయాలు మానుటకు ఉపయోగపడు విటమిన్
జ. C
16. కాంతి కిరణాలలో ఉండే శక్తిని ఏమంటారు.
జ. కాంతి శక్తి
17. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ స్థాపన పరిశోధనకుగాను ______ కు నోబెల్ బహుమతి లభించింది.
జ. మెల్విన్ కాల్‌విన్
18. కిరణజన్య సంయోగక్రియలో సమీకరణాన్ని ప్రతిపాదించిన వారు?
జ. సి.బి. వాన్‌నైల్
19 చెరకులోని చక్కెర?
జ. సుక్రోజ్
20.విటమినులకు పేరు సూచించిన శాస్త్రవేత్త?
జ. ఫంక్
21.రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడే విటమిన్?
జ.కె
22.కస్కూట మొక్క పరాన్న జీవనం జరపడానికి కారణం (బి)
ఎ) పత్రాలు లేకపోవడం
బి) వేర్లు లేకపోవడం
సి) కాండం సన్నగా ఉండటం
డి) నీళ్ళు సరిగా గ్రహించలేక పోవడం
23. ఈ కిందివానిలో తప్పుగా జతచేయబడినది గుర్తించండి? (సి)
ఎ) లాలాజలం- టయలిన్
బి) క్లోమరసం- అమైలేజ్
సి) పైత్యరసం - లైపేజ్
డి) ఆంత్రరసం-పెప్టిడేజస్
24. జఠర రసంలో ఉండే ఆమ్లం? (బి)
ఎ) సల్ఫ్యూరిక్ ఆమ్లం
బి) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
సి) నత్రికామ్లం
డి) పాస్ఫారికామ్లం
25.విటమినుల పరిమాణంను ఏ ప్రమాణాలలో కొలుస్తారు? (బి)
ఎ) మిల్లీగ్రామ్
బి) మైక్రోగ్రామ్
సి) గ్రామ్
డి) మాక్రోగ్రామ్
26. మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం? (ఎ)
ఎ) పత్ర రంధ్రాలు
బి) స్పంజి కణజాలం
సి) స్తంభాకార కణజాలం
డి) మధ్య ఈనె
27. కాంతిద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడాన్ని నిరూపించింది? (సి)
ఎ) జోసఫ్ ప్రిస్లేట
బి) ఎంగర్ మెన్
సి) రాబర్‌ట హిల్
డి) లెవోయిజర్
జతపరచండి
I. గ్రూపు- A |
గ్రూపు- B |
1. పెల్లగ్రా |
ఎ) రైబోఫ్లోవిన్ |
2. స్కర్వీ |
బి) రెటినాల్ |
3. గ్జిరాప్తాల్మియా |
సి) సయనకోబాలమిన్ |
4. పెర్నీషియా ఎనీమియా |
డి) నియాసిన్ |
5. గ్లానైటిస్ |
ఇ) ఆస్కార్బిక్ ఆమ్లం |
|
ఎఫ్) బయోటిన్ |
సమాధానాలు: I
1. డి
2. ఇ
3. బి
4. సి
5. ఎ
II. గ్రూపు- A |
గ్రూపు- B |
1. పైత్యరసం |
ఎ) పైప్సిన్ |
2. జఠర రసం |
బి) ఎంజైములు లేవు |
3. క్లోమరసం |
సి) టయలిన్ |
4. లాలాజలం |
డి) అమైలేజ్ |
5. ఆంత్రరసం |
ఇ) సుక్రోజ్ |
|
ఎఫ్) మాల్టోజ్ |
సమాధానాలు: II
1. బి
2. ఎ
3. డి
4. సి
5. ఇ
క్విక్ రివ్యూ
- కిరణజన్య సంయోగక్రియను నిర్వచించిన సమీకరణం రాయండి.
- మొక్కలు ఆహారం తయారుచేసే విధానాన్ని నీవెలా అభినందిస్తావు?
- కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతను పటం సహాయంతో వివరించుము.
- పోషకాహార లోపం వల్ల వచ్చే న్యూనతా వ్యాధులపై అవగాహన పెంచుకోవాలంటే డాక్టరుగారిని ఏఏ ప్రశ్నలు అడుగుతావు?
- హరితరేణువును పటం సహాయంతో వివరించండి?
- ఆకు యొక్క అడ్డుకోత పటం గీచి, భాగాలను గుర్తించుము.
- ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియా ఎంజైముల పాత్ర గురించి రాయండి?
- స్థూలకాయం వల్ల వచ్చే వ్యాధులు ఏవి?
- హరిత రేణువులోని ఏ భాగంలో కాంతి చర్యలు నిష్కాంతి చర్యలు జరుగుతాయి?
- విటమినులు అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి?