ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - రాజకీయ పార్టీల పాత్ర

అరవై ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ పోరాట చరిత్రలో టీఆర్‌ఎస్ పార్టీది ప్రత్యేక స్థానం. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజానీకాన్ని ఏకతాటిపైకి తెచ్చి, యావత్ భారతదేశం తెలంగాణపై దృష్టి సారించేలా చేసిన ఘనత కేసీఆర్‌ది. పొత్తులతో రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తూనే.. పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకునేలా టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు.
తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్‌ఎస్)
పార్టీ ఆవిర్భావం
  • తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి, మంత్రి పదవికి కె.చంద్రశేఖర రావు 2001 ఏప్రిల్‌లో రాజీనామా చేశారు.
  • తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీని అదే ఏడాది ఏప్రిల్ 27న కేసీఆర్ స్థాపించారు.
  • పార్టీ జెండాను గులాబీ రంగులో ముద్రించారు. పార్టీ తాత్కాలిక ఎన్నికల గుర్తు ‘నాగలి పట్టిన రైతు’. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు.
  • 2001 మే 17న కరీంనగర్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ‘సింహగర్జన’ అని పేరు పెట్టారు. ఈ సభకు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధినేత శిబూసోరెన్ హాజరై మద్దతు ప్రకటించారు. సభ విజయవంతం కావడంతో తెలంగాణ వాదుల్లో సంతోషం వెల్లివిరిసింది.
  • టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన మూడు నెలల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాపరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకుని టీఆర్‌ఎస్ సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో 1000 ఎంపీటీసీ, 87 జెడ్‌పీటీసీ, 84 ఎంపీపీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది.
  • కరీంనగర్ జెడ్పీ చైర్మన్‌గా కె.వి.రాజేశ్వరరావు, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్‌గా శనిగరం సంతోష్ రెడ్డి ఎన్నికయ్యారు.
  • ఈ ఎన్నికల్లో సాధించిన విజయంతో 2001 సెప్టెంబర్ 22న కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సిద్ధిపేట శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తిరిగి పోటీ చేసిన కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
  • 2003 మార్చి 27న కేంద్రానికి తెలంగాణ డిమాండ్‌ను గట్టిగా వినిపించాలనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జాతీయ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ హాజరై ఉద్యమానికి మద్దతు తెలిపారు.
  • 2003 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ రెండో వార్షికోత్సవ సభను వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు దేవేగౌడ, అజిత్ సింగ్ హాజరయ్యారు. ‘వరంగల్ జైత్రయాత్ర’ పేరుతో నిర్వహించిన ఈ సభకు లక్షలాది మంది హాజరయ్యారు.
  • మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ నుంచి గద్వాల వరకు కేసీఆర్ 180 కి.మీ. పాదయాత్ర చేశారు. 2003 జూలై 30న గద్వాల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తర్వాత 2003 ఆగస్టు 25 నుంచి 30 వరకు నల్లగొండ జిల్లాలోని కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారు.
  • 2003 సెప్టెంబర్ 9న ఢిల్లీలోని ‘మౌలంకర్’ హోటల్‌లో నూతన రాష్ట్రాల ఏర్పాటు కోసం పోరాడుతున్న ఉద్యమ నేతలతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి అజిత్ సింగ్, శిబూసోరెన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే నూతన రాష్ట్రాల ఏర్పాటు జాతీయ ఫ్రంట్ కన్వీనర్‌గా కేసీఆర్ ఎన్నికయ్యారు.
  • 2003 సెప్టెంబర్ 17న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
కాంగ్రెస్‌తో పొత్తు
  • 2004లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు 42 స్థానాలు కేటాయించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరింది. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేశాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల గుర్తుగా ‘కారు’ను కేటాయించారు.
  • కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. 2004 మార్చి 7న కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని సోనియా గాంధీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు 42 స్థానాలను కేటాయించగా ఆ పార్టీ 54 స్థానాల్లో పోటీ చేసింది. టీఆర్‌ఎస్ పార్టీ 26 శాసనసభ, 5 పార్లమెంటు స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 23,90,940 ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ ఎంపీగా గెలుపొందారు. ఆయన ఎంపీగా పోటీ చేయడం అదే తొలిసారి. సిద్ధిపేట ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నికయ్యారు. మెదక్ నుంచి ఆలె నరేంద్ర విజయం సాధించారు.
  • రాష్ర్టంలో కాంగ్రెస్-టీఆర్‌ఎస్ కూటమి, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) ఘన విజయం సాధించాయి.
  • ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రాం)ను ప్రకటించింది. ఇందులో తెలంగాణ అంశాన్ని చేర్చాలని టీఆర్‌ఎస్ కోరింది.
  • ‘అవసరమైన సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారం కుదిర్చి, సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను చేపడుతుంది’ అని చెప్పి తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో చేర్చారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిచ్చిన వామపక్షాలు సైతం దీనికి అంగీకరించాయి.
  • 2004 జూన్ 7న రాష్ర్టపతి ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని చేర్చారు. నాటి రాష్ర్టపతి అబ్దుల్ కలాం పార్లమెంటులో మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రకటించారు.
  • మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పడింది. టీఆర్‌ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరింది. కేసీఆర్ కేబినెట్ మంత్రి(షిప్పింగ్) అయ్యారు. కానీ, తమకు ఆ శాఖే కావాలని మరో మిత్రపక్షం డీఎంకే పట్టుబట్టింది. దీంతో కేసీఆర్ స్వచ్ఛందంగా తన పోర్టుఫోలియోను డీఎంకేకు అప్పగించారు.
  • తనకు తెలంగాణ ముఖ్యం తప్ప పదవులు కాదని కేసీఆర్ మరోసారి చాటారు. సుమారు ఏడు నెలల పాటు ఏ పోర్టుఫోలియో లేని కేంద్ర మంత్రిగానే కొనసాగారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆయనకు కార్మిక ఉపాధి శాఖను కేటాయించారు. ఆలె నరేంద్రకు సహాయ మంత్రి పదవి ఇచ్చారు.
  • 2004 మే 13న వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ర్ట మంత్రివర్గంలో టీఆర్‌ఎస్‌కు ఆరు శాఖలు కేటాయించారు.
ప్రణబ్ కమిటీ
  • రాష్ర్ట ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 2005 మార్చిలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 8 వారాల్లో ఈ కమిటీ తన నివేదికను ఇస్తుందని కేంద్రం ప్రకటించింది. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
  • తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పాలని ప్రణబ్ కమిటీ అన్ని పార్టీలకు లేఖలు రాసింది.
  • కేసీఆర్ అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి తెలంగాణకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాశాయి.
  • మూడున్నరేళ్ల తర్వాత 2008 అక్టోబర్ 18న తెలంగాణ ఏర్పాటు తమకు సమ్మతమేనని టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మాజీ ప్రధానులు వి.పి.సింగ్, ఐ.కె.గుజ్రాల్ కూడా తెలంగాణకు మద్దతుగా లేఖలు రాశారు.
  • 2006 వర్షాకాల సమావేశాల్లోగా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని ప్రభుత్వాన్ని కేసీఆర్ హెచ్చరించారు.
రాజీనామాలు..
  • కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబించింది. దీంతో 2006 ఆగస్టు 22న కేసీఆర్, ఆలె నరేంద్ర తమ పదవులకు రాజీనామా చేసి, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు.
  • 2006 సెప్టెంబర్ 12న కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
  • దీంతో కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించేందుకు గట్టి ప్రయత్నం జరిగింది. డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో 2 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో కేసీఆర్ ఘనవిజయం సాధించారు. 2008 మార్చి 3న కేసీఆర్, బి.వినోద్ కుమార్, టి.మధుసూదన్ రెడ్డి, డి.రవీంద్రనాయక్ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. 2008 మార్చి 4న 16 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు శాసనమండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. పది మంది అసమ్మతి ఎమ్మెల్యేలు మాత్రం పార్టీపై తిరుగుబాటు చేసి, రాజీనామాకు దూరంగా ఉన్నారు.
  • 2008 మే 29న ఎన్నికలు జరిగాయి. జూన్ 1న ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
  • నాలుగు ఎంపీ స్థానాల్లో పోటీ చేయగా కరీంనగర్ నుంచి కేసీఆర్, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్ మాత్రమే విజయం సాధించారు.
  • 16 శాసనసభ స్థానాలకు గానూ ఏడింటిలోనే టీఆర్‌ఎస్ గెలిచింది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది.
  • రాష్ర్టమంత్రి రోశయ్య నేతృత్వంలో కమిటీని వైఎస్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తెలంగాణపై అభిప్రాయాలను సేకరిస్తుందని ఆయన తెలిపారు. కమిటీ సిఫారసులను బట్టి తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తామని వైఎస్ ప్రకటించారు.
  • 2009 ఫిబ్రవరి 28న సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరిగింది. తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పునరుద్ఘాటించారు.
మహాకూటమి ఏర్పాటు
  • 2009 జనవరి 31న టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ‘మహాకూటమి’ పేరుతో ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీలు నిర్ణయించాయి. ఈ పొత్తు కుదరడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలకంగా వ్యవహరించారు.
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్, మహాకూటమి, ప్రజారాజ్యం పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 2009 ఏప్రిల్ 16న తొలిదశ ఎన్నికలు పూర్తయ్యాయి.
  • ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులను కల్పించాయి. ఆ పార్టీ కేవలం రెండు ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి విజయశాంతి మాత్రమే ఆ పార్టీ తరఫున గెలిచారు. 45 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ కేవలం పది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
రాజుకున్న ఫ్రీజోన్ చిచ్చు
  • ‘హైదరాబాద్ ఫ్రీజోన్’ అని 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది రాష్ర్టపతి ఉత్తర్వులకు, ముల్కీ రూల్స్‌కు విరుద్ధమని ఈ తీర్పును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు.
  • ముఖ్యమంత్రి రోశయ్య 2009 అక్టోబర్ 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. రాజ్యాంగ సవరణలకు సిఫారసు చేయాలని కేసీఆర్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
  • ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరిగింది. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు దీక్షకు దిగారు. వారికి సంఘీభావం తెలిపేందుకు కేసీఆర్ అక్కడికి వెళ్లారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే తానే నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు.
