తెలంగాణ ప్రాచీన కవులు

పాల్కురికి సోమనాథుడు (1160-1240)
జన్మస్థలం: వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని పాలకుర్తి.
బిరుదులు: ప్రథమాంధ్ర విప్లవ కవి, దేశీ కవిత్వోద్యమ పితామహుడు.
రచనా శిల్పం: ‘అల్పాక్షరాల అనల్పార్థ రచన’
రచనలు:
1. పద్య ప్రకృతులు:
అనుభవసారం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసములు, వృషాధిప శతకం
2. లఘుకృతులు:
బసవరగడ, నమస్కార గద్య, శరణుబసవ గద్య, బసవాష్టకం, బసవోదాహరణం, బసవలింగ నామావళి.
3. ద్విపద కావ్యాలు:
బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, మల్లమదేవి పురాణం (అలభ్యం).
పాల్కురికి సోమనాథుడు కాకతీయుల కాలానికి చెందినవాడు. పరిశోధకులు పాల్కురికి సోమనాథుణ్ని ‘తెలంగాణ ఆదికవి’గా పేర్కొంటారు. తెలుగు కవితా ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగు సాహిత్యంలో శైవ సాహిత్యానికి సుస్థిర స్థానం సంపాందించి పెట్టిన వారిలో పాల్కురికి ఆద్యుడు, అగ్రగణ్యుడు. పాల్కురికి సోమనాథుడు ద్విపద కావ్య ప్రక్రియకు ఆద్యుడు. ఉదాహరణ కావ్య రచనకు మార్గదర్శకుడు.
సంఖ్యా నియమం, మకుట నియమం ఉన్న మొదటి శతకం వృషాధిప శతకం. పాల్కురికి సోమనాథుడి తొలి రచన అనుభవసారం. తెలుగు సాహిత్యంలో శుద్ధమైన తొలి దేశీ స్వతంత్ర పురాణంగా బసవ పురాణం పేరొందింది. ఇది ఏడు ఆశ్వాసాల ద్విపద కావ్యం. సమకాలీన సమాజాన్ని చిత్రించిన తొలి తెలుగు సాంఘిక కావ్యం బసవ పురాణం. పాల్కురికి సోమనాథుడి ద్విపద బసవ పురాణాన్ని పిడుపర్తి సోమన పద్యకావ్యంగా రాశారు.
రుద్రపశుపతి, గొడగూచి, బెజ్జ మహాదేవి, ఉడుమూరి కన్నప్ప, ముగ్ధ సంగయ్య, చిరుతొండ నంబి లాంటి చిన్నపాత్రలకు పాల్కురికి సోమన కావ్య ప్రవేశం కల్పించారు. ‘ఉరుతర పద్యోక్తులకంటే సరసమై ఎరిగిన జాను తెనుగు’ అన్న కవి పాల్కురికి సోమనాథుడు. ఇతడి చివరి కృతి పండితారాధ్య చరిత్ర. తెలుగులో తొలిసారిగా జీవిత చరిత్ర రాసింది పాల్కురికి సోమనాథుడే అని విమర్శకుల అభిప్రాయం. తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వంగా పండితారాధ్య చరిత్రను విమర్శకులు ప్రశంసించారు.

బద్దెన (13వ శతాబ్దం)
బిరుదు
: కమలాసనుడు
రచనలు: నీతిశాస్త్ర ముక్తావళి, సుమతీ శతకం.
బద్దెన కాకతీయుల సామంతరాజు. వేములవాడ చాళుక్య రాజు భద్రభూపాలుడే ‘బద్దెన’ అని చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు రచించిన ‘నీతిశాస్త్ర ముక్తావళి’ ఒక గొప్ప రాజనీతి గ్రంథం. తెలుగులో వచ్చిన నీతి శతకాల్లో అగ్రగణ్యమైంది సుమతీ శతకం. ఇది కంద పద్య రచనలో వెలువడింది.

