Skip to main content

Andhra Pradesh: ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’

సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమా­ణాల పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati State's Commitment to World-Class Education,IB Syllabus in ap Govt Schools,International Standards in Government Schools Initiative
‘ఐబీ వరల్డ్‌ స్కూల్స్‌’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందజేస్తున్న ఐబీ ప్రతినిధులు

పేద విద్యార్థులను గ్లోబల్‌ స్థాయిలో సగర్వంగా నిలబెట్టేందుకు మహత్తర యజ్ఞాన్ని తలపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బక్‌లారియెట్‌ (ఐబీ) సిలబస్‌ అమలుకు ముందడుగు వేసింది. ఈ మేరకు ఐబీ సంస్థతో పాఠశాల విద్యా శాఖ కుదుర్చుకున్న ఒప్పందానికి (ఎంఓయూ) సెప్టెంబర్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమా వేశంలో హర్షధ్వానాల మధ్య ఆమోదం లభించింది. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే ఆంగ్ల భాష పరిజ్ఞానం పెంపునకు మూడో తరగతి నుంచి ప్రతి రోజు గంటపాటు విద్యార్థులకు టోఫెల్‌ శిక్షణ అందిస్తోంది.

తాజా ఒప్పందంతో ఒకటవ తరగతి నుంచి ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడుతూ నెమ్మదిగా పై తరగతులకు విస్తరిస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలోని సీపీఎస్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్‌ అనంతరం సీపీఎస్‌ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతిపాదించిన గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) అమలుకు ముందడుగు వేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం(ఏపీజీపీఎస్‌) బిల్లు– 2023ను ప్రవేశపెట్టనుంది.

చదవండి: Degree : ఇక‌పై డిగ్రీలో నూత‌న విధానం.. ఇంజినీరింగ్‌తో సమానంగా..

దీనితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 2014 జూన్‌ 2వ తేదీ కంటే ముందు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన సుమారు 10 వేల మందికిపైగా ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ బిల్లు–2023నూ అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. ఈ నిర్ణయాలకూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాల వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం 

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సహం’ పేరుతో అవార్డులను అందజేయనున్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రిలిమనరీ, మెయిన్స్‌ రెండు విభాగాల్లో ఉత్తీర్ణులై సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన పేద అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే రూ.లక్ష, వీరిలో మెయిన్స్‌కు అర్హత సాధిస్తే అదనంగా మరో రూ.50 వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఇందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

చదవండి:TREI-RB: ‘గురుకుల’ అభ్యర్థులకు ఆప్షన్‌ చాన్స్‌!

జఫ్రీన్‌కు గ్రూప్‌–1 ఉద్యోగం కోసం చట్ట సవరణ

2017 డెఫ్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతక విజేత, ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ టీం కెప్టెన్‌ షేక్‌ జఫ్రీన్‌కు గ్రూప్‌–1 సర్వీసెస్‌లో కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌ డెప్యూటీ రిజిస్ట్రార్‌ హోదాలో నియామకం కల్పించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్స్‌ టు పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ రేషనలైజేషన్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పేట్రన్‌ అండ్‌ పే స్ట్రక్చర్‌) యాక్ట్‌– 1994ను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జఫ్రీన్‌కు 10 సెంట్ల ఇంటి స్థలం కూడా కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

జీరో వేకెన్సీలో టాప్‌ 

వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. ఆరోగ్య శాఖలో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిస్తున్నారు. తాజాగా కేన్సర్‌ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు డీఎంఈ పరిధిలోని విశాఖ కింగ్‌జార్జ్‌ ఆస్పత్రి, గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కడప ప్రభుత్వ ఆస్పత్రిలో కేన్సర్‌ కేర్‌ సెంటర్‌లో 353 పోస్టుల భర్తీ చేస్తున్నాం. ఒంగోలు, ఏలూరు, విజయవాడలో ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో ప్రమోషన్‌ విధానం/అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా 168 పోస్టుల భర్తీకి నిర్ణయం.

వీటికి తోడు 11 ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వివిధ విభాగాల్లో మరో 99 పోస్టులను భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదలకు ఆమోదం లభించింది. ఏపీ వైద్య విధాన పరిషత్‌ను వైద్య ఆరోగ్య శాఖలోకి విలీనం చేస్తున్నాం. ఆర్డినెన్స్‌ స్థానంలో దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాం. దీంతో ఏపీవీవీపీలోని ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనికి మంత్రివర్గం ఆమోదం లభించింది. 

45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష

రాష్ట్రంలోని ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే సెప్టెంబరు 15 నుంచి జగనన్న ఆరోగ్య సురక్షపై అవగాహన కార్యక్రమాలు తలపెట్టాం. ఇందులో భాగంగా తప్పకుండా పేదల ఇళ్లను సందర్శించి ఆరోగ్య శ్రీ, ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సీఎం జగన్‌ సూచించారు. ఆ తర్వాత ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తారు.

