తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్ట్‌లు
1. భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టులు
2. మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు
3. చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు
భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టులు: 10,000 హెక్టార్లు (25,000 ఎకరాలు) అంతకంటే ఎక్కువ భూమికి సాగునీరు అందించే ప్రాజెక్టులను భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటారు.
మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు: 2,000-10,000 హెక్టార్లు లేదా 5,000-25,000 ఎకరాల భూమికి నీటి సౌకర్యాన్ని అందించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్ట్‌లు అంటారు.
చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు: 2,000 హెక్టార్లు లేదా 5,000 ఎకరాల వరకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించగలిగే ప్రాజెక్టులను చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటారు.
రాష్ట్రంలో ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం 8.95 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి నీటి వసతి కల్పిస్తోంది. దీన్ని కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాల మధ్య నిర్మించారు. మన రాష్ట్రంలో కెల్లా అత్యంత పెద్ద ప్రాజెక్టుగా దీన్నే చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. దీన్ని 1967 ఆగస్టు 4న నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. ఇది ప్రంపచంలో కెల్లా అత్యంత పొడవైన, అతి ఎత్తై రాతి ఆనకట్టతో నిర్మితమైన ప్రాజెక్టు.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువను ‘లాల్ బహదూర్ కాలువ’గా పిలుస్తారు. దీని పొడవు 296 కి.మీ. ఇది తెలంగాణలోని నల్గొండ, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సాగు నీరు అందిస్తోంది.
- ఈ ప్రాజెక్టు కుడి కాలువను ‘జవహర్‌లాల్ నెహ్రూ కాలువ’గా పేర్కొంటారు. దీని పొడవు 203 కి.మీ. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు అందిస్తోంది.
- కుడి కాలువ ప్రపంచంలోని సేద్యపు నీటి కాలువల్లో కెల్లా పొడవైంది.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలో మానవ నిర్మిత సరోవరాల్లో మూడో అతి పెద్దది.
- దేశంలో మొదటిసారిగా ఇక్కడే ‘రివర్సబుల్ టర్బైన్’లను ఉపయోగించి జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 124 మీ. (407 అడుగులు).
- ఈ ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజనీర్ మీర్ జాఫర్ అలీ.
గతంలో దీన్ని పోచంపాడు ప్రాజెక్టుగా వ్యవహరించేవారు. దీన్ని గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద నిర్మించారు. ఈ ప్రాజెక్టును 1963 జూలై 26న ప్రారంభించారు. గోదావరి నదిపై తెలంగాణలో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలోని 3.97 లక్షల హెక్టార్ల సాగుభూమికి నీరందిస్తున్నారు.
- ఈ ప్రాజెక్టులో ‘కాకతీయ కాలువ’ ప్రధాన కాలువ. దీంతోపాటు సరస్వతి, లక్ష్మీ కాలువలు కూడా ఉన్నాయి.
- ఈ ప్రాజెక్టు జలాశయం గరిష్ట ఎత్తు 1,091 అడుగులు. దీని నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపు అడుగులు (టీఎంసీలు).
- ఈ ప్రాజెక్టుకు మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి.
- ఇది ప్రారంభంలో కేవలం నీటి పారుదల ప్రాజెక్టుగానే సేవలందించింది. ప్రారంభించిన రెండు దశాబ్దాల తర్వాత ఎన్టీఆర్ హయాంలో దీన్ని విద్యుదుత్పాదక ప్రాజెక్టుగా రూపొందించారు.
- ఈ ప్రాజెక్టు ద్వారా రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేస్తున్నారు.
- కాకతీయ కాలువ ద్వారా వరంగల్, హన్మకొండ నగరాలకు, సరస్వతి కాలువ ద్వారా ఆదిలాబాద్‌కు నీటి వసతిని కల్పిస్తున్నారు.
- కాకతీయ కాలువ తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన (284 కి.మీ.) నీటి కాలువ.
- ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రసాదినిగా ఉంది.
- జలయజ్ఞంలో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-1 పనులు పూర్తి చేశారు. తద్వారా 9.7 లక్షల ఎకరాలకు నీటిని అందించే సామర్థ్యం కలిగింది.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ప్రధాన లక్ష్యంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను గోదావరి ఉపనది అయిన ‘మంజీరా’పై నిర్మించారు. దీన్ని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని అచ్చంపేట గ్రామం వద్ద 1923లో నాటి హైదరాబాద్ నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్’ నిర్మించారు. దీని నిర్మాణం 1931లో పూర్తయింది.