గోన బుద్ధారెడ్డి (13వ శతాబ్దం)
బిరుదులు:
కవి కల్పతరువు, కవిలోక భోజుడు.
రచన: రంగనాథ రామాయణం
కవితా శైలి: సరళం, పండిత పామర జన రంజకం
గోన వంశ రాజులు కాకతీయుల సామంతులు. వీరు రాయచూరు ప్రాంతాన్ని పరిపాలించేవారు. గోన బుద్ధారెడ్డి నిజాం రాష్ర్టంలోని రాయచూరు ప్రాంతాన్ని పాలించినట్లు ‘బూదపూరు, రాయచూరు శాసనాలు’ తెలుపుతున్నాయి. గోన బుద్ధారెడ్డి ‘పాఠ్యగేయేచ మధురం’ అనే కావ్యోక్తిని దృష్టిలో పెట్టుకొని రంగనాథ రామాయణాన్ని దేశీ ఛందమైన ద్విపదలో రచించాడు. తెలుగులో వచ్చిన రామాయణ కావ్యాల్లో మొదటిది రంగనాథ రామాయణం. ఇది ద్విపద ప్రక్రియకు చెందిన రచన. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండ వరకు మాత్రమే రాశాడు. ఉత్తర కాండను ద్విపదలో రాసిన సోదర జంట కవులు కాచవిభుడు, విఠలనాథుడు. తెలుగులో వెలువడిన ద్విపద కావ్యాల్లో ప్రథమ గౌరవం పొందిన రచన రంగనాథ రామాయణం.

మారన (13వ శతాబ్దం)
రచన:
మార్కండేయ పురాణం
మార్కండేయ పురాణాన్ని ప్రథమాంధ్ర మహాపురాణంగా పిలుస్తారు. అష్టాదశ పురాణాల్లో ఇది ఏడోది. మార్కండేయ పురాణం కృతిపతియైన ‘నాగయగన్నడు’ కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి సేనాపతి. మార్కండేయ పురాణం తెలుగులో అనేక మనోహర కథలకు పుట్టినిల్లు. మార్కండేయ పురాణం ఎనిమిది ఆశ్వాసాల చంపూ కథాకావ్యం.

శరభాంకుడు
కాలం:
రెండో ప్రతాపరుద్రుడి సమకాలీకుడు.
రచన: శరభాంక లింగమ శతకం

పోతన (1420-1480)
నివాసం:
బమ్మెర (ఓరుగల్లు)
తల్లిదండ్రులు: కేసన, లక్కమాంబ
బిరుదులు: సహజ పండితుడు, నిగర్వ చూడామణి.
కవితాశైలి: మధుర కవితా నిర్మాణం (అతి మధురం)
రచనలు: వీరభద్ర విజయం, నారాయణ శతకం(అలభ్యం), భోగినీ దండకం, మహాభాగవతం.
శ్రీనాథుడి సమకాలీకుల్లో అగ్రగణ్యుడు పోతన. కృతిని మానవులకు అంకితం చేయనని ప్రతిజ్ఞ చేసిన తొలి తెలుగు కవి పోతన. ‘సత్కవుల్ హాలికులైననేమి’ అని పోతన ప్రకటించాడు. పోతన సర్వజ్ఞ సింగ భూపాలుడు అనే రాజును తిరస్కరించాడు. పోతన భాగవతాన్ని రాస్తూ ‘నా జననంబు సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్’ అని చెప్పుకున్నాడు. భాగవత పురాణంలో ద్వాదశ స్కంధాలున్నాయి. పోతన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చాడు. తెలుగు వాజ్ఞ్మయ ప్రపంచంలో పోతనను చిరంజీవిని చేసిన రచన భాగవతం. ఇందులో ప్రధానంగా భక్తి మార్గ ప్రశంస ఉంది. భాగవతాన్ని శుకమహర్షి మోక్షశాస్త్రంగా పేర్కొన్నాడు.
తెలుగు భాగవత పురాణంలో పంచమ స్కంధాన్ని బొప్పరాజు గంగన, షష్ఠమ స్కంధాన్ని ఏర్చూరి సింగన, ఏకాదశ, ద్వాదశ స్కంధాలను వెలిగందుల నారయ రచించగా, 1, 2, 3, 4, 7, 8, 9, 10 స్కంధాలను పోతన రచించారు. క్రీ.శ.1848లో పురాణం హయగ్రీవ శాస్త్రులు తొలిసారిగా భాగవతాన్ని ముద్రించారు. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు భాగవతంలోని దశమ స్కంధంలో ఉన్నాయి.
‘కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ...’ అంటూ పోతన ప్రహ్లాద చరిత్రం ఘట్టంలో తన భక్తి పారవశ్యాన్ని చాటుకున్నాడు.
‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై...’ అనే ప్రసిద్ధ పద్యం పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది.
భాగవతంలో మధురభక్తికి చక్కని ఉదాహరణగా దశమస్కంధంలో శ్రీకృష్ణుడి రాసక్రీడల సందర్భంలో పోతన చెప్పిన ‘నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై..’ పద్యాన్ని చెప్పుకోవచ్చు.

