ఏపీ టెన్త్ పరీక్షలు రెండు వారాలు వాయిదా: మంత్రి ఆదిమూలపు సురేశ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.
ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ ప్రకటించినందున ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వాయిదా వేస్తున్నామని తెలిపారు. పరీక్షలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించాల్సి ఉంది. 2 వారాలు వాయిదా వేస్తున్నందున తదుపరి పరీక్షల షెడ్యూల్‌ను ఈనెల 31వ తేదీ తరువాత ప్రకటిస్తామని వివరించారు.
ప్రజారవాణా నిలిచిపోవడంతో..
- ప్రజారవాణా నిలిచిపోవడం, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నీ మూతవేయడం తదితర కారణాల వల్ల విద్యార్థులు హాల్‌టికెట్లను పొందడంతో పాటు పరీక్ష కేంద్రాలకు చేరడంలో ఇబ్బందులు ఏర్పడనున్నాయి.
- సంక్షేమ విభాగాల రెసిడెన్షియల్ స్కూళ్లు మూతపడినందున అక్కడి విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకున్నారు. వారు రావడానికి సమస్య అవుతుంది. అలాగే సిబ్బంది కూడా పరీక్ష కేంద్రాలకు చేరుకోలేరు.
- ఈనేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
Published date : 26 Mar 2020 05:45PM