Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి .......హాల్ టికెట్ ఇవ్వకుంటే గుర్తింపు రద్దు
విశాఖ : పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో ఎల్.చంద్రకళ తెలిపారు. డీఈవో కార్యాలయంలోని తన చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 30 వరకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లాలో గుర్తింపు ఉన్న 441 పాఠశాలల నుంచి 31,379 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 28,367 మంది, ప్రైవేటు విద్యార్థులు 3,012 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. వీరికోసం జిల్లాలో 138 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాలను తనిఖీ చేసేందుకు వచ్చే అధికారులు సైతం తమ ఫోన్లను గది వెలుపలే విడిచిపెట్టి లోపలికి వెళ్లాలన్నారు. పేపర్ లీకేజీలకు కారణమైతే.. వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు.
ఓపెన్ పరీక్షలకు 2,201 మంది
సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు సైతం ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్నట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. మధ్యాహ్న సమయంలో పరీక్షలు జరుగుతాయన్నారు. పదో తరగతికి 986 మంది విద్యార్థులు హకరుకానుండగా, వీరి కోసం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్మీడియట్‌కు 1,215 మంది నమోదు చేసుకోగా, వీరి కోసం 6 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
Also Read : 10th Class Preparation Tips
హాల్ టికెట్ ఇవ్వకుంటే గుర్తింపు రద్దు
ఫీజు బకాయి పేరుతో హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే, అలాంటి స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తామని డీఈవో చంద్రకళ హెచ్చరించారు. ఈ విషయమై తల్లిదండ్రులు తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అయితే స్కూళ్లలో ఇచ్చే వాటితో పనే లేదని, వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని, వాటితో కేంద్రాలకు వెళ్తే పరీక్షలు రాసేందుకు అనుమతించేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.