  • 2009 నవంబర్ 29న దీక్షకు దిగనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలోని రంగధాంపల్లిని దీక్షాస్థలిగా నిర్ణయించారు.
కేసీఆర్ నిరాహార దీక్ష
  • 2009 నవంబర్ 26న కేసీఆర్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరారు. మార్గమధ్యంలో దీక్షాస్థలికి వెళతారన్న ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్‌ను అక్కడే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కేసీఆర్ నేరుగా కరీంనగర్ వెళ్లారు. ఉత్తర తెలంగాణ భవనంలోనే 3 రోజులపాటు గడిపారు.
  • 2009 నవంబర్ 29న పోలీసు బలగాలు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టాయి. వేలాదిమంది ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరారు. ఈ సందర్భంగా పోలీసులు, తెలంగాణ వాదుల మధ్య తోపులాట జరిగింది. కేసీఆర్ దీక్షాస్థలానికి బయల్దేరారు. పోలీసులు వ్యూహాత్మకంగా ప్రజలు, నేతల కళ్లుగప్పి కేసీఆర్ కాన్వాయ్‌ని ఖమ్మం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ దీనికి అడ్డు చెప్పి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కేసీఆర్‌ను తమ వాహనంలో ఖమ్మం తీసుకెళ్లారు.
  • ప్రజలను రెచ్చగొడుతున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో కేసీఆర్‌పై కేసులు నమోదు చేశారు.
  • కేసీఆర్‌ను ఖమ్మం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండు విధించారు. దీంతో కేసీఆర్‌ను జైలుకు తరలించారు.
  • జైల్లోనే దీక్ష ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
  • కేసీఆర్ అరెస్టు వార్తతో తెలంగాణలో బంద్‌లు, నిరసనలు, రాస్తారోకోలు జరిగాయి. ఉస్మానియా వర్శిటీ రణరంగమైంది.
  • కేసీఆర్ అరెస్ట్ కావడంతో టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు దీక్షాస్థలానికి చేరుకొని తాను దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
  • కేసీఆర్‌ను డిసెంబర్ 3వ తేది తెల్లవారుజామున హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. శ్రీకాంతాచారి అనే విద్యార్థి ఆత్మాహుతి చేసుకున్నాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేసీఆర్‌ను చూసేందుకు పార్టీ నేతలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు భారీగా తరలిరావడంతో హైదరాబాద్ అట్టుడికింది. దాంతో డిసెంబర్ 5, 6 తేదీల్లో తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ మొత్తం స్తంభించిపోయింది.
కేంద్రం జోక్యం
  • పరిస్థితులు చేజారుతుండటంతో కేంద్రం జోక్యం చేసుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడి, ఇక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో 2009 డిసెంబర్ 7న సచివాలయంలో రోశయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 9 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి.
చిదంబరం ప్రకటన.. వెనుకడుగు
  • 2009 డిసెంబర్ 9 రాత్రి 11.30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారని ఆయన ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుపై చిదంబరం ప్రకటన అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్‌కు పండ్ల రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
  • చిదంబరం ప్రకటనకు నిరసనగా 2009 డిసెంబర్ 10న సీమాంధ్ర ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. సీమాంధ్ర వ్యాప్తంగా నిరసనలు, బంద్‌లు చేపట్టారు.
  • డిసెంబర్ 23న కేంద్ర హోంమంత్రి చిదంబరం ‘అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని మరో ప్రకటన చేశారు.
  • చిదంబరం రెండో ప్రకటనతో తెలంగాణ వాదులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ రాష్ర్ట సాధనలో అన్ని వర్గాలు, పార్టీలు, సంఘాలు, విద్యార్థులను కలుపుకొని వెళ్లాలని నిర్ణయించారు. ఐక్య పోరాటాల కోసం 2009 డిసెంబర్ 24న రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి(పొలిటికల్ జేఏసీ) ఏర్పడింది.
  • 2010 జనవరి 5న కేంద్రమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే పదిమంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. స్పీకర్ ఈ రాజీనామాలను ఆమోదించారు. టీడీపీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కూడా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఓరుగల్లు గర్జన
  • 2010 జూలై 31న వెలువడిన ఫలితాల్లో 11 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ సభ్యుడు లక్ష్మీనారాయణ గెలుపొందారు. శ్రీకృష్ణ కమిటీ వెంటనే తన నివేదిక ఇవ్వాలంటూ 2010 డిసెంబర్ 16న ‘ఓరుగల్లు గర్జన’ పేరుతో టీఆర్‌ఎస్ బహిరంగ సభనిర్వహించింది. 2011 ఫిబ్రవరి 23న కేసీఆర్, విజయశాంతి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
  • తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ 2011 జూన్ 21న మరణించారు.
  • 2012 డిసెంబర్ 28న సుశీల్ కుమార్ షిండే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
  • జనవరి 27, 28 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద జేఏసీ సమరదీక్షను చేపట్టింది. దీనికి కేసీఆర్ హాజరై కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. 2013 అసెంబ్లీ వేసవి కాల సమావేశంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. చంద్రబాబు దీనికి సహకరించలేదు.
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన
  • ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చ జరిగింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ప్రకటించింది.
  • 2013 డిసెంబర్ 5న తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లు డిసెంబర్ 12న రాష్ర్ట అసెంబ్లీకి చేరింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలు బిల్లు ప్రతుల్ని చింపివేశారు. 2014 జనవరి 10న టీఆర్‌ఎస్ శాసనసభ పక్షనేత ఈటల రాజేందర్ రాష్ర్ట ఏర్పాటుపై ఉద్విగ్నంగా ప్రసంగించారు.
