Skip to main content

ఎఫ్‌ఏ–1 ఆధారంగా టెన్త్‌ క్లాస్‌ గ్రేడింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 (ఎఫ్‌ఏ) మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దీంతో 5.21 లక్షల మంది విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇచ్చి వారం, పది రోజుల్లో ఫలితాలను ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కూడా ఇంటర్నల్స్‌ ఆధారంగా విద్యార్థులకు మార్కులను వేస్తామని ఇటీవల ప్రకటించింది. దీంతో ఎఫ్‌ఏ–1 మార్కుల ఆధారంగానే రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లను ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించి ప్రభుత్వానికి ఫైలు పంపింది. దానిపై తాజాగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేయడంతో గ్రేడింగ్‌కు మార్గం సుగమమైంది. ఎఫ్‌ఏ–1కు 20 శాతం మార్కులు ఉన్నాయి. అందులో ఏయే విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయన్నది చూసి, వాటిని ఐదింతలు లెక్కిస్తారు. అప్పుడు 100 శాతం మార్కులకుగాను విద్యార్థులకు వచ్చిన మార్కులను వేసి గ్రేడింగ్‌ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు విద్యార్థులు పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకునేలా హాల్‌టికెట్‌ నంబర్లను కూడా ప్రభుత్వ పరీక్షల విభాగం జనరేట్‌ చేస్తోంది. ఆ నంబర్లతోనే విద్యార్థులకు గ్రేడ్లను కేటాయించి ప్రకటించనుంది.
Published date : 11 May 2021 03:02PM

Photo Stories