APPSC/TSPSC: గ్రూప్‌–1, గ్రూప్‌–2లలో ఇంగ్లిష్‌ ప్రాధాన్యం... పట్టు సాధించండిలా!

APPSC/TSPSC Groups English language for Competitive Exams and Reference Books

గ్రూప్‌–1 సర్వీసెస్‌.. మెయిన్‌ ఎగ్జామినేషన్‌.. గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో నిర్వహించే నిర్ణయాత్మక రాత పరీక్ష! ఏపీలో అయిదు పేపర్లుగా.. తెలంగాణలో ఆరు పేపర్లుగా.. గ్రూప్‌ 1 మెయిన్‌ నిర్వహిస్తున్నారు. ఈ పేపర్లకు అదనంగా.. అభ్యర్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన లాంగ్వేజ్‌ పేపర్‌.. ఇంగ్లిష్‌! ఈ పేపర్‌లో.. నిర్దిష్ట శాతంతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలా ఉత్తీర్ణత సాధిస్తేనే.. మెయిన్‌ ఎగ్జామ్‌లోని మిగతా పేపర్లలోని మార్కులను గణించి.. తుది విజేతలను ప్రకటిస్తారు మరోవైపు..గ్రూప్‌–2లోనూ బేసిక్‌ ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు! ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–1, గ్రూప్‌–2లలో ఇంగ్లిష్‌ ప్రాధాన్యం, ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం...

  • గ్రూప్‌–1 మెయిన్‌లో అర్హత పేపర్లుగా ఇంగ్లిష్, తెలుగు
  • వీటిలో కనీస అర్హత మార్కులు సాధించాలనే నిబంధన
  • గ్రూప్‌–2లోనూ ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు వస్తున్న వైనం
  • అభ్యర్థులు నిర్లక్ష్యం చేయకూడదంటున్న సబ్జెక్ట్‌ నిపుణులు

     
  • ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌–1 మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో అర్హత పేపర్లుగా ఇంగ్లిష్, తెలుగు పేపర్లు ఉంటాయి. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షల్లో అర్హత పరీక్షగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ ఉంటుంది. 150 మార్కులకు నిర్వహించే ఈ పేపర్‌లోనూ.. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులతో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. అంటే.. లాంగ్వేజ్‌ పేపర్లలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 60 మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 52.5 మార్కులు కచ్చితంగా సాధించాల్సిందే. అప్పుడే మిగతా పేపర్లలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. 
  • అర్హత పేపర్లుగా నిర్దేశించిన ఇంగ్లిష్, తెలుగు లాంగ్వేజ్‌ పేపర్లలో పొందిన మార్కులను మెరిట్‌ జాబితా రూపకల్పనలో కలపరు. కానీ ఈ పేపర్లలో నిర్దిష్ట మార్కులు పొందితేనే మిగతా పేపర్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 
  • గ్రూప్‌–1 మెయిన్స్‌లో లాంగ్వేజ్‌ పేపర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలిపే నిబంధనలివి. 
  • ఇక గ్రూప్‌–2లోనూ ఇంగ్లిష్‌కు సంబంధించిన నైపుణ్యాన్ని పరిశీలించే విధంగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో పది ప్రశ్నల వరకు అడుగుతున్నారు.
  • అభ్యర్థులు ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ విషయంలో ఎక్కువ ఆందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు, తెలుగు మీడియం నేపథ్యం ఉన్న వారిలో ఈ సమస్య కొంత ఎక్కువే. కొద్దిపాటి మెళకువలతో ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ పేపర్‌లో రాణించొచ్చని, కనీస అర్హత మార్కులు సొంతం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.


చ‌ద‌వండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​ 

గ్రామర్‌తో మొదలు

  • లాంగ్వేజ్‌ పేపర్ల విషయంలో ముఖ్యంగా ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ పరంగా అభ్యర్థులు ప్రధానంగా దృష్టిపెట్టి పట్టు సాధించాల్సిన అంశం.. గ్రామర్‌. ఎందుకంటే.. పరీక్షలో ప్రశ్నలు నేరుగా గ్రామర్‌ నుంచి అడుగుతారు. అదే విధంగా గ్రామర్‌పై పట్టుతోనే సమాధానం ఇవ్వగలిగే విధంగా అడిగే ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు, వాక్య నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 
  • జనరల్‌ ఇంగ్లిష్‌.. ఇందులో గ్రామర్‌కు సంబంధించి నౌన్స్‌(నామవాచకం) మొదలు ఫ్రేజల్‌ వెర్బ్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్‌ టెన్సెస్, రీ–రైటింగ్, డైరెక్ట్‌ అండ్‌ ఇండైరెక్ట్‌ స్పీచ్, కాంప్రహెన్షన్, ప్రెసిస్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్‌ వంటి అంశాలు ఉంటున్నాయి. అభ్యర్థులు ముందుగా గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా కాంప్రహెన్షన్‌ను మెరుగుపరచుకోవాలి.

