YS Jagan Mohan Reddy: పెద్ద చదువులు పేదల హక్కు

వివక్ష పోవాలంటే ఉన్నత చదువులతోనే సాధ్యమవుతుంది. ఈ దిశగా ఈ కార్యక్రమాన్ని నాలుగేళ్లుగా ఓ యజ్ఞంలా చేస్తున్నాం’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చిన్నప్పటి నుంచే విద్యకు బాటలు వేస్తూ ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సత్యవతినగర్‌లో మే 24న ‘జగనన్న విద్యా దీవెన’ జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లను విడుదల చేశారు. కంప్యూటర్‌లో బటన్ నొక్కి 8,91,150 మంది తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదరికంతో రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగకూడదన్నదే తన లక్ష్యమన్నారు. సమాజంలో తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాల తలరాతలు మారాలన్నా, ఆ కుటుంబాలు వెలుగులోకి రావాలన్నా.. ప్రతి కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులతో మన పిల్లలు రాణించాలన్నారు. అప్పుడే పేదరికం అనే సంకెళ్లను తెంచుకోవచ్చని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
మేనమామగా నేను తోడుంటా
- ఒక్క జగనన్న విద్యా దీవెనకే రూ.10,636 కోట్లు ఇచ్చాం. ఈ పథకం ద్వారా 26,98,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. గత నాలుగేళ్లలో కేవలం విద్యార్థుల ఉన్నత చదువుల కోసమే విద్యా దీవెన, వసతి దీవెనల కోసం రూ.14,912 కోట్లు ఖర్చు చేశాం. గత చంద్రబాబు ప్రభుత్వం 2018లో చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ఫీజులు రూ.1,778 కోట్లు చిరునవ్వుతో చెల్లించాం.
- జగనన్న వసతి దీవెన కార్యక్రమం చేపట్టి ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. తద్వారా 25,17,000 మంది పిల్లలకు మంచి చేస్తూ నాలుగేళ్లలో రూ.4,232 కోట్లు ఖర్చు చేశాం.
- గతంలో చంద్రబాబు హయాంలో ఫీజులు ఇచ్చామంటే ఇచ్చామని చెప్పేవారు. కేవలం రూ.35 వేలు ముష్టి వేసినట్టు కొంత మందికే ఇచ్చే వారు. మన ప్రభుత్వంలో మీ పిల్లలకు తోడుగా నేనుంటానని, మేనమామగా అండగా ఉంటానని ఫీజు ఎంతైనా చెల్లిస్తున్నాం.
జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులం
- కరిక్యులంలో పూర్తిగా మార్పు తీసుకువచ్చాం. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులంతో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు మార్పులు చేసి 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులతో పాటు 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సులు భాగం చేశాం. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రవేశపెట్టాం.
- స్కిల్ ఓరియెంటెడ్‌గా పిల్లలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఈ రోజు మన ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాయి. వారిచేత కోర్సులు చెప్పించి, వారిచ్చే సర్టిఫికెట్‌లు కరిక్యులంలో భాగంగా చేసి మెరుగైన ఉద్యోగాలు వచ్చేలా అడుగులు వేస్తున్నాం.
- ఒక మైక్రోసాఫ్టే కాకుండా అమెజాన్ వంటి ఎన్నో సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమై ఈ కరిక్యులంలో భాగస్వామ్యం అయ్యాయి. జగనన్న విదేశీ విద్య ద్వారా ప్రపంచంలోనే టాప్ కళాశాలల్లో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు పూర్తిగా ఫీజు చెల్లించే కార్యక్రమం మన ప్రభుత్వంలోనే జరుగుతోంది.
- ఈ సభలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మండలి చైర్మన్ మోషేన్‌రాజు, ఎంపీలు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్‌రామ్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఉన్నత విద్య చైర్మన్ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పేదల కోసం పుట్టిన రారాజువన్నా..
