Distribution of tabs worth Rs 686 crore to students: విద్యార్థులకు రూ.686 కోట్ల విలువ చేసే ట్యాబ్‌ల పంపిణీ : సీఎం జగన్
పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళతారు అని మండిపడ్డారు.
‘‘ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత లేక పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేస్తోంది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయి. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్‌లు అందిస్తున్నాం. క్లాస్ టీచర్ చెప్పే పాఠాలకు ఈ ట్యాబ్‌లు సపోర్ట్‌గా ఉంటాయి. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పేద తల్లిదండ్రుల కష్టాలను చూశా. మూడున్నరేళ్లలో ఎక్కడా వెనకడుగు వేయకుండా విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా’’ అని సీఎం జగన్ తెలిపారు.
‘‘పిల్లలకు నష్టం జరిగే కంటెంట్‌ను ట్యాబ్‌ల్లో తొలగించాం. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్‌లో రూ.32 వేల విలువ చేసే బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేసి అందిస్తున్నాం. ఇందుకోసం రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు బాగుండాలని తమకన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా మంచి పేరు ఇంకా తెచ్చుకోవాలని, ప్రతి తల్లీదండ్రీ మనసారా కోరుకుంటారు. సమాజ పరిస్థితులు అయితేనేమీ, పేదరికం వల్ల అయితేనేమీ పిల్లను సరిగ్గా చదివించుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు బాధపడుతుండడం నేను చూశా. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తా’’ అని సీఎం జగన్ వెల్లడించారు.