 

పిల్లలమర్రి పిన వీరభద్రుడు (15వ శతాబ్దం)
పూర్వీకులు:
నల్లగొండ జిల్లా పిల్లలమర్రి నివాసులు
ఆస్థానం: సాళువ నరసింగరాయలు
రచనలు: శృంగార శాకుంతలం, జైమినీ భారతం.
శ్రీనాథుడి కాలం నాటికి పిల్లలమర్రి వంశస్థులు నెల్లూరులో ప్రధానులుగా ఉండేవారు. పిల్లమర్రి పినవీరభద్రుడు ‘వాణి నా రాణి’ అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు. ఇతడు రచించిన సుప్రసిద్ధ కావ్యం శృంగార శాకుంతలం. దీనికి శకుంతలా పరిణయం అనే పేరుంది. శృంగార శాకుంతలం నాలుగు ఆశ్వాసాల శృంగార ప్రబంధం. ఈ గ్రంథ కృతిపతి చిల్లర వెన్నయామాత్యుడు. జైమినీ భారతం కృతిపతి సాళువ నరసింగరాయలు. కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు చేసిన అశ్వమేథ యాగం గురించి జైమిని మహర్షి జనమేయుడికి చెప్పిన కథే జైమినీ భారతం ఇతివృత్తం.

చరిగొండ ధర్మన్న (1480-1530)
జన్మస్థలం:
పాలమూరు జిల్లా చరికొండ
బిరుదులు: శతలేఖినీ సురత్రాణ, శతఘంట సురవూతాణుడు.
రచన: చిత్ర భారతం.
ఇది ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం. చిత్రభారతానికి మూలం పద్మపురాణం. దీని కృతిపతి ఎనుమలూరి పెద్దన మంత్రి.

అద్దంకి గంగాధరుడు (1525-1585)
ప్రాంతం:
గోల్కొండ నివాసి
రచన: తపతీ సంవరణోపాఖ్యానం
అంకితం: ఇబ్రహీం కుతుబ్‌షా
తపతి సంవరణోపాఖ్యానం ఐదు ఆశ్వాసాల ప్రబంధం. ఇది చక్కటి లోకోక్తులతో, 24 రకాల వర్ణనలతో కూడుకున్న ప్రబంధం. మహమ్మదీయ ప్రభువులకు తెలుగు కావ్యాలను అంకితమిచ్చిన ప్రథమ కవి అద్దంకి గంగాధరుడు. ఇబ్రహీం కుతుబ్‌షా తెలుగు కవులకు ఆశ్రయమిచ్చి, తెలుగువారితో స్నేహభావంతో మెలిగాడు.

