Skip to main content

Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు–2024 జవాబు పత్రాల మూల్యాంకనం కు సర్వం సిద్ధం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు–2024 జవాబు పత్రాల మూల్యాంకనం కు సర్వం సిద్ధం
Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు–2024 జవాబు పత్రాల మూల్యాంకనం కు సర్వం సిద్ధం
Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు–2024 జవాబు పత్రాల మూల్యాంకనం కు సర్వం సిద్ధం

శ్రీకాకళం : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు–2024 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో ఏప్రిల్‌ ఒకటి నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనిమిది రోజుల్లో స్పాట్‌ను పూర్తిచేసేలా జిల్లా యంత్రాంగం పక్కాగా సన్నద్ధమైంది. తాగునీరు, ఫ ర్నీచర్‌, లైటింగ్‌, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 7 పేపర్లకు సంబంధించి 24 పేజీల బుక్‌లెట్స్‌తో కూడిన 1.80లక్షల పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. కోడింగ్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. తెలుగుమీడియం, ఇంగ్లిష్‌ మీడియం, ఒరియా మీడియం జవాబుపత్రాలు దిద్దుబాటు జరగనుంది.

రెండు కేంద్రాల్లో స్పాట్‌..

జిల్లాలో రెండు కేంద్రాలుగా స్పాట్‌ వాల్యుయేషన్‌ కొనసాగనుంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతోపాటు సమీపంలోనే మహాలక్ష్మినగర్‌ కాలనీలో ఉన్న శ్రీచైతన్య స్కూల్‌ కేంద్రాలుగా మూల్యాంకనం నిర్వహించనున్నారు. జిల్లాకు క్యాంప్‌ ఆఫీసర్‌గా డీఈఓ కె.వెంకటేశ్వరరావు నేతృత్వంలో స్ట్రాంగ్‌ రూమ్‌ డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ కమిషనర్‌ లియాఖత్‌ ఆలీఖాన్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు కేంద్రాలకు ఇద్దరు డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్లుగా ఉప విద్యాశాఖాధికారులు ఆర్‌.విజయకుమారి(శ్రీకాకుళం), నక్క రామకృష్ణ(టెక్కలి) వ్యవహరించనున్నారు. అలాగే అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్ల(వాల్యుయేషన్‌)గా మరో 7 మంది సీనియర్‌ హెచ్‌ఎంలను నియమించారు.

స్పాట్‌లో 1210 మంది టీచర్లు..

టెన్త్‌ స్పాట్‌కు సంబంధించి వివిధ సబ్జెక్టులకు మొత్తం 186 గ్రూప్స్‌/బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఒక బోర్డులో చీఫ్‌ ఎగ్జామినర్‌(సీఈ), ఇద్దరు స్పెషల్‌ అసిస్టెంట్లు, మరో ఆరుగురు అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు (ఏఈలు) కలిపి మొత్తం 9 మంది ఉంటారు. మొత్తంమీద 1210 మంది టీచర్లు స్పాట్‌ ప్రక్రియలో భాగస్వామ్యమవుతారు. వీరంతా పదో తరగతి పాఠాలు బోధించిన/బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లు. ఇందులో కొంతమంది ఎస్జీటీలు కూడా ఉన్నారు.

రోజుకు 40 పేపర్లు దిద్దుబాటు..

మూల్యాంకనంలో సబ్జెక్టు టీచర్లు పూటకు 20 పేపర్ల చొప్పు న రోజుకు 40 పేపర్లను దిద్దనున్నారు. దిద్దుబాటుకు ఒక పేపర్‌కు రూ.10 చొప్పున 40 పేపర్లకు రూ.400 కేటాయిస్తారు. అలాగే డీఏగా సుదూర ప్రాంతాల పాఠశాలల నుంచి హాజరయ్యే ఉపాధ్యాయులకు అవుట్‌స్టేషన్‌ అలవెన్స్‌గా రూ.400 చెల్లిస్తారు. అలాగే స్పెషల్‌ అసిస్టెంట్లకు రోజుకు రూ.300 చొప్పున చెల్లిస్తారు. స్పాట్‌లో అలసత్వంతో వ్యవహరించి తప్పులు చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పుదు. శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. సెల్‌ఫోన్ల అనుమతిని నిరాకరించనున్నారు. ఐడీ/గుర్తింపు కార్డు తప్పనిసరి. జవాబుపత్రాలను దిద్దుబాటు చేసే అన్ని గదుల్లో సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. అధికారులు పర్యవేక్షించనున్నారు.

8 రోజుల్లో పూర్తిచేసేలా..

ఎనిమిది రోజుల్లో స్పాట్‌ను పూర్తిచేసేలా జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండేళ్లుగా మూల్యాంకనాన్ని త్వరితగతిన పూర్తిచేసిన జిల్లాగా శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌, సమగ్రశిక్ష ఎస్పీడీ, ఆర్జేడీ సైతం జిల్లా అధికారులను ప్రశంసించారు. మళ్లీ అదే సీన్‌ రిపీట్‌చేసేలా డీఈఓ నేతృత్వంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ లియాఖత్‌ ఆలీఖాన్‌, ఇతర అధికారులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం..

జిల్లాలో ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే టెన్త్‌క్లాస్‌ జవాబుపత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. రెండు కేంద్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం. అందుకు వసరమైన సిబ్బందిని నియమించాం. విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు అధికారులు, ఎగ్జామినర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫర్నీచర్‌, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. 

                                    – కె.వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి/స్పాట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌, శ్రీకాకుళం

 

Published date : 30 Mar 2024 10:56AM

Photo Stories