Skip to main content

AP 10th Class Results: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు.. ప్రైవేట్‌ స్కూల్స్‌కు ధీటుగా

AP 10th Class Results  Government school students excel in Class 10 results

కర్నూలు సిటీ: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటాయి. కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలకు ధీటుగా ఫలితాలను సాధించాయి. ఈ ఏడాది సర్కారు స్కూళ్లలో చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి నూతన ఒరవడి సృష్టించారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 489 ఉండగా.. మొత్తం 30,802 మంది విద్యార్థులు గత నెల18 నుంచి 30వ తేదీ వరకు 162 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. ఈ నెల 1 నుంచి 8వ తేది వరకు మూల్యాంకనం నిర్వహించారు. కేవలం 14 రోజుల్లోనే సోమవారం విజయవాడలో పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 19,242 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.


పెరిగిన ఉత్తీర్ణత
గతేడాది 60.58 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ఈఏడాది అది 62.47 శాతానికి పెరిగింది. గతేడాదితో పోలిస్తే 1.89 శాతం పెరగడం విశేషం. గతేడాది బాలుర ఉత్తీర్ణత శాతం 55.89 ఉండగా.. ఈ ఏడాది 57.22 శాతానికి పెరిగింది. బాలికలు గతేడాది 65.88 శాతం ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 68.35 శాతం మంది పాస్‌ అయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 13,183 మంది ఫస్ట్‌ క్లాసు, 3,877 మంది సెకెండ్‌ క్లాస్‌, 2,182 మంది థర్డ్‌ క్లాస్‌ సాధించారు. జిల్లాలోని 25 మండలాలు ఉండగా 9 మండలాల్లో 50 శాతంలోపు ఉత్తీర్ణులయ్యారు.

అత్యధికంగా కృష్ణగిరి మండలంలో 75.48, అతి తక్కువ హొళగుంద మండలంలో కేవలం 37.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలుగు మీడియం కంటే ఇంగ్లిషు మీడియం విద్యార్థులు అత్యధిక శాతం మంది పాస్‌ కావడం విశేషం. జిల్లాకు చెందిన సింగం సాయి స్వతేజ్‌, మంగలి హర్షవర్ధన్‌లకు అత్యధికంగా 597 మార్కులు సాధించారు. ఆ తరువాత కె. వాసవి ప్రియ 596, జి.హారిక 596, షేక్‌ రోషిణి 596, ప్రశాంత్‌ 596, భావన 596, ఎస్‌.రజియా సుల్తానా 596, కె.అజయ్‌ 594, త్రివేణి 593 మార్కులు తెచ్చుకున్నారు.


సత్ఫలితాలను ఇచ్చిన ప్రభుత్వ చర్యలు
గతంలో ప్రభుత్వ పాఠశాల అంటే చిన్నచూపు ఉండేది. చాలీచాలని తరగతి గదులు.. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు...తాగేందుకు నీరు ఉండదు.. కాలకృత్యాలకు అవస్థలు..సబ్జెక్టు టీచర్ల కొరత.. ఇలా ఎన్యోన సమ్యలు ఉండేది. అత్యధిక మంది విద్యార్థులు తెలుగు మీడియంలోనే పరీక్షలు రాసేవాళ్లు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారాయి. ఇంగ్లిషు మీడియం, డిజిటల్‌ విద్యను ప్రవేశ పెట్టడంతో ప్రవేశాలు సైతం పెరిగాయి. ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోగలిగారు. ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు 74.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లిషు సబ్జెక్టులో 95.23, తెలుగులో 90.45, హిందీ/సంస్కృతంలో 98.14 శాతం, గణితంలో 73.67, సైన్స్‌లో 74.68, సోషల్‌లో 79.36 శాతం ఉత్తీర్ణత సాధించారు.


30 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు
జిల్లాలో 489 స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇందులో 30 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నాలుగు ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కరూ కూడా పాస్‌ కాలేదు. 100 శాతం ఉత్తీర్ణతలో 26 స్కూళ్లు ప్రైవేటు, ఒక మున్సిపల్‌ హైస్కూల్‌, ఒక జెడ్పీ హైస్కూల్‌, బీసీ వెల్ఫేర్‌ రెండు, రెసిడెన్షియల్‌ రెండు స్కూళ్లు ఉన్నాయి.


ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ ఇదీ..
జెడ్పీ పాఠశాల విద్యార్థులు 283 మంది 500 మార్కులకుపైగా తెచ్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 57, బీసీ వెల్ఫేర్‌ స్కూళ్లలో 104, మున్సిపల్‌ పాఠశాలల్లో 132, కేజీబీవీల్లో 21, మోడల్‌ స్కూళ్లలో 133, సోషల్‌ వెల్ఫేర్‌లో పాఠశాలల్లో 70, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 7, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 142 మంది 500 మార్కులకు పైగా తెచ్చుకున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో 1,894 మందికిగాను 951 మంది పాసైయ్యారు. జెడ్పీ హైస్కూల్‌(ఉర్దూ–కోడుమూరు) 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.
● జిల్లాలో ఏపీ మోడల్‌ స్కూళ్లు 16 ఉండగా.. 1,404 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 1,050 మంది పాసయ్యారు.
● జిల్లాలో 25 కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు చెందిన 929 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 550 మంది ఉత్తీర్ణులయ్యారు.
● మున్సిపల్‌ హైస్కూళ్లలో 1,958 మందికిగాను 1,033 మంది ఉత్తీర్ణులయ్యారు. కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం మున్సిపల్‌ మెమోరియల్‌ స్కూల్‌లో 48 మంది పరీక్షలు రాస్తే 48 మంది పాసైయ్యారు. ఈ స్కూల్‌కి చెందిన షేక్‌ హూమీరా ఇక్బాల్‌కు 593 మార్కులు సాధించింది. ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌కి చెందిన కె.ధనుంజయ అనే విద్యార్థికి 590 మార్కులు వచ్చాయి.
● ఎయిడెడ్‌ స్కూళ్లలో 176 మందికిగాను, 73 మంది పాసయ్యారు.
● ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 78 మందికిగాను 54 మంది, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 77 మందికిగాను 54 మంది, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 540 మందికిగాను 452 మంది, బీసీ వెల్ఫేర్‌ స్కూళ్లలో 254 మందికిగాను 242 మంది ఉత్తీర్ణులయ్యారు.
● ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 372 మందికిగాను 363 మంది పాసైయ్యారు. కాల్వబుగ్గ రెసిడెన్షియల్‌ స్కూల్‌, బీక్యాంపు రెసిడెన్షియల్‌ స్కూల్‌(బాలికలు) మహాత్మజ్యోతిరావు ఫూలే స్కూల్స్‌, గోరంట్ల, ఆరెకల్లు చెందిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. జ్యోతిరావు ఫూలే స్కూల్‌ (ఆరెకలు)కు చెందిన బోయ హరిక 591 మార్కులు, దేవనకొండ త్రివేణి 593 మార్కులు సాధించారు.
 

Published date : 23 Apr 2024 05:50PM

Photo Stories