మెడికల్‌ క్యాంపుల తేదీలను ముందుగానే ప్రకటిస్తారు. దీర్ఘకాలిక, తీవ్ర వ్యాధులతో బాధ పడేవారికి పూర్తిగా చికిత్స చేయించేంత వరకు తోడుగా నిలుస్తారు. ఇందుకోసం ప్రభుత్వం విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో ఉన్న మందులు కాకుండా అదనంగా 162 రకాల మందులు, 18 సర్జికల్స్‌ అందుబాటులో ఉంచుతోంది. స్పెషలిస్ట్‌ వైద్యుల సూచన మేరకు ఇతర మందులు కూడా అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 30 నుంచి నవంబర్‌ 15 వరకు దాదాపు 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణకు క్యాబినెట్‌ ఆమోదించింది.  

ప్రైవేటు వర్సిటీ విద్యలో మార్పు

ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు వర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్టు–2016 చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నాం. దీని ద్వారా ప్రైవేటు వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ చట్ట సవరణతో ఇంతకు ముందున్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు వర్సిటీలు ప్రపంచంలోని టాప్‌ 100 వర్సిటీలతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. ప్రఖ్యాత వర్సిటీలతో ఇక్కడి ప్రైవేటు వర్సిటీలు విద్యార్థులకు సంయుక్త సర్టిఫికేషన్‌ డిగ్రీలు అందించాలి. ఇప్పుడున్న ప్రైవేటు కాలేజీలను వర్సిటీలుగా మారిస్తే వచ్చే అదనపు సీట్లలో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోకి వస్తాయి. దీనివల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది.

చిరుద్యోగికి పెద్ద సాయం

ప్రభుత్వంలో చిరుద్యోగి రిటైరయ్యే సమయానికి కనీసం ఇంటి స్థలం సమకూర్చుకునేలా ప్రోత్సహిస్తాం. దీనిని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరిస్తుంది. రిటైరైన తర్వాత చిరుద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీతో సేవలు అందేలా సీఎం నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు పోలవరం నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల అంచనా ఖర్చు పెరిగింది. 2016–17 నాటి రేట్ల ప్రకారమే ఇళ్ల నిర్మాణ అంచనాలు తయారు చేశారు. తాజా రేట్లను బట్టి చూస్తే 8,424 ఇళ్ల నిర్మాణానికి రూ.70 కోట్లు అదనంగా వ్యయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

భూదాన్‌– గ్రామదాన్‌ చట్ట సవరణ

ఆంధ్రప్రదేశ్‌ భూదాన్‌–గ్రామదాన్‌ యాక్టు 1965 సవరణలతో కూడిన డ్రాప్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆచార్య వినోభా భావే లేక ఆయన నామినేట్‌ చేసిన వ్యక్తిని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్‌ బోర్డును నియమించాలి. కానీ ఈ చట్టం వచ్చి 58 సంవత్సరాలు కావడం, వినోభా భావే మృతి చెంది కూడా 41 ఏళ్లవడంతో ఆయన నామినేట్‌ చేసిన అసలు వ్యక్తి ఎవరో నిర్ధారించడం కష్టంగా మారింది. దీంతో చట్టానికి అనుగుణంగా ప్రభుత్వమే బోర్డు ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, సభ్యులను నియమించేందుకు వీలుగా చట్టాన్ని సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బలహీన వర్గాలు, పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం భూమిని మంజూరు చేసే అధికారాన్ని బోర్డు కల్పించేలా చట్టంలో మార్పు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.

పోస్టుల భర్తీ ప్రతిపాదనకు ఆమోదం

  • ఆదోనిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీకి కేబినెట్‌ ఆమోదం.
  • కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 13 స్పెషల్‌ కేడర్‌ డెప్యూటీ రిజిస్ట్రార్, 6 డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టుల భర్తీ.
  • సెరికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టు భర్తీ.
  • ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ విభాగంలో డెప్యూటీ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (తిరుపతి), ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌(రాజమండ్రి) పోస్టుల ఏర్పాటు.
  • కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజిమెంట్‌ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ)లో శాశ్వత విభాగంతో పాటు 10 కొత్త పోస్టుల మంజూరు.
  • సాధారణ పరిపాలన విభాగంలో చీఫ్‌ ఎలక్టోరల్‌ కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ.
  • ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాంటీ సోషల్‌ అండ్‌ హజార్డస్‌ యాక్టివిటీస్‌ ట్రిబ్యునల్‌లో 5 కొత్త పోస్టుల మంజూరు.
  • ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 40 ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులు, 28 డ్రైవర్‌ పోస్టులు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ.

