Andhra Pradesh: డిజిటల్ విద్య.. వీరి విద్యపై ప్రత్యేక దృష్టి
దివ్యాంగులకు డిజిటల్ విధానంలో బోధన చేయడం ద్వారా సమాజంలో అందరితో సమానంగా విద్యా రంగంలో రాణించేలా చర్యలు చేపట్టింది. ఇందుకు దివ్యాంగులకు అవసరమైన ట్యాబ్‌లను పంపిణీ చేసింది. అందులో ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఎలా బోధన చేస్తే అర్థమవుతుందో గుర్తించి ఆ విధానంలో ప్రత్యేక యాప్‌లను పొందుపరిచింది.
పాలకొండ రూరల్: రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో దివ్యాంగుల సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తోంది. డిజిటల్ చదువుల నిమిత్తం ఇప్పటికే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను రెండు విడతలుగా అందజేసారు. తాజాగా భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అత్యాధునిక ట్యాబ్‌లను అందజేసారు.
చదవండి: AP Students at Stanford: అడవి TO అమెరికా... ఆంధ్రప్రదేశ్ గిరిజన అడవి బిడ్డలకు అరుదైన అవకాశం!!
ఈ కేంద్రాలకు వచ్చి విద్యా బోధన పొందుతున్న వారిలో దృష్టి, వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు సాంకేతికంగా అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్‌లతో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేసారు. ఇందుకోసం ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్సు టీచర్స్(ఐఈఆర్టీ), దివ్యాంగుల తల్లిదండ్రులకు వినియోగంపై ప్రత్యేక శిక్షణ సమగ్ర శిక్షణ ద్వారా అందించేలా చర్యలు చేపట్టారు.
జిల్లాలో ప్రభుత్వ ప్రోత్సాహం ఇలా...
జిల్లాలో 15 భవిత కేంద్రాల ద్వారా 1,220 మంది విభిన్న ప్రతిభావంతులు సేవలు పొందుతున్నారు. వీరిలో బాలురు 656, బాలికలు 564మంది ఉన్నారు. ప్రభుత్వం ద్వారా అలవెన్సులకు అర్హత పొందిన బాల, బాలికలు 799 మంది ఉన్నారు. భవిత కేంద్రాలకు వచ్చే పిల్లల ట్రాన్స్‌పోర్టు అలవెన్సులకు సంబంధించి 180 మంది లబ్ధి పొందగా ఒక్కోరికి రూ.3వేల వంతున మొత్తం రూ.5లక్షల 40వేలు, బాలికల ప్రత్యేక స్టైఫండ్ కింద 356 మందికి రూ.2వేల వంతున మొత్తం రూ.7లక్షల 12వేలు, హొంబేస్‌డ్ ఎడ్యుకేషన్ (మంచానికి పరిమితమై ఇళ్ల వద్ద బోధన పొందుతున్న) 110 మందికి సంబంధించి రూ.3వేల వంతున మొత్తం రూ3లక్షల 30వేలు ఇటీవల అందించారు.
తమకు తాముగా నడవలేని, అంధత్వ, ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతూ తల్లితండ్రుల, సంరక్షకుల సహాయంతో బడికి, భవిత కేంద్రాలకు వచ్చే 153 మంది పిల్లలకు ఎస్కార్ట్ అలవెన్స్ రూ.3వేల వంతున మొత్తం రూ.4లక్షల 59వేలు అందించి వారికి అండగా ప్రభుత్వం నిలుస్తుంది.
89 ట్యాబ్‌లు అందజేత
జిల్లాలో గల ఒక్కో భవిత కేంద్రానికి ఇద్దరు వంతున 30 మంది ఐఈఆర్టీలు ఉన్నారు. హైస్కూల్ స్థాయిలో స్కూల్ ఆసిస్టెంట్ (స్పెషల్) బీఈడీ చేసిన ఉపాధ్యాయులు 13 మంది విధులు నిర్వహిస్తున్నారు.
దివ్యాంగులకు పాఠాలు బోధించే ఐఈఆర్టీ, స్కూల్ అసిస్టెంట్లకు, బోధన పొందుతున్న విద్యార్థులకు సంబంధించి 89 ట్యాబ్‌లను ప్రభుత్వం సమకూర్చింది. ముఖ్యంగా దృష్టి, వినికిడి లోపాలు కలిగిన విద్యార్థుల అవసరాల నిమిత్తం సాంకేతికంగా అభివృద్ధి చేసిన యాప్‌లతో కూడిన ట్యాబ్‌లు అందించారు.
వినియోగానికి వీలుగా..
అంధులు, పాక్షిక అంధులు, బధిరులు, పాక్షిక బధిరుల వినియోగానికి వీలుగా టాక్ బ్యాక్ (ట్యాబ్‌లను ఏ వైపు ఉపయోగించినా స్పందించే యాప్), స్పోకెన్ అసిస్టెంట్ (శబ్ద సాంకేతల ద్వారా ట్యాబ్‌ను ఉపయోగించే యాప్), విజిబులిటి ఇన్‌ఎన్‌ఎమెంట్ (దృష్టి లోపం ఉన్న వారికి చిన్నచిన్న విషయాలను స్పష్టంగా చూపడానికి ఉపయోగించే యాప్), మిషన్ ఏఐ, ‘ఎన్’ విజన్ యాప్‌లు (ఆరి ్టఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసే యాప్) వంటి పలు యాప్‌లను ట్యాబ్‌లో పొందుపరిచారు.
ట్యాబ్‌లను ఇతర అవసరాలకు వినియోగించకుండా ప్రత్యేక లాక్ సిస్టమును అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకావసరాలు గల బాలబాలికలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. రూ.28 – 30 వేలకు పైగా విలువైన ట్యాబ్‌లతోపాటు కీప్యాడ్, ఇయర్ ఫోన్స్, ట్యాబ్ భద్రతకు బ్యాక్ పౌచ్‌లను ఇటీవల ఎంఈఓల సమక్షంలో భవిత కేంద్రాలకు అందించారు.
ప్రత్యేక శిక్షణ
దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక విలువలతో కూడిన డిజిటల్ విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 89 ట్యాబ్‌లను భవిత కేంద్రాలకు ఎంఈఓల ద్వారా అందించాం. ట్యాబ్‌ల వినియోగంపై నవంబర్ 28న జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టేట్ రిసోర్స్‌పర్సన్లు ఐఈఆర్టీలకు, ప్రత్యేక బీఈడీ ఉపాధ్యాయులకు శిక్షణ అందించనున్నాం.
14 ట్యాబులు సిద్ధం చేసాం. అర్హులు ఎవరైనా ఉంటే వారికి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల అవసరాలను గుర్తించి ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం.
– పి.భానుమూర్తి, సహిత విద్యా జిల్లా