పొన్నికంటి తెలగన (1520-1580)
ప్రాంతం:
గోల్కొండ నివాసి
రచన: యయాతి చరిత్ర
పొన్నికంటి తెలగననే పొన్నగంటి తెలగనార్యుడు అని పిలుస్తారు. తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర. ఈ గ్రంథ కృతిపతి అమీన్ ఖాన్. ఇతడు ఇబ్రహీం కుతుబ్‌షాకు సామంతుడు. యయాతి చరిత్ర అయిదు ఆశ్వాసాల శృంగార కావ్యం.

మరింగంటి సింగరాచార్యులు (1520-1590)
బిరుదులు
: శతఘంటావధాని, అష్టభాషా కవితా విశారదుడు
రచనలు: నిరోష్ఠ్య రామాయణం (దశరథరాజ నందన చరిత్రం), సీతాకళ్యాణం(శుద్ధాంధ్ర ప్రబంధం), తారకబ్రహ్మ రామ శతకం, రామకృష్ణ విజయం(ధ్వ్యర్థి కావ్యం), నలయాదవ రాఘవ పాండవీయం(చతుర్థీ కావ్యం), శ్రీరంగ శతకం.
తెలుగులో మొదటి నిరోష్ఠ్య రచన దశరథ రాజనందన చరిత్రం. మొదటి అచ్చ తెలుగు నిరోష్ఠ్య రచన శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతా కల్యాణం. తెలుగులో త్వ్యర్థి, చతుర్థి కావ్యాల రచనలకు ఆద్యుడు మరింగంటి సింగరాచార్యులు.

ఎలకూచి బాలసరస్వతి (17వ శతాబ్దం)
జన్మస్థలం:
మహబూబ్‌నగర్ జిల్లా
ఆస్థానం: సురభిమాధవ రాయలు
సంస్థానం: జటప్రోలు
రచనలు: రాఘవ యాదవ పాండవీయం (నాలుగు ఆశ్వాసాల కావ్యం), సుభాషిత త్రిశతి అనువాదం, మల్లభూపాలీయం (నీతి శతకం), చంద్రికా పరిణయం (ప్రబంధ కావ్యం), సురభి మల్లా! వైదుషీ భూషణా! (వైరాగ్య శతకం), రంగకౌముది (యక్షగానం).
భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన తొలి వ్యక్తి ఎలకూచి బాలసరస్వతి. ఇతడే ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాఖ్యాత. తెలుగులో త్వ్యర్థి కావ్యమైన ‘రాఘవ యాదవ పాండవీయం’ను ఎలకూచి బాలసరస్వతి రచించి తిరుపతి వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు.

కంచర్ల గోపన్న (1620 - 1684)
జన్మస్థలం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
బిరుదు: భక్త రామదాసు
రచనలు: దాశరథీ కీర్తనలు, దాశరథీ శతకం, దాసబోధ.
నిజాం పరిపాలకుడైన అబుల్ హసన్ తానీషా వద్ద మంత్రులైన అక్కన్న, మాదన్నల మేనల్లుడే కంచర్ల గోపన్న. ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా భూమి శిస్తులను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలతో తానీషా గోల్కొండ కోటలో రామదాసును బంధించాడు. భద్రాచలంలోని రామదాసు మండపంలో రామదాసు రాసిన 220 కీర్తనలు చెక్కబడి ఉన్నాయి. ఇతడి కీర్తనలు ‘భజన సంప్రదాయానికి’ చెందినవి. ఆనందభైరవి రాగాన్ని మొదట ఉపయోగించిన వాగ్గేయకారుడు రామదాసు. ‘రామదాసు చరిత్ర’ రచయిత సింగిరి దాసు.

గతంలో వచ్చిన ప్రశ్నలు

1. పొన్నికంటి తెలగన రాసిన అచ్చ తెలుగు కావ్యం?
1) సౌందరనందం
2) నాగానందం
3) రాజశేఖర చరిత్ర 
4) యయాతి చరిత్ర































































#Tags