మరిన్ని అంశాలకు కేబినెట్‌ పచ్చ జెండా

  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా తొమ్మిది మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రతిపాదిత నిర్ణయం
  • కురుపాం గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలలో 50 శాతం సీట్లను షెడ్యూల్‌ ప్రాంతంలోని ఎస్టీ విద్యార్థులకే కేటాయింపు.
  • వ్యక్తుల గుర్తింపు కోసం ఆధారం వినియోగంపై చట్టబద్ధత కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఆధార్‌ చట్టంపై బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.
  • నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న రివల్యూషనరీ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఆర్డీఎఫ్‌), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(మావోయిస్టు)పై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
  • ఏపీఐఐసీసీకి చెందిన 2 వేల ఎకరాల్లో రూ.2,190 కోట్లతో బల్క్‌ డ్రగ్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే తొలుత అనుకున్నట్లు కాకుండా కాకినాడ నుంచి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ప్రాజెక్టును అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ భూముల్లోనే ఈ ప్రాజెక్టు నెలకొల్పాలి. నక్కపల్లిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో స్థలం మార్పు చేయడానికి మంత్రివర్గం ఆమోదించింది.

పలు చట్ట సవరణ బిల్లులకు ఆమోదం

  • ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ యాక్టు–2017లో భాగంగా వర్సిటీల్లో నియామకాలు ఇకపై ఏపీపీఎస్సీ ద్వారానే చేపట్టేలా సవరణ బిల్లు.
  • ఆంధ్రప్రదేశ్‌ మోటార్‌ వెహికల్‌ టాక్సియేషన్‌ యాక్ట్‌ 1963 సవరణలతో కూడిన డ్రాప్ట్‌ బిల్లు.
  • ఆంధ్రప్రదేశ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ 2023 సవరణల బిల్లు.
  • ఆంధ్రప్రదేశ్‌ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ యాక్టు–1987 సవరణలకు ఆమోదం. 
  • ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) యాక్ట్‌ 1977కు సవరణ. ఆర్డినెన్స్‌ స్థానంలో చట్టం తీసుకువస్తూ ప్రవేశపెట్టనున్న బిల్లు.
  • ది ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూపు (ఏపీ ఎస్‌ఎస్‌జీ) బిల్లుకు అమోదం. 

అభివృద్ధికి భూ కేటాయింపులు

  • విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఎకరా స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజు ప్రతిపాదికన కేటాయింపు.
  • పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగులవరంలో 100.45 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు.
  • గుంటూరుకు చెందిన విశ్వ మానవ సమైక్యతా సంసత్‌ విజ్ఞప్తి మేరకు ఎకరా రూ.లక్ష చొప్పున 7.45 ఎకరాల స్థలాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిమిపాలెంలో మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ ఆస్పత్రి నిర్మాణానికి కేటాయింపు.
  • చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కృష్ణ, శ్రీకాకుళం, బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూ కేటాయింపులు.
  • ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీకి కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉచితంగా 2.41 ఎకరాల భూమి కేటాయింపు.
  • సంస్కృతి, కళలు పెంపొందిస్తూ పర్యాటక ఆదాయాన్ని పెంచడంలో భాగంగా మధురవాడలో యూనిటీ మాల్‌ (కన్వెన్షన్‌ సెంటర్‌) నిర్మాణం.
  • బాపట్ల, నాయుడుపేట, తణుకు మున్సిపాల్టీల పరిధిలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులను డీబీఓటీ (డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌) విధానంలో నిర్వహించేందుకు అవసరమైన భూమి కేటాయింపు.  

‘ఐబీ’ సిలబస్‌ చారిత్రక ఘట్టం
అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ఐబీ సిలబస్‌ అందుబాటులో ఉంది. ఇప్పుడు మన పిల్లలకు అందిస్తున్నాం. రాష్ట్రంలో ‘ఐబీ’ సిలబస్‌ను ప్రవేశపెట్టడం చారిత్రక ఘట్టం. ఐబీలో చదువుకున్న విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీకి వెళ్లినా మంచి అవకాశాలు వస్తాయి. ప్రశ్నలు వేసే విధానం, వాటికి సమాధానాలు నేర్చుకునే విధానం నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే మూడో తరగతి నుంచి విద్యార్థులకు వారానికి ఆరు రోజులు.. రోజూ గంట పాటు టోఫెల్‌ శిక్షణ ఇప్పిస్తున్నాం. వీళ్లు 8, 9 తరగతులకు వచ్చే సరికి మంచి నైపుణ్యం సాధిస్తారు. దీనివల్ల వారికి ఇంగ్లిషులో పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి కూడా మనం తోడ్పాటునందించాలి. ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయితే రూ.లక్ష, వీరు మెయిన్స్‌ కూడా క్వాలిఫై అయితే అదనంగా మరో రూ.50 వేలు ఇస్తే.. కష్టపడి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టువుతుంది. భవిష్యత్తులో సివిల్‌ సర్వెంట్లుగా ఎందరో పేదలకు సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చినట్టు ఉంటుంది.
–  ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్‌పై మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ 

Published date : 21 Sep 2023 03:01PM

Photo Stories