Skip to main content

విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దేందుకే విద్యా రంగ సంస్కరణలు: వైఎస్ జగన్

విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించే దిశగా బాటలు వేసేలా విద్యా రంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ సంస్కరణలు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావని, ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినవి కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరి ప్రభుత్వ టీచర్లకు నష్టం చేయడానికో, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడానికో ఈ చర్యలు తీసుకోలేదని చెప్పారు. సెప్టెంబర్‌ 5న విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇప్పటి మన విద్యా విధానంతో పిల్లలకు ప్రయోజనం కలుగుతోందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోలన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, ఇవి సత్ఫలితాలు ఇచ్చి పిల్లలు అత్యున్నత స్థాయిలోకి వెళ్లేలా చేయడంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులదే కీలక భూమిక అన్నారు. ఈ దిశగా అందరూ ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని కోరారు. ‘కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాలపాటు చదువులకు దూరంగా ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల పిల్లలు వారి మీద రుద్దిన చదువులను వేరే గత్యంతరం లేక చదువుకుంటున్నారు. వాటిని మార్చడంపై మన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అత్యంత ప్రాధాన్యతా రంగంగా విద్యారంగాన్ని గుర్తించడంతో పాటు మూడేళ్ల కాలంలో అనేక అడుగులు ముందుకు వేశాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
Reforms in the education sector to make students all round
గురుపూజోత్సవం సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు

గురువులందరికీ వందనం 

 • రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువులందరికీ శిరస్సు వంచి వందనం చేస్తున్నా. ఉపాధ్యాయులు అందరికీ శిఖరం లాంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన రాష్ట్రపతి స్థాయికి ఎదిగి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. 
 • ‘నాకు జన్మనిచ్చినందుకు నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ.. మెరుగైన జీవితాన్ని పొందడం ఎలాగో నేర్పినందుకు నా గురువుకు రుణపడి ఉంటాను’ అనేవి స్ఫూర్తిదాయకమైన మాటలు. ఇవి నేను చెప్పడమే కాదు.. ఒకప్పుడు ప్రపంచాన్నే ఏలిన గొప్ప నాయకుడు అలెగ్జాండర్‌ కూడా చెప్పారు. సానపట్టక ముందు వజ్రమైనా రాయి లాగే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలను చెక్కే వారు మన ఉపాధ్యాయులు. 

దేశంలోనే ముందుండాలని.. 

 • దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా.. మెరుగ్గా ఉండేలా విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతూ అడుగులు వేస్తున్నాం. ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మన పిల్లలనూ తీర్చిదిద్దాల్సిన అవసరముంది. అందుకే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యతా రంగంగా గుర్తించాం. ఈ మూడేళ్లలో అనేక అడుగులు ముందుకు వేశాం. 
 • నేను ముఖ్యమంత్రి అయ్యాక విద్యా శాఖ మీద చేసిన రివ్యూలు బహుశా మరే శాఖ మీదా చేయలేదు. ఎందుకంటే.. మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాల తలరాతలను మార్చగలిగే ఒక అస్త్రం చదువు మాత్రమే. అందుకే విద్యా రంగంపై అంతగా దృష్టి పెట్టాను. 
ముద్దాడ ఆదినారాయణకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ముద్దాడ ఆదినారాయణకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ప్రభుత్వ బడికి ఘన వైభవం 

 • గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యానికి గురైన విద్యా సంస్థలను అభివృద్ధి పరిచి, వాటికి ఘన వైభవం చేకూర్చే తపనతో ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేదలు దశాబ్దాలుగా ఆశించిన ఫలితాల కోసం చేపట్టిన మార్పులు ఇవి. పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు తల్లులకు మద్దతుగా ఉండేందుకు తెచ్చిన మార్పులివి. ప్రభుత్వ బడి కార్పొరేట్‌ బడికన్నా బాగుండాలని చేసిన మార్పులివి. టీచర్లు తమ పిల్లలను కూడా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలన్న మంచి సంకల్పంతో తీసుకొస్తున్న మార్పులివి. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం ఎలా? లిటరసీని పెంచడం ఎలా? నాణ్యమైన విద్యను అందించడం ఎలా? అను ప్రశ్నలకు సమాధానంగా తీసుకొస్తున్న మార్పులు ఇవి. 
 • ఉన్నత విద్యలో కనీసంగా 70 శాతం జీఈఆర్‌ రేషియో ఉండాలన్న ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తున్నాం. ఇవన్నీ బాగుండాలంటే, ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే.. మనం అంతా ఒక్కటిగా ముందుకు సాగితేనే సాధ్యం అవుతుంది. 

