Skip to main content

పాఠశాలలకు రూ.1,860 కోట్లు

ఏపీలో అట్టడుగు వర్గాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.. ప్రభుత్వ పాఠశాలలను శక్తివంతమైన సంస్థలుగా రూపొందించడంతోపాటు ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాయి.
పాఠశాలలకు రూ.1,860 కోట్లు
పాఠశాలలకు రూ.1,860 కోట్లు

ఏపీలోని 50 లక్షల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రపంచ బ్యాంకుతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. సుమారు రూ.1,860 కోట్ల (250 మిలియన్ డాలర్ల) ఒప్పందంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి రజత్‌కుమార్‌ మిశ్రా, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, ప్రపంచ బ్యాంకు ఇండియా డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌లు ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు చిన్నారులు, ఎస్టీ, బాలికలు, అట్టడుగు వర్గాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లక్ష్యంగా ‘సపోర్టింగ్‌ ఏపీ లెర్నింగ్‌ ట్రాన్స్ ఫర్మేషన్’ ప్రాజెక్టు పనిచేస్తుంది. పాఠశాల విద్యలో అన్ని తరగతుల విద్యార్థులు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందనున్నారు. 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 40 లక్షల మంది విద్యార్థులు (6–14 ఏళ్ల వయస్సు).. అంగన్ వాడీల్లో 10 లక్షల మంది చిన్నారులు (3–6 ఏళ్లలోపు), 1.90 లక్షల మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా అంగన్ వాడీ కార్యకర్తలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతారు. దేశ ఆర్థిక, సామాజికాభివృద్ధికి నాణ్యమైన విద్య అందరికీ అందించాలి. కరోనావల్ల విద్యార్థుల అభ్యసన నష్టాలు పరిష్కరించడం, ప్రభుత్వ పాఠశాలలను శక్తివంతమైన సంస్థలుగా తయారుచేయాలన్న ఏపీ ప్రభుత్వ దృక్పథానికి ఈ ప్రాజెక్టు మద్దతిస్తుంది’’.. అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం పేర్కొంది.

ఈ ప్రాజెక్టుతో బోధన పద్ధతులు మెరుగు

కంపీటెన్సీ–బేస్డ్‌ టీచింగ్‌–లెర్నింగ్‌ అప్రొచ్‌ అనే కొత్త విధానాన్ని ఏపీ ప్రభుత్వం అవలంబిస్తోందని తెలిపింది. క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ మెంటార్‌షిప్స్, నీడ్‌ బేస్డ్‌ టీచర్‌ ట్రైనింగ్, పర్సనలైజ్డ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌ మెథడ్స్, స్కూల్‌ బేస్డ్‌ అసైన్ మెంట్స్‌ వంటి వాటితో ఈ ప్రాజెక్టు బోధన పద్ధతులను మెరుగుపరుస్తుందని పేర్కొంది. పాఠశాలల సామర్థ్యం పెంచడానికి అందించే ఈ సేవలు దీర్ఘకాలంలో బోధన మెరుగుపరచడంతోపాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని పేర్కొంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగు, నిర్వహణ, పర్యవేక్షణల్లో తల్లిదండ్రుల జోక్యం వంటివి ఈ ప్రాజెక్టు ద్వారా అందుతాయని తెలిపింది. అంగన్ వాడీ కార్యకర్తలు.. 1, 2 తరగతుల ఉపాధ్యాయులకు స్వల్పకాల శిక్షణ కోర్సులు అందించడం.. బోధనాపరంగా తగిన అభ్యాస సామగ్రి అందించడం ద్వారా ప్రాథమిక అభ్యాసంపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టును ఏడాదిపాటు గిరిజన ప్రాంతాల్లో 3,500 పాఠశాలల్లో ప్రీ–స్కూల్‌ స్థాయిలో ప్రారంభించనున్నారు.

చదవండి: 

NEET 2021: జాతీయస్థాయిలో 11 మందికి 100లోపు ర్యాంక్‌లు

Jobs: కారుణ్య నియామకాలలో విద్యార్హతకు ప్రాధాన్యం

PhD: కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..

Published date : 24 Nov 2021 03:17PM

Photo Stories