పాఠశాలల్లో సైన్స్,కంప్యూటర్ ల్యాబ్‌లు
ఆరిలోవ : సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ ఎల్.చంద్రకళ సూచించారు. విశాఖ వ్యాలీ స్కూల్‌లో మంగళవారం జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లతో డీఈవో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించాల్సిన విధి విధానాలను ఆమె వివరించారు. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, ఫీజులు, 12(1)సీ ప్రవేశాలు, యూడీఐఎస్‌ఈ అప్‌డేషన్, సిలబస్ పూర్తిచేయడం, బోధనా విధానాలు, పరీక్ష విధానం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ఆమె పలు సూచనలు చేశారు. అన్ని పాఠశాలల్లో గ్రంథాలయాలు వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాలల యాజమాన్యాలు వాటికి రికగ్నేషన్లు, రెన్యువల్స్ సకాలంలో చేయించాలన్నారు. గుర్తింపులేని పాఠశాలలను మూసివేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఫిర్యాదులు పెట్టెలు, వినియోగదార్ల ఫోరం ఏర్పాటు చేసి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు త్వరలో వృత్యంతర శిక్షణ ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సమీక్షలో డిప్యూటీ డీఈవో ఎ.గౌరీశంకరరావు, ఏపీవో అప్పలనాయుడు పాల్గొన్నారు.