  • 2014 ఫిబ్రవరి 7న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 14న యూపీఏ ప్రభుత్వం రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్‌సభలో పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గాయపడ్డారు.
పార్లమెంట్ ఆమోదం
  • కాంగ్రెస్, బీజేపీ, ఆర్జేడీ, ఎన్‌సీపీ, సమాజ్‌వాది, ఆర్‌ఎల్‌డీ, జేఎంఎం తదితర పార్టీల ముఖ్యనేతలను కేసీఆర్ కలిసి, బిల్లు ఆమోదానికి మద్దతు తెలపాలని కోరారు.
  • 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ బిల్లును ఆమోదించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టగా, అదే రోజున ఆమోదం పొందింది.
  • 2014 ఫిబ్రవరి 23న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
  • రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై 2014 మార్చి 1న రాష్ర్టపతి సంతకం చేశారు. మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
  • యూపీఏ ప్రభుత్వం 2014, మార్చి 4న 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా ప్రకటించింది.
  • దేశంలో 29వ రాష్ర్టంగా 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది.
  • 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. దేశంలోనే పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ భారత్‌ను ఎక్కువ కాలం పాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సుమారు 38 ఏళ్లపాటు పరిపాలన సాగించారు.
  • జవహర్‌లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులు, ఇందిరా గాంధీ 15 సంవత్సరాల 350 రోజులు(రెండు పర్యాయాలు), రాజీవ్ గాంధీ 5 సంవత్సరాల 32 రోజులు ప్రధానిగా పనిచేశారు.
  • కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణను ఆంధ్ర రాష్ర్టంలో విలీనం చేసి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోనూ సుమారు 42 ఏళ్లపాటు (1956-83, 1989-94, 2004-14) అధికారంలో ఉంది.
  • 1971లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈయనే తెలంగాణకు చెందిన తొలి ముఖ్యమంత్రి. పీవీ తర్వాత మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరెవరూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు.
ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర
  • 1956-83 వరకు ఏపీ కాంగ్రెస్‌లో వైరివర్గాల ఆధిపత్యమే కొనసాగింది. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర పోషించారు.
  • ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు 1969 ఏప్రిల్ 11న ఢిల్లీలో అష్టసూత్ర పథకాన్ని ప్రకటించారు. 1971లో చెన్నారెడ్డి అధ్యక్షత వహించిన తెలంగాణ ప్రజాసమితి పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించింది. తెలంగాణలోని 14 పార్లమెంట్ స్థానాల్లో పదింటిని టీపీఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది.
  • ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని 1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది.
కాంగ్రెస్ (ఐ) ఏర్పాటు
  • ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని 1972 నవంబర్ 27న ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు. వెంటనే పంచసూత్ర పథకాన్ని విడుదల చేశారు. అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో కాసు బ్రహ్మానందరెడ్డికి ఇందిరా గాంధీతో అభిప్రాయభేదాలు వచ్చాయి. పార్టీని చీల్చేందుకు ప్రయత్నించారు. ఇందిరా గాంధీ 1978 జనవరి 1న కాంగ్రెస్ (ఐ)ను స్థాపించారు.
  • అదే సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి ‘రెడ్డి కాంగ్రెస్’ను స్థాపించారు.
  • 2000లో జి.చిన్నారెడ్డి నాయకత్వంలో 41 మంది ఎమ్మెల్యేలు తెలంగాణకు అనుకూలంగా సోనియా గాంధీకి వినతిపత్రం ఇచ్చారు.
  • 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలోనూ యూపీఏ ప్రభుత్వం ఈ అంశాన్ని పొందుపర్చింది.
  • 2004 జూన్ 7న రాష్ర్టపతి ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వం ఆ ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని చేర్చింది. తెలంగాణపై విస్తృత అంగీకారం కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన 2004 నవంబర్‌లో కేంద్రం ఒక ఉపసంఘాన్ని నియమించింది.
  • ఉద్యమం తీవ్రం కావడంతో తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు స్వీకరించడానికి వైఎస్ ప్రభుత్వం 2008లో రోశయ్య కమిటీని నియమించింది.
  • 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగింది. అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని ఆ పార్టీ ప్రచారం చేసింది.
  • ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 156 స్థానాల్లో విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
  • రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ 2009 సెప్టెంబర్ 2న నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు.
  • 2009 సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
  • 2009 అక్టోబర్ 9న హైదరాబాద్ ఫ్రీజోన్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో తెలంగాణవాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 2009 అక్టోబర్ 13న రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
  • 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. తెలంగాణలో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. 2009 డిసెంబర్ 7న సచివాలయంలో రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఎం, ఎంఐఎం తప్ప ఈ సమావేశంలో పాల్గొన్న మిగిలిన పార్టీలన్నీ తెలంగాణకు మద్దతిచ్చాయి.
