Online Attendance: విద్యార్థుల హాజరు నమోదుపై ఆన్ లైన్ పర్యవేక్షణ
దశాబ్దాల తరబడి అమలుచేస్తున్న అటెండెన్స్ రిజిస్టర్లతో పాటు ఆన్ లైన్ విధానంలోనూ రోజూ విద్యార్థుల హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థి పేరు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసి పాఠశాల విద్యాశాఖ ఆధార్‌తో అనుసంధానం చేసి సదరు విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నది, లేనిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుందని విద్యావేత్తలు అంటున్నారు. –నల్లజర్ల, పశ్చిమ గోదావరి జిల్లా
క్రమం తప్పకుండా వచ్చేలా..
విద్యార్థులంతా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడటమే స్టూడెంట్ అటెండెన్స్ మొబైల్ యాప్ ఉద్దేశం. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు నిబంధన పెట్టడం వల్ల విద్యార్థుల అటెండెన్స్ శాతం పెరిగింది. –డి.సుబ్బారావు, ఎంఈఓ, నల్లజర్ల
తరగతుల వారీగా అటెండెన్స్
ఆన్ లైన్ లో హాజరు నమోదు కోసం స్టూడెంట్ అటెండెన్స్ మొబైల్ అప్లికేషన్ 1.2 వెర్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థుల హాజరు నమోదును రోజూ తరగతుల వారీగా ఉపాధ్యాయులు తమ సెల్‌ఫోన్ లోని మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుతో పాటు మధ్యాహ్న భోజన వివరాలను సైతం ఇదే యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు పాఠశాలకు రాకపోయినా వచ్చినట్టు హాజరు నమోదు చేసే చర్యలకు చెక్ పెట్టినట్టయ్యింది. అమ్మఒడి పథకం కోసం 75 శాతం హాజరు నిబంధన ప్రవేశపెట్టడం ద్వారా ఎటువంటి అవకతవకలు లేకుండా హాజరు నమోదుకు ఆన్ లైన్ విధానంగా పారదర్శకంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
చదవండి:
KGBV: పోస్టుల భర్తీకి పక్కా రూల్స్
958 Jobs: కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వాటి వివరాలు