Tenth Exams 2024 : పదో తరగతి కి పంచతంత్రం
మదనపల్లె సిటీ : పదో తరగతి పరీక్షలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నిచ్చెనలాంటివి. వారి జీవితాలు మలుపు తిరిగేది ఇక్కడే. ఇంతటి ప్రాధాన్యత ఉండటంతో జిల్లా విద్యాశాఖ అధికారులు పదిపై ప్రత్యేక దృష్టి సారించారు. పూర్తిగా వెనుకబడిన పిల్లలను సైతం కనీస మార్కులతోనైనా గట్టెక్కించేలా చూడాలంటూ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రణాళిక మేరకు సన్నద్ధమైతే ఉత్తీర్ణత మార్కులు సాధించడం పెద్ద సమస్య కాదు. ప్రత్యేక తరగతులు, ప్రణాళిక అంటూ ఉపాధ్యాయులు విద్యార్థుల వెంటబడుతుంటారు. ఈ స్ఫూర్తితో జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీల) విద్యార్థునులను సన్నద్ధం చేస్తున్నారు. పంచతంత్రం పేరుతో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఈసారి వీలైనంత మంది 500 పైన మార్కులు సాధించేలా తర్పీదు ఇస్తున్నామని ప్రత్యేక అధికారులు (ఎస్‌ఓ)లు చెబుతున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు:
జిల్లాలో 22 కేజీబీవీల్లో 769 మంది పదో తరగతి, 503 మంది ప్రథమ, 406 మంది ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతున్న వారు ఉన్నారు.సమగ్ర శిక్ష ప్రత్యేకంగా రూపొందించిన పంచతంత్ర ప్రణాళికను అమలు చేస్తున్నారు. కేజీబీవీలో పనిచేస్తున్న ఎస్‌ఓ, సీఆర్టీలు దత్తత తీసుకున్నారు. ఒక్కొక్కరు కనీసం 5 నుంచి 15 మంది విద్యార్థినులను దత్తత తీసుకున్నారు. వారి పరిధిలోని విద్యార్థినులు ఎలా చదువుతున్నారు...ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు తదితర అంశాలను వీరు పరిశీలిస్తారు. లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటారు.ఈ మొత్తం కార్యక్రమం అమలును గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారి (జీసీడీఓ) పర్యవేక్షిస్తున్నారు.
Also Read : Model Papers 2024
వంతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
కేజీబీవీల్లో చదువుతున్న పదో తరగతి, ఇంటర్ విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు సమగ్రశిక్ష రాష్ట్ర అధికారులు పంచతంత్ర ప్రణాళిక తయారు చేశారు .వంద రోజుల ఈ కార్యక్రమం గత నెలలో ప్రారంభమైంది. పాఠ్యాంశాల వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో స్టడీ ప్లానింగ్, వారంతపు పరీక్షలు, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలు కీలకంగా ఉన్నాయి. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు రూ.5 వేలు, వంద శాతం ఫలితాలు సాధించిన కేజీబీవీలకు రూ.50 వేలు నగదు బహుమతిని అందజేయనున్నారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించే జీసీడీఓలకు సన్మానం చేయనున్నారు.
- జిల్లాలోని కేజీబీవీలు : 22
- పదో తరగతి విద్యార్థులు : 769
- ఇంటర్ ప్రథమ సంవత్సరం : 503
- ద్వితీయ సంవత్సరం : 406
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
ఈసారి కేజీబీవీల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాం. ఇందు కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలంటే భయాన్ని తొలగించాం. అన్ని కేజీబీవీల్లో విద్యార్థినులు పోటీపడి చదువుతున్నారు. ఈసారి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. వీలైనన్ని బహుమతులకు విద్యార్థినులు ఎంపికవుతారని ఆశిస్తున్నాం. – రాధమ్మ, జీసీడీఓ, సమగ్రశిక్ష