పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2024 ఫలితాల విడుదలకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు
మచిలీపట్నం: పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన మూల్యాంకన కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని రెండు హైస్కూల్స్‌లో ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. మూల్యాంకనం ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు సుమారు 2 లక్షల పేపర్లు మూల్యాంకనానికి రానున్నాయి. దీని కోసం జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది సిబ్బందిని నియమించారు. వీరిలో మూల్యాంకనం నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటు వాటిని పరిశీలించడానికి చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. జిల్లా విద్యాశాఖ అధికారి తహెరా సుల్తానా క్యాంపు ఆఫీసర్‌గా, సినియర్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. మరో వంద మంది అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా ఉంటారు.
Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా
ముగ్గురు ఏఈలకు ఒక సీఈ, స్పెషల్ అసిస్టెంట్
విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడానికి ముగ్గురు చొప్పున అసిస్టెంట్ ఎగ్జామినర్లను (ఏఈ) ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు ఏఈలకు ఒక చీఫ్ ఎగ్జామినర్(సీఈ)తో పాటు ఒక స్పెషల్ అసిస్టెంట్ ఉంటారు. ఒక్కొక్క ఏఈ రోజుకు 40 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఏఈలు మూల్యాంకనం చేసి పత్రాలను సీఈలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. విద్యార్థులు రాసిన సమాధానాలను పరిశీలించి వేసిన మార్కులను నిశిత పరిశీలన చేస్తారు. అదే విధంగా జవాబు పత్రాల్లో ఏఈలు వేసిన మార్కులను కూడి టోటల్ మార్కులను వేసే విధులను స్పెషల్ అసిస్టెంట్లు నిర్వహిస్తారు. ఈ విధంగా ఒక బృందం రోజుకు 120 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు వేయడంతో పాటు వేసిన మార్కులు సరిగా ఉన్నవి, లేనివి క్షుణ్ణం తనిఖీ చేస్తారు. క్యాంపు అధికారికి సహాయకులుగా సహాయ క్యాంపు అధికారులను నియమించారు. సీనియర్ హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు మూల్యాంకన విధుల్లో సీఈ, ఏఈ, స్పెషల్ అసిసెంట్లుగా ఉంటారు.
Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్ అవకాశాలు ఇవే..
వెయ్యి మంది టీచర్ల నియామకం
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకి వచ్చిన రెండు లక్షల పేపర్లలో స్థానిక లేడీయాంప్తిల్ గల్స్ హైస్కూల్‌లో లాంగ్వేజ్ పేపర్లు, నిర్మల హైస్కూల్‌లో ఇతర సబ్జెక్టుల పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. దీని కోసం వెయ్యి మంది సిబ్బందిని నియమించారు. వీరిలో చీఫ్ ఎగ్జామినర్లుగా వంద మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా 600 మంది, స్పెషల్ అసిస్టెంట్లుగా 200 మంది, క్యాంప్ స్టాఫ్‌గా వంద మంది ఇలా మొత్తం వెయ్యి మంది విధులు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం చేయనున్నారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి ఇప్పటికు బార్ కోడ్, ఇతర వాటిపై శిక్షణ ఇచ్చారు. వారికి కావాల్సిన అన్ని మౌలిక వసతులను ప్రభుత్వ పరీక్షల విభాగం కల్పించనుంది.
AP Tenth Class Results 2024 Date and Time : ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?
పక్కాగా నిబంధనల అమలు
10వ తరగతి మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. మూల్యాంకనం పూర్తయ్యే వరకు అటు వైపు ఇతరులు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకెళ్లరాదనే నిబంధన పెట్టనున్నారు. టీచర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మూల్యాంకన కేంద్రంలో ఉండాల్సి ఉంది. వారికి అవసరమైన వసతులు కల్పించారు.
మచిలీపట్నంలోని రెండు హైస్కూల్స్‌లో వసతుల కల్పన ఏప్రిల్ 1నుంచి 8వ తేదీ వరకు మూల్యాంకనం వెయ్యి మంది సిబ్బంది నియామకం
పటిష్ట ఏర్పాట్లు
పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 1 నుంచి నిర్వహించనున్నాం. దీనికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. మూల్యాంకన విధులకు హాజరయ్యే సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. తాగునీరు, గదుల్లో లైటింగ్, ఫ్యాన్లు, టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కనుక సిబ్బంది మార్కులు వేసే విషయంలో అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
– తహెరా సుల్తానా, డీఈఓ, కృష్ణా జిల్లా