Skip to main content

School Education Department: బడి బయటి పిల్లలంతా బడుల్లోకి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలందరికీ చదువు చెప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
All the children out of school go to school
బడి బయటి పిల్లలంతా బడుల్లోకి

బడి బయట ఒక్క విద్యార్థి కూడా లేకుండా గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులతో సమన్వయం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. బడికి వెళ్లని బడి ఈడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా పిల్లలంతా పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపడు­తున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా రాష్ట్రంలో మొత్తం 1,73,291 మంది పిల్లలను గుర్తించగా ఇందులో ఇప్పటికే 80 శాతానికి పైగా పిల్లలను బడుల్లో చేర్పించారు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులతో పాటు వారు పనులు చేస్తున్న వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆ పిల్లలు చదువులు కొనసాగించేలా కూడా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఫలితంగా బడుల్లో చేరికలు గతంలో కన్నా పెరగడమే కాకుండా డ్రాపవుట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 

చదవండి: చాక్‌పీస్‌ కొన్నా జీఎస్టీ బిల్లు!

డ్రాపవుట్లకు చెల్లుచీటీ 

రాష్ట్రంలోని బడిఈడు పిల్లలందరినీ స్కూళ్లలోకి తిరిగి చేర్పిస్తున్న నేపథ్యంలో పిల్లల డ్రాపవుట్లు తగ్గాయి. ప్రాథమిక స్థాయిలో సున్నా స్థాయికి ఈ డ్రాపవుట్లు తగ్గిపోవడం విశేషం. ప్రాథమికోన్నత తరగతుల్లో గతంలో కన్నా తగ్గి 2021–22 నాటికి 1.62 శాతానికి డ్రాపవుట్లు పడిపోయాయి. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో 2022–23లో మరింత తగ్గుతాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. సెకండరీ తరగతుల్లో ఒకప్పుడు 22 శాతంగా ఉన్న డ్రాపవుట్‌ రేటు 2022–23లో భారీగా దిగువకు తగ్గుతోందని వివరించాయి. 

చదవండి: Tenth Class: చాయిస్‌ తగ్గింది.. ప్రశ్నల స్థాయి మించింది..

ఇంటర్మీడియెట్‌లోనూ పెరిగిన చేరికలు..

ప్రభుత్వ చర్యలతో 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న స్కూళ్లలో చేరికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌ స్థాయిలోనూ విద్యార్థుల చేరికల శాతం పెరుగుతోంది. గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఈ అంశాలు స్పష్టమవుతున్నాయి. 2018–19లో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల చేరికల సంఖ్య 78,61,899 వరకు ఉండగా 2019–20 నాటికి ఈ సంఖ్య 83,23,103కి చేరింది. ఒక్క ఏడాదిలోనే 4,61,204 మంది అదనంగా చేరడం విశేషం. వీరిలో ఇంటర్మీడియెట్‌లో పెరిగిన విద్యార్థుల సంఖ్య 1.5 లక్షల వరకు ఉండడం గమనార్హం. ఇక 2020–21లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య 84,10,924కు చేరింది. 2021–22లో ఆ సంఖ్య 82,44,647 గా ఉంది. కరోనా తదితర కారణాలతో చాలాకాలం స్కూళ్లు తెరవకపోవడంతో అనేక మంది స్కూళ్లకు రాలేదు. దాంతో 2021–22లో ప్రవేశాల సంఖ్య తగ్గింది. 2022–23కి నాటికి మళ్లీ ఆ సంఖ్య పెరిగినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన తుది విడత గణాంకాల క్రోడీకరణ జరుగుతోందని, త్వరలోనే అవి విడుదలవుతాయని చెబుతున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ చైల్డ్‌ ఇన్ఫో కింద సేకరిస్తున్న గణాంకాల ప్రకారం.. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రాథమిక తరగతుల నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు 84 లక్షలకుపైగా చేరికలున్నట్లుగా తెలుస్తోంది. ఈ విద్యార్థుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే కావడం గమనార్హం. మొత్తం విద్యార్థుల్లో 78 శాతం ఈ వర్గాల విద్యార్ధులే.

చదవండి: Education: ‘డిజిటల్‌’ స్థాయికి విద్యా రంగం

Published date : 05 Jan 2023 05:00PM

Photo Stories