Skip to main content

PDF రూపంలో పాఠ్యపుస్తకాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా చూసేందుకు అన్నివేళలా అందుబాటులో ఉండేలా పీడీఎఫ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
PDF
PDF రూపంలో పాఠ్యపుస్తకాలు

ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 371 రకాల పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ఏప్రిల్‌ 26న జరిగిన కార్యక్రమంలో పుస్తకాల వెబ్‌సైట్‌ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, పాఠశాలవిద్య కమిషనర్‌ సురేష్‌కుమార్, పాఠ్యపుస్తకాల ముద్రణసంస్థ డైరెక్టర్‌ రవీంధ్రనాథ్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 353 పుస్తకాలను అందుబాటులో ఉంచామని, కొద్దిరోజుల్లో మరో 18 పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పారు.

చదవండి: NCERT: కొత్త పాఠ్య పుస్తకాలు ముద్రణ .. ఇన్ని భాషల్లో..

ఈ పాఠ్య పుస్తకాలను విద్యార్థులు వ్యక్తిగతంగానే ఉపయోగించుకోవాలని, వీటిని ముద్రించి, బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 42 లక్షల మందికి ఉచితంగాను, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న సుమారు 28 లక్షల మందికి విక్రయ పద్ధతిన పాఠ్యపుస్తకాలను సమకూరుస్తున్నామని చెప్పారు. ఇకపై ఈ పుస్తకాలన్నీ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ పుస్తకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  

చదవండి: NCERT: పాఠ్యపుస్తకాలే అనుసరించాలి

ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు  

పాఠశాలవిద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ పుస్తకాల ద్వారా బోధనలో డిజిటల్‌ ప్రక్రియను కొనసాగించడంతో పాటు పుస్తకాల కొరత అనే సమస్య ఉండదని చెప్పారు. ద్విభాషా పాఠ్య పుస్తకాలను రూపొందించి నూతన జాతీయ విద్యావిధాన స్ఫూర్తికి అనుగుణంగా చర్యలు తీసుకున్న రాష్ట్రంగా దేశంలో ఏపీ నిలిచిందని, ఈ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు.  పాఠ్యపుస్తకాలను https://cse.­ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 195 ద్విభాషా పుస్తకాలు, 176 భాషా పుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం 2020–2021 విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానంతో ద్విభాషా పద్ధతిలో ఒకటి నుంచి 9 తరగతుల వరకు పాఠ్యపుస్తకాలను అందిస్తోంది.  ఇప్పు­డు కొత్తగా ఆన్‌లైన్‌లో ఒకటి నుంచి 10 తరగతుల వరకు 371 పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. వీటిలో 195 ద్విభాషా పుస్తకాలు, 176 భాషా     పుస్తకాలు ఉన్నాయి.  

చదవండి: హిందీలో MBBS పాఠ్యపుస్తకాలు విడుదల చేసిన అమిత్‌ షా

Published date : 27 Apr 2023 03:45PM

Photo Stories