ఇప్పటి వరకు ఎంత ఏడ్చినా మా కన్నీళ్లు ఆగవనుకున్నా. మీ చిరునవ్వుతో ఆ కన్నీళ్లు కాస్తా మాకు ఆనంద భాష్పాలుగా మారాయి. మాలాంటి పేద ప్రజల కోసం పుట్టిన రాజు, రారాజు మీరు. సంక్షేమ బాటసారివి. అధికార పీఠానికి కొత్త భాష్యం పలికి ఆదర్శమూర్తిగా నిలిచారన్నా. నా తల్లిదండ్రులు వికలాంగులు. వారికి మేము ఇద్దరం ఆడ పిల్లలం. నాన్న ఆకుకూరలు అమ్ముతుండగా అనుకోకుండా ఆయనకు పక్షవాతం వచ్చి బాగా నీరసించిపోయాడు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇప్పిస్తూ.. మా కుటుంబాన్ని ఆదుకుంటున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నా. మీ వల్లే నేను కార్పొరేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. మేము చదువుకున్నప్పటి స్కూళ్లు, ఇప్పటి స్కూళ్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నా. మళ్లీ స్కూలుకు వెళ్లి చదువుకోవాలనిపిస్తోందన్నా. మాకు అన్న లేని లోటు మీ వల్ల తీరుతోందన్నా. తరానికి ఒక్కడు, యుగానికి ఒక్కడు అంటుంటారే.. అది మీరేనన్నా.
– దివ్య, బీకాం థర్డ్ ఇయర్, కొండవీటి డిగ్రీ కళాశాల, గోపాలపురం
ఉద్యోగావకాశాలు మీ చలవే
నేను పేద మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని. నా తల్లి గృహిణి, తండ్రి రైతు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కేవలం రూ.35 వేలు మాత్రమే వచ్చేది. ఈ రోజు నేను చాలా అదృష్టవంతుడిని. నాకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చింది. ఒక సాధారణ నాయకుడిలా మీరు మోసపూరిత హామీలు ఇవ్వలేదు. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. మీరు ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు చాలా ఉపయోగకరం. దేశంలో నూతన విద్యా విధానం తీసుకువచ్చిన తొలి రాష్ట్రం మనదే. మన విద్యా విధానంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండటంతో ఎన్నో ఉద్యోగావకాశాలు పొందుతున్నాము. గతంలో మా కళాశాలలో కేవలం 30 – 40 శాతం మందికి ఉద్యోగావకాశాలు ఉండేవి. మీరు వచ్చాక అది 90 శాతానికి పెరిగింది. మా కాలేజ్ నుంచి ఓ విద్యార్థికి రూ.44 లక్షల ప్యాకేజీతో అమేజాన్‌లో ఉద్యోగం లభించిందంటే అది మీరు తీసుకువచ్చిన మార్పే. మీరే శాశ్వత సీఎంగా ఉండాలి.
– రాపర్ల ప్రసన్నకుమార్, బీటెక్ థర్డ్ ఇయర్, తాడేపల్లిగూడెం
ఉప్పొంగిన జన గోదావరి
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన విద్యా దీవెన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపించారు. సీఎం ప్రత్యేక బస్సులో ఆర్టీసీ బస్టాండ్, అక్కయ్యమ్మ కాలనీ, ఎన్టీఆర్‌క్రీడా మైదానం మీదుగా సత్యవతినగర్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రెండు కిలోమీటర్లకు పైగా రోడ్‌షో సాగింది. ఇరువైపులా జనం జైజగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం.. విద్యార్థులు, వారి తల్లులతో కొద్దిసేపు మాట్లాడారు. వారితో కలిసి గ్రూపు ఫొటో తీయించుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లులు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది బయటే ఉండిపోయారు. ‘ప్రతిభ మీది.. ఉన్నత విద్య బాధ్యత నాది.. నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని సీఎం అన్నప్పుడు విద్యార్థుల ఈలలు, కేకలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వరాల జల్లు కురిపించారు. హోం మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కొవ్వాడ కెనాల్ వద్ద కల్వర్ట్, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు.