పిల్లలను చదువుల బాట పట్టించడమే పథకం లక్ష్యం
కోవిడ్ వల్లే అమలు కాలేదు..
అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75% హాజరు ఉండాలన్న నిబంధన గతంలోనే విధించామని, అయితే కోవిడ్ వల్ల ఇన్నాళ్లూ అమలు చేయలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చెప్పారు. రెండేళ్లుగా కరోనాతో పాఠశాలలు సరిగా పని చేయని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించగా మార్చి చివరి వారంలో కోవిడ్ మొదలైందన్నారు. పథకం అమల్లోకి వచ్చిన 2 – 3 నెలలు తిరగకముందే కోవిడ్ ప్రారంభం కావడంతో స్కూళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. తిరిగి 2020 నవంబరు, డిసెంబరులో పాఠశాలలు తెరిచి జనవరి 2021లో మళ్లీ అమ్మ ఒడి ఇచ్చామని తెలిపారు. అయితే కోవిడ్ రెండో వేవ్ రావడంతో పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఈ ఏడాది కూడా జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
75 % హాజరు.. జూన్‌లోనే అమ్మ ఒడి, కానుక
2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి విద్యార్ధులహాజరును అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలను చదువుల బాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ఉద్దేశమని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలనే 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే మనం నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం (2021–22)లో 75 శాతం హాజరు నిబంధనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సాధారణంగా స్కూళ్లు జూన్‌లో ప్రారంభమై ఏప్రిల్ వరకూ కొనసాగుతాయి కాబట్టి విద్యాసంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్నారు. హాజరును పరిగణలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌కు పంపే సమయంలో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని సూచించారు. అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలని ఆదేశించారు.
అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్
అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్ లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలని, దీనిపై మ్యాపింగ్ చేసి ప్లే గ్రౌండ్స్ లేని చోట భూ సేకరణ చేసి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలక్రమేణా ప్రీ హైస్కూల్ స్థాయి వరకూ ప్లే గ్రౌండ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డిసెంబర్ నాటికి విద్యా కానుక వర్క్ ఆర్డర్
డిసెంబర్ నాటికి విద్యా కానుక వర్క్ ఆర్డర్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
ప్రతీ స్కూల్ నిర్వహణకు రూ.లక్ష
ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.లక్షను వారికి అందుబాటులో ఉంచాలని, దీనివల్ల మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందని, ఈమేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏ మార్పులు తెచ్చినా టీచర్లతో మాట్లాడాలి
స్కూళ్ల పనితీరుపై సోషల్ ఆడిట్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారులు ప్రతిపాదించగా ఇలాంటి ఏ మార్పులు ప్రవేశపెట్టినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని సీఎం స్పష్టం చేశారు. చిరునవ్వుతో వారిని ఆహ్వానించి అభిప్రాయాలు తెలుసుకోవాలని, అయోమయానికి, గందరగోళానికి దారితీసేలా ఉండకూడదన్నారు. లేదంటే దీనివల్ల అపోహలు పెరుగుతాయని, వాటిని రెచ్చగొట్టి పక్కదోవ పట్టించే ప్రయత్నాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తేవాలనుకున్నా దాని వెనక ఉద్దేశాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలని సూచించారు. భాగస్వాములందరూ కలిసి ముందుకు సాగితేనే విజయవంతం అవుతుందన్నారు. ర్యాంకింగ్‌లు ఎందుకు ఇస్తున్నామో వారికి స్పష్టంగా చెప్పాలని సీఎం సూచించారు.
వెంటనే టీచర్ల మ్యాపింగ్
టీచర్ల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తేవాలని సూచించారు. ఈ నెలాఖరు నాటికి మ్యాపింగ్ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. పాఠ్యప్రణాళికను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని, దీనిపై తర్వాత సమావేశంలో వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు.
ఎక్కడ వెనుకబడ్డామో తెలుసుకునేలా సోషల్ ఆడిట్
ఎక్కడ వెనకబడి ఉన్నామో తెలుసుకోవడమే లక్ష్యంగా సోషల్ ఆడిట్ విధానం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి విధానాలు టీచర్లను తొలగించడానికో లేదా వారిని అభద్రతా భావానికి గురి చేయడానికో కావనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అధికారులను ఆదేశించారు. తప్పులు వెతకడానికి, ఆ తప్పులకు బాధ్యులను చేయడానికీ ఈ విధానాలు కావనే విషయాన్ని పదేపదే చెప్పాలన్నారు. స్కూళ్లను నడిపే విషయంలో, విద్యార్థులకు బోధన అందించే విషయంలో, నాణ్యతను పాటించే విషయంలో ఎక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సోషల్ ఆడిటింగ్ ఉండాలని సీఎం ఆదేశించారు.
ఎయిడ్ స్కూళ్లపై బలవంతం లేదు
ఎయిడెడ్ స్కూళ్లను ఎవరూ బలవంతం చేయడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎయిడెడ్ యాజమాన్యాలు విద్యాసంస్థను అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందని, లేదా వాళ్లే నడపాలనుకుంటే వారే నిర్వహించుకోవచ్చనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ఇది స్వచ్ఛందం అనే విషయాన్ని చెప్పాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 91 % హాజరు
కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరుపైనా ఆరా తీశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు తెలిపారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తైనందున చురుగ్గా విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కలిపి ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతం ఉండగా సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరులో ఇప్పటిదాకా 85 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91 శాతం ఉందని వెల్లడించారు.
► విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ,ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ (దిశ స్పెషల్ ఆఫీసర్) కృతికా శుక్లా, ఎండీఎం అండ్ శానిటేషన్ డైరెక్టర్ బీఎం దివాన్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్‌సీఈఆర్‌టీ) బి.ప్రతాప్ రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
చదవండి: