భారత రాజ్యాంగ అభివృద్ధి

రాజ్యాంగం అనేది ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని తెలియజేసే ఒక మౌలిక శాసనం. ఇదే దేశ పరిపాలనా విధానానికి, రాజకీయ స్వరూపానికి మూలాధారం. రాజ్యాంగం భావన, సర్వోన్నతి గురించి మొదటగా అరిస్టాటిల్ శాస్త్రీయంగా వివరించారు. ఈయనను రాజకీయశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. రాజ్యాధికారాన్ని నియంత్రించి, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటం రాజ్యాంగం ప్రధాన కర్తవ్యం.
భారత రాజ్యాంగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎందరో ప్రముఖుల ఆలోచనలు, నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విదేశీ రాజ్యాంగాల ఆధారంగా మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అనేక బ్రిటిష్ చట్టాలు కూడా దీని నిర్మాణంపై ప్రభావం చూపాయి. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాణానికి ఆధారమైన వివిధ చట్టాలు, వాటి నుంచి గ్రహించిన అంశాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

1773 రెగ్యులేటింగ్ చట్టం
ఈస్టిండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధీకరిస్తూ ఈ చట్టాన్ని చేశారు. దీని ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని ఏర్పాటు చేసి, మొదటి గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్ ను నియమించారు. సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించారు. 1774లో ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.

1784 పిట్ ఇండియా చట్టం
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరిస్తూ దీన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ విధానాన్ని ఏర్పాటు చేసి,ద్వంద్వ పాలనకు నాంది పలికారు. కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించారు.

1793 చార్టర్ చట్టం
గవర్నర్ జనరల్ అధికారాలను విస్తృతం చేశారు. కంపెనీ ఉద్యోగులకు భారతదేశ ఆదాయం నుంచి జీతభత్యాలు చెల్లించడం ప్రారంభించారు.

1813 చార్టర్ చట్టం
భారతదేశంలో విద్యాపరమైన అధ్యయనం కోసం బడ్జెట్‌లో లక్ష రూపాయలు కేటాయించారు. క్రిస్టియన్ మిషనరీలకు భారతదేశంలో ప్రవేశం కల్పించారు. వ్యాపారం చేసుకునేందుకు మరికొన్ని సంస్థలకు అవకాశం ఇచ్చారు.

1833 చార్టర్ చట్టం
బెంగాల్ గవర్నర్ జనరల్‌ను ఇండియన్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్‌గా విలియం బెంటింక్‌ను నియమించారు. శాసనాలను క్రోడీకరించడానికి లార్డ్ మెకాలె అధ్యక్షతన మొదటి ‘లా’ కమిషన్‌ను నియమించారు. ఇది రూపొందించిన సీపీసీ 1859 నుంచి, ఐపీసీ 1860 నుంచి, సీఆర్‌పీసీ 1861 నుంచి అమల్లోకి వచ్చాయి.

1853 - చార్టర్ చట్టం
దీని ఆధారంగా సివిల్ సర్వీసుల నియామకాల్లో బహిరంగ పోటీ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు.

1858 - విక్టోరియా మహారాణి ప్రకటన (భారత రాజ్యాంగ చట్టం)
1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. దీని ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను ‘వైస్రాయ్ ఆఫ్ ఇండియా’ గా మార్చి, మొదటి వైస్రాయ్‌గా లార్డ్ కానింగ్‌ను నియమించారు. బ్రిటిష్ మహారాణి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది. భారత రాజ్య కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శిగా చార్లెస్ ఉడ్‌ను నియమించారు. ద్వంద్వ పాలన విధానాన్ని రద్దు చేశారు.

1861- కౌన్సిల్ చట్టం
పరిపాలన సౌలభ్యం కోసం పోర్టుపోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. వైస్రాయ్‌కి అవసరాన్ని బట్టి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే, ఆర్డినెన్స్ లను జారీ చేసే అధికారాలను కల్పించారు.

1892- కౌన్సిల్ చట్టం
1861 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సరిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి లోనై దీన్ని రూపొందించారు. కేంద్ర శాసన సభలో అనధికార సభ్యుల సంఖ్య 10 నుంచి 16కు మధ్య, రాష్ర్ట శాసనసభలో 8 నుంచి 20 మధ్య నిర్ణయించారు. బడ్జెట్‌పై చర్చించే అధికారం కల్పించారు. కొన్ని అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారు.

1909 మింటో- మార్లే సంస్కరణల చట్టం
1892 చట్టంలోని లోపాలను సరిచేస్తూ, మితవాదులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ చట్టాన్ని చేశారు. దీని ద్వారా కేంద్ర, రాష్ర్ట శాసన మండళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలోకి ఒక భారతీయుడిని సభ్యునిగా తీసుకున్నారు. కేంద్ర, రాష్ర్ట శాసనమండళ్లలో కొన్ని పరిమిత అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించారు. శాసన మండళ్లకు పోటీచేసే అభ్యర్థులకు అర్హతలను నిర్ణయించారు.

1919 మాంటేగ్-ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం
ఈ చట్టం భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వానికి పునాదులు వేసింది. దీని ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ర్ట బడ్జెట్‌ను వేరు చేశారు. సిక్కులకు మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. పోటీ పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను; ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు.

1935 భారత ప్రభుత్వ చట్టం
లార్డ్ లిన్ లిత్‌గో నేతృత్వంలో ప్రకటించిన శ్వేతపత్రం ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇది అతిపెద్ద చట్టం. దీంట్లో 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి. ఈ చట్టమే మన రాజ్యాంగానికి మూలాధారం.

 ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ముఖ్యాంశాలు:
 1. పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం
 2. కేంద్రంలో ద్వంద్వ పాలన
 3. సమాఖ్య ప్రభుత్వం
 4. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన (కేంద్ర జాబితా 59 అంశాలు, రాష్ర్ట జాబితా - 54 అంశాలు, ఉమ్మడి జాబితా-36 అంశాలు)
 5. 6 రాష్ట్రాల్లో (అప్పటివరకు ఉన్న మొత్తం రాష్ట్రాల సంఖ్య 11) ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
 6. షెడ్యూల్  కులాలవారికి ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించారు.
 7. ఓటు హక్కును విస్తృతపరిచి, 10 శాతం జనాభాకు ఓటు హక్కు కల్పించారు.
 8. ఇండియా నుంచి బర్మాను వేరు చేశారు.
 9. ఆర్థిక అంశాలను క్రమబద్ధీకరించడానికి రిజర్వు బ్యాంక్‌ను స్థాపించారు.
 10. అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు చేశారు.
 
1939లో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌తోపాటు భారత్ కూడా పాల్గొంటుందని ప్రకటించగా భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 1940లో ఆగస్టు ప్రతిపాదన చేశారు. దీనిపైనా తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో 1942 క్రిప్స్ ప్రతిపాదనలు వెలువడ్డాయి. ఇది కూడా భారతీయుల ఆగ్రహానికి గురైంది.

వేవెల్ ప్రకటన- 1945
దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు మినహా మిగిలిన అన్ని అంశాలపై అధికారాలను భారతీయులకు బదిలీ చేస్తామని, బ్రిటిషర్ల ప్రయోజనాలను కాపాడేందుకు హై కమిషనర్‌ను నియమిస్తామని పేర్కొన్నారు. వైస్రాయ్ కార్య నిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని ప్రకటించారు.

1946- క్యాబినెట్ మిషన్
బ్రిటన్ ప్రధాని అట్లి ప్రకటన మేరకు 1946 మార్చిలో ముగ్గురు సభ్యులతో ‘క్యాబినెట్ మిషన్’ను ఏర్పాటు చేశారు. దీని సిఫారసుల ఆధారంగా 1946 నవంబర్‌లో రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ఇది సుమారుగా మూడేళ్లు శ్రమించి భారత రాజ్యాంగాన్ని నిర్మించింది.
























#Tags