అఖిలపక్ష సమావేశం
  • 2009 డిసెంబర్ 9న రాత్రి 11.30 గంటలకు హోంమంత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన చేశారు. ‘ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు’ అని చిదంబరం పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని డిసెంబర్ 23న మరో ప్రకటనలో పేర్కొన్నారు.
  • రెండో ప్రకటనతో తెలంగాణలో ఆందోళనలు మొదలయ్యాయి.
  • తెలంగాణకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయకపోవడం పట్ల ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు, జేఏసీ నేతలు 2010 ఫిబ్రవరి 14న మంత్రులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇళ్లపై దాడి చేశారు.
  • కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రా తరఫున కావూరి సాంబశివరావు హాజరయ్యారు.
శ్రీకృష్ణ కమిటీ
  • 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించారు. 2010 ఫిబ్రవరి 19న రాజకీయ జేఏసీ నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చింది. రాష్ర్టంలో ఆందోళనల నేపథ్యంలో కేంద్రం రోశయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. 2010 నవంబర్‌లో ఆయన స్థానంలో స్పీకర్ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది.
  • విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు 2010 డిసెంబర్ 26న గన్‌పార్క్ వద్ద దీక్ష చేశారు. అదే నెల 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది.
  • 2011 జనవరి 6న కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను బహిర్గతం చేసింది.
  • శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చింది. దీంతో తెలంగాణలో ఆందోళనలు కొనసాగాయి. తెలంగాణ ఏర్పాటుపై ఆలస్యానికి నిరసనగా జూపల్లి కృష్ణారావు 2011 మార్చి 3న మంత్రి పదవికి రాజీనామా చేశారు.
  • 2011 జూన్‌లో పీసీసీ అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ స్థానంలో బొత్స సత్యనారాయణను నియమించారు. ఈ ఘటనతో సీఎం, స్పీకర్, పీసీసీ అధ్యక్షుడి లాంటి మూడు కీలక పదవులు ఆంధ్రా ప్రాంతానికే దక్కాయి.
  • 2011 అక్టోబర్ 1న నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు.
  • 2012 డిసెంబర్ 28న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. 2013 జూన్ 30న హైదరాబాద్‌లో తెలంగాణ సాధన సభ పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది.
రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం
  • 2013 జూలై 11న ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణపై చర్చ జరిగింది. 2013 జూలై 30న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని 2013 ఆగస్టు 5న చిదంబరం పార్లమెంటులో ప్రకటించారు. ఆగస్టు 6న ఆంటోని నేతృత్వంలో అంతర్గతంగా విభజన కమిటీ ఏర్పాటైంది. దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ ఈ కమిటీలో సభ్యులు. 2013 అక్టోబర్ 8న ఎ.కె.ఆంటోనీ చైర్మన్‌గా కేంద్ర మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
  • 2013 డిసెంబర్ 5న ‘తెలంగాణ ముసాయిదా బిల్లు 2013’ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లు డిసెంబర్ 12న రాష్ట్రానికి చేరింది. డిసెంబర్ 15న బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలకు అందజేశారు. తర్వాతి రోజు చర్చ ప్రారంభమైంది. 2014 జనవరి 22న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
  • సభలో 87 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలిపారు. దీనిపై చర్చ ముగిసిందంటూ 2014 జనవరి 30న స్పీకర్ ప్రకటించారు.
  • పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఫిబ్రవరి 9న ఆంధ్రాకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాసానికి కారణమైన పదకొండు మంది ఎంపీలను ఫిబ్రవరి 11న కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 14న కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాలరెడ్డి లోక్‌సభలో పెప్పర్ స్ప్రేతో దాడిచేశారు.
  • ఈ సందర్భంగా 16 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలను స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. 2014 ఫిబ్రవరి 13న యూపీఏ ప్రభుత్వం రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
  • 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఫిబ్రవరి 20న యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా, ఆ రోజే బిల్లు ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ర్టపతి సంతకం చేశారు. మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
  • జూన్ 2ను అపాయింటెడ్ డేగా కేంద్రం 2014 మార్చి 4న ప్రకటించింది.
  • దేశంలో 29వ రాష్ర్టంగా తెలంగాణ ఏర్పడింది.
ఎంఐఎం
  • హైదరాబాద్ కేంద్రంగా ఎంఐఎం రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
  • ప్రస్తుత అసెంబ్లీలో ఈ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
  • తెలంగాణ ఉద్యమానికి ఎంఐఎం దూరంగానే ఉంది.
  • 2010 జనవరి 5న ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ హజరయ్యారు.
  • తెలంగాణ ఏర్పడితే మతతత్వ శక్తులు విజృంభిస్తాయనే భయాన్ని వారు వెలిబుచ్చారు.
  • 2013 నవంబర్ 12, 13 తేదీల్లో రాష్ర్ట విభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి ఎంఐఎం తన సూచనలు, సలహాలు అందజేసింది.
  • 2014 జనవరి 20న ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ విభజన బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిలో కోస్తాంధ్ర పాత్ర ఏమీలేదని, నిజాం కాలం నుంచే హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని గణాంకాలతో సహా వివరించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు మొగ్గు చూపారు.