- నిజాం ఆంతరంగిక ఇంజనీరింగ్ సలహాదారైన నవాబ్ అలీ జంగ్ ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు.
- ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 35 మెగావాట్ల స్థాపక సామర్థ్యం ఉన్న నిజాంసాగర్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. దీని ద్వారా 1936 నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు సరఫరా అవుతోంది.
- ఈ ప్రాజెక్టు ఆయకట్టు 2,31,339 ఎకరాలు.
- జలయజ్ఞంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ తాలూకాల్లోని 2.3 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు.
ఈ ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి డివిజన్‌లో కొత్తపేట మండలంలో ఉంది. వనపర్తి సంస్థానాన్ని పాలించిన రెండో రామేశ్వరరావు కాలంలో ‘సరళాదేవి’ పేరుపై ఒక చెరువు నిర్మించారు. దీన్నే ఆధునీకరించి 1959 జూలై 26న సరళా సాగర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. ఇది వర్షాధార ప్రాజెక్టు. అందువల్ల నీటి సమస్యను అధిగమించడానికి ఈ ప్రాజెక్టుకు 10 కి.మీ. దూరంలో ఉన్న ‘రామన్‌పాడ్ బ్యాలెన్సింగ్’ రిజర్వాయర్ ద్వారా రూ.12 కోట్లతో ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. సైఫన్ పద్ధతిలో నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో ఇది ప్రపంచంలోనే రెండోది, ఆసియాలో మొదటిది. దీని కుడికాలువ పొడవు 8 కి.మీ. ఈ కాలువ ద్వారా 388 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. దీని ఎడమ కాలువ పొడవు 17 కి.మీ. దీని ద్వారా 3,796 ఎకరాలకు సాగునీరు లభిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 10 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. సైఫన్లు పనిచేసే సందర్భంలో నీటిని విరజిమ్మే దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రియదర్శిని - జూరాల ప్రాజెక్ట్
మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ ప్రాజెక్టులలో ప్రియదర్శిని - జూరాల ప్రాజెక్ట్ ఒకటి. కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత ఈ నదిపై ఉన్న మొదటి ప్రాజెక్ట్ ఇదే. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాలకు 16 కి.మీ. దూరంలో ఉన్న ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామం వద్ద దీన్ని నిర్మించారు.
- ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్లే రోడ్డు మార్గంలో ఆత్మకూరు పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇది సుమారు లక్షా ఇరవై వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. ఈ ప్రాజెక్టు రెండు ప్రధాన కాలువల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తోంది.
- ఈ ప్రాజెక్టు కుడి కాలువను ‘సోమనాద్రి’గా పిలుస్తారు. దీని పొడవు సుమారు 51 కి.మీ. ఇది గద్వాల, అలంపూర్ నియోజక వర్గాలలోని 37,700 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది.
- ఈ ప్రాజెక్ట్ ఎడమ కాలువను ఎన్టీఆర్ కాలువగా పిలుస్తారు. ఈ కాలువ ద్వారా ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని 64,500 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
- జలయజ్ఞంలో భాగంగా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు 11.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండి, సుమారు ఒక లక్ష ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఈ పథకం మహబూబ్‌నగర్‌జిల్లాలోని మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఒకటి. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1945లో నిజాం పాలనా కాలంలో దీని నిర్మాణం ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 వేల ఎకరాలకు సాగు నీటిని అందించడానికి ఈ ప్రాజెక్టు నిర్మించారు. దీని నిల్వ సామర్థ్యం 2.276 టీఎంసీలు.
నెట్టెంపాడు ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల్లో ఒకటి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వపై ఆధారపడిన ప్రాజెక్టు ఇది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి 21.425 టీఎంసీల నీటిని వినియోగించుకుని రెండు లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ధరూర్ మండలంలో నెట్టెంపాడు, ఉప్పేరు గ్రామాల సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది.
లోయర్ మానేరు ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాలోని అలుగునూరు గ్రామం వద్ద గోదావరి ఉపనది అయిన ‘మానేరు’పై ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1974లో ప్రారంభమై, 1985లో పూర్తయింది. ఇది 5.65 లక్షల ఎకరాల ఆయకట్టును కలిగి ఉంది. కాకతీయ కాలువకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, వరంగల్ జిల్లాలకు తాగు, సాగు నీరు అందిస్తున్నారు.
భీమా ప్రాజెక్ట్
ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఒకటి. దీన్ని ‘రాజీవ్ ఎత్తి పోతల పథకం’గా వ్యవహరిస్తారు. నిజాం రాష్ట్రంలో నాటి గుల్బర్గా జిల్లాలోని ‘తంగడి’ వద్ద భీమా ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లాలోని మగనూర్ మండలంలో ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం, తదనంతర పరిణామాలతో కర్ణాటక ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత కృష్ణానది నుంచి 20 టి.ఎమ్.సి.ల నీటిని వాడుకోవడానికి కేంద్ర జల వనరుల సంఘం అనుమతి ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. భీమా ప్రాజెక్టు మొత్తం ఆయకట్టు 2 లక్షల ఎకరాలు. దీని కింద రెండు లిఫ్టులు, 5 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు.
మొదటి లిఫ్ట్: ఇది మక్తల్ మండలం, పంచదేవ్‌పాడ్ గ్రామంలో ఉంది. దీని ద్వారా జూరాల జలాశయం నుంచి నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్లలోకి తరలిస్తున్నారు. ఈ లిఫ్ట్ కింద రెండు రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. అవి:
- సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఈ రిజర్వాయర్ కింద 64,200 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
- భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: దీని కింద 46,800 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు.
అవి:
- ఎనుకుం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఈ రిజర్వాయర్ ద్వారా 14,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
- శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: దీని కింద 57,000 ఎకరాలకు సాగునీరు అందించే వెసులుబాటు ఉంది.
- రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఈ రిజర్వాయర్ కింద 21,000 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు ఉంది.
వరంగల్ జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీన్ని గోదావరి నదిపై ఏటూరు నాగారం మండలంలోని దేవాదుల, గంగారం గ్రామాల వద్ద నిర్మిస్తున్నారు. దీన్ని ‘జె.చొక్కారావు గోదావరి జలాల ఎత్తిపోతల పథకం’ అని కూడా పిలుస్తారు. ప్రాజెక్టులో భాగంగా 238 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లడం భారతదేశంలో ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టును మూడు దశలుగా నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 1.2 లక్షల ఎకరాలు. ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే జిల్లాలు వరంగల్, కరీంనగర్, నల్గొండ.
దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం
గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే రెండో భారీ నీటి పారుదల ప్రాజెక్టు ఇది. గోదావరి నదిపై ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద ఈ బ్యారేజీని నిర్మించడానికి ప్రతిపాదించారు. నాలుగు దశల్లో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి 119 టి.ఎమ్.సి.ల నీటిని నాగార్జునసాగర్ టేల్‌పాండ్‌కు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గోదావరి జలాలు ఈ ప్రాజెక్టు నుంచి సాగర్ టేల్‌పాండ్ వరకు 291 కిలోమీటర్ల దూరం వెళతాయి. దీని లింకు కాల్వల్లో కిన్నెరసాని, ముర్రేడువాగు, మున్నేరు, పాలేరు, మూసీ నదులు కలుస్తాయి.
ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్) ప్రాజెక్టు
సర్ ఆర్థర్ కాటన్ గోదావరిపై ఎల్లంపల్లి వద్ద బ్యారేజి నిర్మాణానికి 100 ఏళ్ల కిందటే ప్రతిపాదన చేశారు. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2004 జూలై 28న శంకుస్థాపన చేశారు. నక్సల్స్ చేతిలో హత్యకు గురైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును దీనికి పెట్టారు.
గోదావరి నదిపై కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని ఎల్లంపల్లి సమీపంలో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 5 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సాగునీరు అందుతుంది. దీంతో పాటు రామగుండం ఎన్‌టీపీసీకి అవసరమైన 6.5 టి.ఎమ్.సి.ల నీటిని అందించవచ్చు.