గత ప్రభుత్వంలో కార్పొరేట్‌కు అందలం 

 

 • గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసి, కార్పొరేట్‌ విద్యా రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ స్కూళ్లకు, ఆస్పత్రులకు, చివరకు ఆర్టీసీ బస్సు ఎక్కడం కూడా వేస్ట్‌ అన్న రీతిలో వ్యవహారం సాగింది. తుదకు ఉద్యోగులను తీసేసే పరిస్థితిలోకి వెళ్లింది. 
 • మన ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఎంతో గౌరవిస్తోంది. ఎవరూ అడక్కపోయినా 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచాం. ఎస్జీటీలను ఎస్‌ఏలుగా, ఎస్‌ఏలను గ్రేడ్‌–2 హెడ్మాస్టర్లుగా, హెడ్మాస్టర్లను ఎంఈఓలుగా ప్రమోషన్లు ఇస్తున్నాం. విద్యా రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇవి అవసరం అని భావించి వెనక్కి ముందడుగు వేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నాం. 

చిత్తశుద్ధితో పెన్షన్‌ సమస్యకు పరిష్కారం.. 

 • ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్‌ విషయం మీద పూర్తి చిత్తశుద్ధితో, వారికి మేలు చేసేలా అడుగులు వేస్తున్నాం. మంచి పరిష్కారం కోసం వెతుకుతున్న ప్రభుత్వం మనదే. ఇప్పుడున్న ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. వారికి మంచి చేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. 
 • కానీ ఇప్పుడు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యోగులకు చేస్తున్న మేలు గురించి, వారి పెన్షన్‌పై చేస్తున్న కృషికి సంబంధించి ఒక్క వాక్యం కూడా రాయని, చూపని ఎల్లో మీడియా.. ఇప్పుడు మనం పరిష్కారం కోసం చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తోంటే రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతోంది. 
 • వీటన్నింటినీ గమనించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర కలిగిన.. టీచర్లకు, ప్రభుత్వ స్కూళ్లకు ఎన్నడూ లేని గౌరవాన్ని పెంచిన ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండదండలు అందించాలి. 

"ఒక మంచి టీచర్‌ ఒక స్కూలును, ఒక వ్యవస్థను మార్చగలడు. గ్రామంతో మొదలు పెట్టి.. గొప్ప విప్లవాన్ని తీసుకు రాగలుగుతాడు. తన కన్న పిల్లల కోసమే కాదు, తరగతిలో ఉన్న పిల్లలందరూ బాగు పడాలని టీచర్‌ ఆరాట పడతారు. పిల్లలకు కేవలం సబ్జెక్టు మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని కూడా మలుస్తారు. వివేకాన్ని పెంచుతారు. పిల్లల్లోని ప్రతిభను బయటకు తీయడంలో కీలక పాత్ర పోషిస్తారు. క్రమశిక్షణతో జీవించడం నేర్పుతారు. బతకడం ఎలాగో టీచర్‌ నుంచే నేర్చుకుంటారు. తన కన్నా తన శిష్యులు గొప్ప వాళ్లు కావాలని ఆరాట పడతారు. "

"గత ప్రభుత్వంలో మాదిరి విద్యా రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుని, కార్పొరేట్‌ వర్గాలకు ఈ రంగాన్ని అమ్మేసి.. పేద సామాజిక వర్గాలకు అన్యాయం చేయడానికి ఈ సంస్కరణలు తీసుకురాలేదు. పెద్ద చదువులకు, మంచి చదువులకు.. పేదరికం ఏమాత్రం అడ్డు కాకూడదు అన్న ఉద్దేశంతో తెచ్చిన మార్పులివి. గతంలో మాదిరి కార్పొరేట్‌ రంగంతో కుమ్మక్కై ఇంగ్లిష్‌ మీడియం, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను పేదలకు దూరంచేసే మార్పులు కావు. ప్రభుత్వ టీచర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టేవి కావు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేవి అంతకంటే కావు. "

"అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్ట్, బైజూస్‌తో ఒప్పందం, ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, బై లింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు స్కిల్స్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రొగ్రాం, ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో మార్పులు.. ఇలా వీటన్నింటి కోసం ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.53 వేల కోట్లు. "

"విద్యా రంగం మీద ప్రేమ, సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది. పేదలకు ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను, జీవితంలో వారు నిలదొక్కుకోవడానికి ఉపయోపడే విద్యను ఇవ్వాలన్నది మన విధానం. ఇందులో చదువు చెప్పడం మాత్రమే కాకుండా, శిలలను శిల్పాలుగా చెక్కినట్లు.. వ్యక్తిత్వాన్ని సైతం మలిచే ఉపాధ్యాయులుగా మీ తోడ్పాటు చాలా ముఖ్యం. "

– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

Published date : 06 Sep 2022 04:34PM

Photo Stories