భారతీయ జనతా పార్టీ

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 90వ దశకంలోనే ప్రకటించింది. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ 1996లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇది కేవలం 13 రోజులే కొనసాగింది. ఆ తర్వాత 1998లో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ.. ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, మహారాష్ట్రలో విదర్భ రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధమేనని ప్రకటించింది.

  • 1998లో కాకినాడలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు. 1998 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ ‘ఒక ఓటు - రెండు రాష్ట్రాలు’ అనే అంశాన్ని ప్రచారం చేసింది.
  • 1999 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పోటీచేసిన 8 లోక్‌సభ సీట్లలో ఏడింటిని గెలుచుకుంది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీ (తెలుగుదేశం పార్టీ) 29 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకొని టీడీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  • ఎన్‌డీఏ ప్రభుత్వం 2000లో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు.
  • తెలంగాణ అంశాన్ని బీజేపీ పక్కన పెట్టడంతో ఆగ్రహించిన ఎంపీ ఆలె నరేంద్ర పార్టీ నుంచి బయటకు వచ్చి ‘తెలంగాణ సాధన సమితి’ని స్థాపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. తర్వాత ఈ పార్టీని 2002 ఆగస్టు 11న టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు.
  • 2004లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాయి. ఈ రెండింటికీ ఎదురుదెబ్బ తగిలింది.
  • బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ 2007 ఆగస్టు 5న పార్లమెంటులో ‘కాలింగ్ అటెన్షన్ మోషన్ ద్వారా’ తెలంగాణ అంశాన్ని చర్చకు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడితే తమ పార్టీ తక్షణమే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పి కేంద్ర హోంమంత్రిని ఇరకాటంలో పడేశారు.
  • బీజేపీ 2008 నవంబర్ 13న సికింద్రాబాద్‌లో ‘సంకల్ప యాత్ర’ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య 2009 డిసెంబర్ 7న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బహిరంగంగా మద్దతు ప్రకటించింది.
  • టీ-జేఏసీలోనూ బీజేపీ కీలకంగా వ్యవహరించింది. జేఏసీ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు చురుగ్గా పాల్గొన్నారు.
  • 2010 జనవరి 5న కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి దత్తాత్రేయ, ఆంధ్రా ప్రాంతం నుంచి హరిబాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించింది.
  • 2010 జనవరి 23న నిజాం కాలేజీలో నిర్వహించిన రణభేరి సభకు బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ యువకులు బలిదానం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
  • తెలంగాణ ఏర్పాటుపై జాప్యాన్ని నిరసిస్తూ 10 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీకి చెందిన యెండల లక్ష్మీనారాయణ పదవులకు రాజీనామా చేశారు. 2010 జూలై 31న ప్రకటించిన ఉప ఎన్నికల ఫలితాల్లో వీరందరూ ఘన విజయం సాధించారు.
  • 2011 మే 31న కరీంనగర్‌లో బీజేపీ పోరుసభ నిర్వహించింది. ఈ సభలో సుష్మాస్వరాజ్ ‘తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వకపోతే మా పార్టీ ఇస్తుంది’ అని ప్రకటించారు.
  • నాగం జనార్దన్ రెడ్డి ‘తెలంగాణ నగారా సమితిని’ 2013 జూన్ 3న బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో విలీనం చేశారు.
  • 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వారా తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ)