రాజోలిబండ డైవర్షన్ స్కీం
మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో రాజోలిబండ డైవర్షన్ స్కీం ఒకటి. దీన్ని సంక్షిప్తంగా ‘ఆర్‌డీఎస్’ అంటారు. దీన్ని కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా తుంగభద్ర నదిపై కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో నిర్మించాయి. ఈ ప్రాజెక్టు కాలువ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు
నల్గొండ జిల్లాకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఎస్‌ఎల్‌బీసీగా పిలిచే ఈ ప్రాజెక్టును 1983లో నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ ప్రారంభించారు. 2,70,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేది దీని ప్రధాన లక్ష్యం. ఎలిమినేటి మాధవరెడ్డి కాలువను 2006 సెప్టెంబర్ 26న జాతికి అంకితం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి
గోదావరి ఉపనది అయిన ప్రాణహితపై 494 మీటర్ల వద్ద ఆదిలాబాద్ జిల్లా, కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు 160 టి.ఎమ్.సి.ల నీటిని తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యం. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. దీని వల్ల మహారాష్ట్రలోని కొంత భాగం ముంపునకు గురవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు డిజైన్‌లో కొన్ని మార్పులు చేసింది. గోదావరి నదిపై కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ లేదా ఇచ్చంపల్లి వద్ద నిర్మించడానికి సర్వే మొదలుపెట్టారు. దీన్ని ‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేవెళ్ల సుజల స్రవంతి’గా వ్యవహరిస్తున్నారు.
ఇతర ప్రాజెక్టులు
వట్టివాగు ప్రాజెక్టు: ఇది ఆదిలాబాద్‌లోని వట్టివాగుపై నిర్మించిన మధ్య తరహా ప్రాజెక్టు. దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 9918 హెక్టార్లకు సాగునీరు అందిస్తున్నారు.
బొగ్గులవాగు ప్రాజెక్టు: ఇది కరీంనగర్ జిల్లాలోని రుద్రారం వద్ద బొగ్గులవాగుపై నిర్మించిన మధ్య తరహా ప్రాజెక్టు. దీన్ని 1976-77లో ప్రారంభించి 1987లో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 8 గ్రామాల్లో 5,150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
సాత్నాల వాగు ప్రాజెక్టు: ఇది ఆదిలాబాద్ జిల్లాలోని కప్నా గ్రామంలో రాళ్లవాగుపై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టు. ఇది దాదాపుగా 24,000 ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పిస్తోంది.
స్వర్ణ ప్రాజెక్టు: ఆదిలాబాద్‌లోని ‘జాలి’ గ్రామం వద్ద గోదావరి ఉపనది అయిన స్వర్ణనదిపై ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇది సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది.
సింగూర్ డ్యామ్: మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణానికి సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన బహుళార్థక మధ్య తరహా ప్రాజెక్టు ఇది. దీనికి 30 టి.ఎమ్.సి.ల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించడంతో పాటు విద్యుత్ శక్తి ఉత్పతి కేంద్రంగానూ ఉంది.
డిండి ప్రాజెక్టు: నల్లగొండ జిల్లాలోని డిండి పట్టణ సమీపంలో కృష్ణానది ఉపనది అయిన డిండిపై 1943లో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ రిజర్వాయర్ కింద నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సుమారు 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఆసిఫ్ నహర్ ప్రాజెక్టు: నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం నెమలి కాల్వ గ్రామం వద్ద మూసీనదిపై దీన్ని నిర్మించారు. సుమారు 15,246 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 1905లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ గత 20 ఏళ్లుగా ఇది 10,000 ఎకరాలకు మాత్రమే నీటిని అందించగలుగుతోంది.
కడెం ప్రాజెక్టు: ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉపనది అయిన కడెం నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని సామర్థ్యం 13.243 టి.ఎమ్.సి.లు.
లెండి ప్రాజెక్టు: ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌పై ఆధారపడి మహారాష్ట్రలోని ముఖెడ్ తాలూకాలో ‘గోజిగాన్’ గ్రామంలో దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలోని 31 గ్రామాల్లో 22,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ, మహారాష్ట్ర 38 : 62 నిష్పత్తిలో పంచుకున్నాయి. నీటిని కూడా ఇదే నిష్పత్తిలో వాడుకుంటాయి.
మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్: మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలంలోని రేగిమంగడ్డ గ్రామ సమీపంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జిల్లాలోని కరువు ప్రాంత పంట పొలాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా 2.5 టి.ఎమ్.సి.ల సాగునీరు, 3.2 లక్షల మందికి తాగునీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రీ కొమరం భీం ప్రాజెక్టు: ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం ‘అడ’ గ్రామ సమీపంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించతలపెట్టారు.
ప్రాజెక్టు పేరు - లబ్ధి పొందే జిల్లాలు
నీల్వాయ్ ప్రాజెక్టు - ఆదిలాబాద్
ర్యాలివాగు ప్రాజెక్టు - ఆదిలాబాద్
గొల్లవాగు ప్రాజెక్టు - ఆదిలాబాద్
చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తపోతల పథకం - నిజామాబాద్
పాలం వాగు ప్రాజెక్టు - ఖమ్మం
కిన్నెరసాని ప్రాజెక్టు - ఖమ్మం
అలీసాగర్ ప్రాజెక్టు - నిజామాబాద్
వెంగళ్‌రావు లిఫ్ట్ ఇరిగేషన్ - మహబూబ్‌నగర్
గుండ్లవాగు ప్రాజెక్టు - ఖమ్మం
కంతన పల్లి (పి.వి.నరసింహారావు) ఎత్తిపోతల ప్రాజెక్టు - వరంగల్, ఖమ్మం
తాలిపేరు ప్రాజెక్టు - ఖమ్మం
ప్రాజెక్టులు - కొత్తపేర్లు
భీమా ప్రాజెక్టు: రాజీవ్ ఎత్తిపోతల పథకం.
దేవాదుల ఎత్తిపోతల పథకం: జె.చొక్కారావు గోదావరి జలాల ఎత్తిపోతల పథకం.
ఎల్లంపల్లి ప్రాజెక్టు: శ్రీపాదసాగర్ ప్రాజెక్టు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు: డా.బి.ఆర్.అంబేద్కర్ సుజల స్రవంతి.
కంతన పల్లి సుజల స్రవంతి: పి.వి.నరసింహారావు ప్రాజెక్టు.
దుమ్ముగూడెం ప్రాజెక్టు: మహాత్మా జ్యోతిరావ్ పూలే ప్రాజెక్టు.
కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్: మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం.
గతంలో అడిగిన ప్రశ్నలు
1. జూరాల ప్రాజెక్టు ఏర్పాటై ఉన్న జిల్లా ఏది? (గ్రూప్-1, 2000)
1) మహబూబ్‌నగర్
2) నల్గొండ
3) ఆదిలాబాద్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 1
2. నిజాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?(గ్రూప్-2ఎ-1989)
1) మూసీ
2) మంజీర
3) శబరి
4) కిన్నెరసాని
- View Answer
- సమాధానం: 2
3. పోచంపాడు ప్రాజెక్టు పేరేమిటి? (గ్రూప్-2బి-1989)
1) సింగూరు
2) జూరాల
3) శ్రీరామ్‌సాగర్
4) భీమ
- View Answer
- సమాధానం: 3
మాదిరి ప్రశ్నలు
1. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నీటి కాలువ?1) సరస్వతి
2) కాకతీయ
3) ఎన్టీఆర్ కాలువ
4) జవహర్ లాల్ నెహ్రూ కాలువ
- View Answer
- సమాధానం: 2
2. ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన రాతి ఆనకట్ట ఉన్న ప్రాజెక్టు ఏది?
1) నాగార్జునసాగర్
2) శ్రీరామ్‌సాగర్
3) నిజాంసాగర్
4) జూరాల
- View Answer
- సమాధానం: 1
3. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) నల్గొండ
3) కరీంనగర్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 4
4.ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి
2) మంజీర
3) కృష్ణా
4) తుంగభద్ర
- View Answer
- సమాధానం: 3
5. కిందివాటిలో ఏ ప్రాజెక్టును స్వాతంత్య్రానికి ముందే నిర్మించారు?
1) శ్రీరాంసాగర్
2) నిజాంసాగర్
3) నాగార్జునసాగర్
4) ప్రియదర్శిని
- View Answer
- సమాధానం: 2
-
6. సింగూర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?
1) కృష్ణానది
2) మంజీరా నది
3) గోదావరి
4) కడెం
- View Answer
- సమాధానం: 2
7. కంతనపల్లి సుజల స్రవంతి పథకాన్ని ఏ నదిపై చేపడుతున్నారు?
1) మూసీ
2) కడెం
3) కృష్ణా
4) గోదావరి
- View Answer
- సమాధానం:4
8. ఏ పథకాన్ని ‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సుజల స్రవంతి’గా వ్యవహరిస్తున్నారు?
1) దుమ్ముగూడెం
2) కంతనపల్లి సుజల స్రవంతి
3) ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు
4) ఎల్లంపల్లి ప్రాజెక్టు
- View Answer
- సమాధానం: 3
9. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాకు సంబంధించింది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) మహబూబ్‌నగర్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 4
10. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏ జిల్లాలో ఉంది?
1) మహబూబ్‌నగర్
2) నల్గొండ
3) నిజామాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 1