1983లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) హయాంలో కోస్తాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వలసల పర్వం ఊపందుకుంది. 1975లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ ఎన్జీవో సంఘం ఎన్టీఆర్‌ను కోరింది. దీంతో ఆయన ‘జయభారత్ రెడ్డి’ నేతృత్వంలో ఈ అంశంపై ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ 1975-1980 వరకు జరిగిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చింది. దీన్ని పరిశీలించడానికి సుందరేశన్ ఆధ్వర్యంలో మరో కమిటీ వేశారు. ఇది కూడా జయభారత్ రెడ్డి కమిటీ మాదిరిగానే సిఫారసు చేసింది. దీంతో 1985 డిసెంబర్ 30న 610 జీవోను విడుదల చేశారు. 1986 మార్చి 31 నాటికి ఈ జీవో అమల్లోకి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అమల్లోకి రాలేదు. రామారావు హయాంలో అన్ని రంగాల్లో కోస్తాంధ్రుల ఆధిపత్యం ప్రారంభమైంది. సచివాలయం ముఖ్య శాఖాధిపతుల కార్యాలయాల్లో ఆంధ్రా ప్రాంతంవారి సంఖ్య బాగా పెరిగింది. స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది.
  • 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఎన్డీఏ హయాంలోని కేంద్ర ప్రభుత్వం 2000లో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబే అడ్డుకున్నారనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.
  • చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్న కె.చంద్రశేఖర్‌రావు తన పదవికి రాజీనామా చేసి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని స్థాపించారు. ఇదే సమయంలో 610 జీవో అమలు ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి రగిలింది.
  • 2008లో సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ‘నవ తెలంగాణ పార్టీ’ స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ఆందోళనకు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలకు తెలంగాణ స్టిక్కర్లు అంటించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.
  • తెలుగుదేశం పార్టీ అధ్యక్ష హోదాలో చంద్రబాబు నాయుడు 2008 అక్టోబర్ 10న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు.
  • హైదరాబాద్‌లో 2009 డిసెంబర్ 7న తెలంగాణ అంశానికి సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ‘తెలంగాణపై మీరు బిల్లు పెట్టండి, మేం మద్దతు ఇస్తాం’ అని టీడీపీ ప్రకటించింది.
  • 2009 డిసెంబర్ 8న రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘తెలంగాణకు అనుకూలంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తే మద్దతిస్తాం’ అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు.
  • 2009 మార్చిలో దేవేందర్ గౌడ్ తన పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. 2009 ఆగస్టు 6న ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చి మళ్లీ టీడీపీలో చేరారు.
  • 2009 డిసెంబర్ 24 ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల దీక్షకు మద్దతు తెలపడానికి వెళ్లిన టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డిపై దాడి చేశారు.
  • 2010 జనవరి 5న ఢిల్లీలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరఫున తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఆంధ్రా ప్రాంతం నుంచి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. తెలంగాణపై కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పకుండా టీడీపీని ఇరకాటంలో పెట్టడానికే ఈ ఎత్తుగడ వేసిందని రేవూరి అఖిల పక్షంలో ఆరోపణలు గుప్పించారు.
  • నాగం జనార్దన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి 2011 సెప్టెంబర్ 10న ‘తెలంగాణ నగారా సమితి’ ఏర్పాటు చేశారు.
  • తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకోవడంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చంద్రబాబు రెండు కళ్ల వ్యూహాన్ని అమలు చేశారు.
  • 2008 అక్టోబర్‌లో రాసిన లేఖను ప్రస్తావిస్తూ 2012 సెప్టెంబర్ 26న ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చంద్రబాబు మరోసారి ఉత్తరం రాశారు.
  • ‘2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం. మీరు నిర్ణయం తీసుకొని అస్థిరతను దూరం చేయండి’ అంటూ 2012 డిసెంబర్ 27న నాటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
  • 2014 జనవరి 25న చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ విభజన బిల్లు తప్పుల తడక అని, దాన్ని తిప్పి పంపాలని కోరారు. డ్రాఫ్ట్ బిల్లు కాకుండా ఒరిజినల్ బిల్లు పంపాలని కోరారు.
  • కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధానం సరిగా లేదంటూ 2014లో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు దీక్ష చేశారు.

వామపక్షాలు

సీపీఐ
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన నేపథ్యం ఉండటం వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఐ బహిరంగంగా మద్దతు ప్రకటించింది.
  • 2007 ఆగస్టు 5న సీపీఐ అగ్రనేత గురుదాస్ గుప్తా లోక్‌సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి మద్దతు ప్రకటించారు.
  • 2010 జనవరి 5న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీపీఐ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి గుండా మల్లేష్, ఆంధ్రా ప్రాంతం నుంచి నారాయణ హాజరయ్యారు. వీరిద్దరూ తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలమేనని స్పష్టం చేశారు.
  • టీ-జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సకల జనుల సమ్మె, సడక్ బంద్, మిలియన్ మార్‌‌చ తదితర కార్యక్రమాల్లో సీపీఐ చురుగ్గా పాల్గొంది. ఈ పార్టీ విద్యార్థి సంఘాలు, కార్మిక అనుబంధ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి.
సీపీఎం
ఈ పార్టీ తాము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ విభజన తమకు సమ్మతం కాదని పేర్కొంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడి ఉన్న, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలని, 610 జీవోను కచ్చితంగా అమలు చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు.
  • 2010 జనవరి 5న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సీపీఎం తరఫున తెలంగాణ నుంచి జూలకంటి రంగారెడ్డి, ఆంధ్రా ప్రాంతం నుంచి రాఘవులు వెళ్లారు. వీరు తెలంగాణకు తాము వ్యతిరేకమని, ఇది పార్టీ నిర్ణయమని చెప్పారు.

తెలంగాణ ప్రజా ఫ్రంట్

ప్రజాస్వామిక తెలంగాణే లక్ష్యంగా ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్’ (టీపీఎఫ్) ఆవిర్భవించింది. ఇది అనేక ప్రజా సంఘాల కూటమి.
  • టీపీఎఫ్ ఏర్పాటులో గద్దర్, ఆకుల భూమయ్య, వేదకుమార్, విమలక్క తదితరులు కీలకపాత్ర పోషించారు.
  • ప్రజా గాయకుడు గద్దర్ నేతృత్వంలో 2010 అక్టోబర్ 9న టీపీఎఫ్ ఏర్పడింది.
  • పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు చేపట్టారు.
  • తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించారు.
  • శ్రీ కృష్ణ కమిటీ సిఫారసులపై ఆందోళన చేపట్టారు.
  • ఉద్యమ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనవద్దని గద్దర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని, అందువల్ల తప్పకుండా పోటీ చేయాలని విమలక్క వాదించారు. దీంతో విభేదాలు తలెత్తి విమలక్క టీపీఎఫ్ నుంచి వైదొలిగారు.
  • 2010 అక్టోబర్ 21న విమలక్క ‘ఐక్య కమిటీ’ని ఏర్పాటు చేశారు.
  • టీపీఎఫ్ నుంచి గద్దర్ పక్కకు తప్పుకోవడంతో 2012లో ఆకుల భూమయ్య దీని అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తెలంగాణ జనసభ -1985
  • 1985లో తెలంగాణ జనసభను ఏర్పాటు చేశారు.
  • 80వ దశకంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జనసభ ముఖ్య భూమిక పోషించింది.
తెలంగాణ ఫోరం - జానారెడ్డి
1990లో జానారెడ్డి కన్వీనర్‌గా తెలంగాణ ఫోరం ఏర్పాటైంది.
  • 1992 సెప్టెంబర్‌లో నాటి ప్రధాని పీవీ నరసింహారావును కలిసి విద్య ఉద్యోగ, సాగునీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై జానారెడ్డి వినతిపత్రం సమర్పించారు.
  • తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై జానారెడ్డి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

ప్రజారాజ్యం

ప్రజారాజ్యం పార్టీని ప్రముఖ నటుడు చిరంజీవి స్థాపించారు. తర్వాత దీన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
  • చిరంజీవి సమైక్యాంధ్రవైపు మొగ్గు చూపారు.
  • 2010 జనవరి 5న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి, సి. రామచంద్రయ్య హాజరయ్యారు. వీరిద్దరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకమని చెప్పారు.

జై తెలంగాణ పార్టీ - 1997
1997లో ఇంద్రారెడ్డి ‘జై తెలంగాణ పార్టీ’ని స్థాపించారు. తెలంగాణ వ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించారు.
  • పటోళ్ల ఇంద్రారెడ్డి టీడీపీలో కీలక నేతగా ఉండేవారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఈయన అత్యంత విశ్వసనీయుడు.
  • ఎన్.టి. రామారావు ప్రభుత్వంలో ఈయన మంత్రిగా పనిచేశారు.
  • 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ పక్షాన నిలిచారు.
  • తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఇంద్రారెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
  • 1996లో నాటి ప్రధానమంత్రి దేవెగౌడ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలం అని ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం - చిన్నారెడ్డి

చిన్నారెడ్డి తెలంగాణ వాది. కాంగ్రెస్‌లోని తెలంగాణవాదులందరినీ ఒక్కటి చేసి ‘తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం’ను ఏర్పాటు చేశారు. దీనికి ఆయన కన్వీనర్‌గా వ్యవహరించారు.
  • 2000 ఆగస్టు 11న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హైదరాబాద్‌కు వచ్చారు. చిన్నారెడ్డి నాయకత్వంలో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణకు అనుకూలంగా సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించారు.
  • తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీకి చిన్నారెడ్డి సారథ్యం వహించారు.
  • 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. వనపర్తి నియోజక వర్గం నుంచి గెలిచిన చిన్నారెడ్డికి వైఎస్ మంత్రి పదవి ఇచ్చారు.

నవ తెలంగాణ పార్టీ - 2008
  • టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ 2008లో సాధారణ ఎన్నికల ముందు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీ స్థాపించారు.
  • వాహనాలకు తెలంగాణ పేరుతో స్టిక్కర్లు అంటించడం తదితర కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
  • 2009 మార్చిలో దేవేందర్‌గౌడ్ తన పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు.
  • 2009 ఆగస్టు 6న ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • దేవేందర్ గౌడ్ ప్రస్తుతం టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

లోక్‌సత్తా పార్టీ

2006లో లోక్‌సత్తా రాజకీయ పార్టీగా అవతరించింది. మొదట్లో ఇది తెలంగాణపై ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ పార్టీ నాయకుల ఒత్తిడితో తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈ పార్టీ కార్యకర్తలు ఉద్యమంలో పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ

యువజన కాంగ్రెస్ రైతు శ్రామిక పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)ని 2011లో స్థాపించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మొదట్లో తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించారు. భారత రాజ్యాంగంలోని 3వ ప్రకరణ ప్రకారం పార్లమెంట్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని, ఈ విషయంలో ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోరని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సమైక్యాంధ్రను సమర్థించారు.

తెలంగాణ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం ‘తెలంగాణ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్’ ఏర్పాటు చేశారు.
  • తెలంగాణ ఆకాంక్షను ఈ సంస్థ బలంగా వినిపించింది.
  • ఆరు సూత్రాల పథకం ప్రకారం విద్యాసంస్థల్లో స్థానికులకు 85 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండేది. ఓపెన్ కాంపిటిషన్ కోటా కోసం 15 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా, ప్రభుత్వం ఓపెన్ కోటా కోసం 15 శాతం సీట్లను స్థానికేతరులకు రిజర్వు చేసింది.
  • తెలంగాణలో రిజర్వేషన్ల కోసం మొదలైన ఈ ఉద్యమం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చింది.

మాదిరి ప్రశ్నలు























































#Tags