ఈ విధానాలు తప్పనిసరి

  • ఇంగ్లిష్‌కు సంబంధించి ప్రిపరేషన్‌ సాగించే విషయంలో అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అవి..
    • బేసిక్‌ గ్రామర్‌ బుక్స్‌ చదివి అవగాహన ఏర్పరచుకోవాలి.
    • వొకాబ్యులరీని పెంచుకోవాలి.ప్రతి రోజు కొన్ని కొత్త పదాల అర్థాలను నేర్చుకోవాలి.
    • పజిల్స్‌ను పూర్తి చేయడం కూడా లాభిస్తుంది.
    • కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, యాంటానిమ్స్‌ను ఔపోసన పట్టాలి. 
    • టెన్సెస్,సబ్జెక్ట్‌+వెర్బ్‌ అగ్రిమెంట్,పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌లపై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. 
    • ఆ తర్వాత సెంటెన్స్‌ ఫార్మేషన్, సెంటెన్స్‌ కరెక్షన్‌లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. 
    • అకడమిక్‌ స్థాయిలో సెకండ్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌ చదివిన వారికిది సులభమే.

కాంప్రహెన్షన్‌ కీలకంగా

  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో పట్టు సాధించేందుకు కాంప్రహెన్షన్‌ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. కారణం.. పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలు ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలుగా, లేదా లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ విధానంలో ఉండటమే. అభ్యర్థులు కాంప్రహెన్షన్‌లో పట్టు సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పదాలను సందర్భానికి తగినట్లుగా వినియోగించే దృక్పథం, అవగాహన ఉండాలి. 
  • ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు.. సామాజిక,రాజకీయ, శాస్త్రీయ సంబంధంగా నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనలకు సంబంధించినవే ఉంటున్నాయి. బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన, సబ్జెక్ట్‌+వెర్బ్‌ అగ్రిమెంట్‌పై అవగాహనతో సులువుగానే సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.


చ‌ద‌వండి: APPSC, TSPSC గ్రూప్స్ లో Mental Ability నుంచి 16-20 ప్రశ్నలు... టాప్‌ స్కోర్‌ సాధించడమెలా?

ఈ నైపుణ్యాలతో మెరుగ్గా

  • కాంప్రహెన్షన్‌కు సంబంధించి పైన పేర్కొన్న ప్రాథమిక నియమాలను పాటిస్తూనే.. వేగంగా చదివే నైపుణ్యం; కచ్చితమైన సమాచారాన్ని గుర్తించడం; వాక్య నిర్మాణ శైలిని అవగాహన చేసుకోవడం; ఇచ్చిన విషయానికి సంబంధించి మినహాయింపులు; సారాంశాన్ని గుర్తించడం; డీ కోడింగ్‌ చేసే నైపుణ్యాలతో ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. 
  • ప్రతి రోజు ప్రామాణిక ఇంగ్లిష్‌ దినపత్రికను చదవడం,అందులోని ఎడిటోరియల్స్‌ చదివి సారాంశాన్ని సొంతంగా రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. వాటిలో వినియోగిస్తున్న పదజాలంపై అవగాహన పొందాలి. 

ప్రిపరేషన్‌ సమయంలో.. ఇలా

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు గ్రామర్‌పై పట్టుతో పాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అడుగులు వేయాలి. ఏదైనా ఒక అంశాన్ని చదివినప్పుడు ముందుగా తమకు అనువైన రీతిలో సారాంశాన్ని రాసుకోవాలి. దాన్ని అవగాహన చేసుకుంటూ అందులోని ముఖ్యాంశాలను, ‘కీ’లక పదాలను నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. దీనివల్ల సంబంధిత అంశంలోని మూల భావనలను గుర్తించే లక్షణం అలవడుతుంది. ఫలితంగా పరీక్ష సమయంలో సులభంగా రాణించవచ్చు. 

చ‌ద‌వండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

అనువాద పరిజ్ఞానం

  • లాంగ్వేజ్‌ పేపర్ల విషయంలో అభ్యర్థులు పట్టు సాధించాల్సిన మరో విభాగం.. అనువాదం. రెండు లాంగ్వేజ్‌ పేపర్లలోనూ నిర్దిష్టంగా ఒక ప్యాసేజ్‌ లేదా ఒక ఎస్సేను ఇచ్చి.. దాన్ని అనువాదం చేయమని అడుగుతారు. 
  • అనువాదంలో రాణించేందుకు అభ్యర్థులు.. ఇంగ్లిష్‌కు సంబంధించి వొకాబ్యులరీ,రీడింగ్‌ కాంప్రహెన్షన్,సినానిమ్స్‌పై పట్టు సాధించాలి. ఇదే విధానాన్ని తెలుగు విషయంలోనూ అనుసరించాలి.
  • ప్రిపరేషన్‌ సమయంలో ప్రామాణిక మెటీరియల్‌ ఆధారంగా స్వీయ అనువాదాన్ని ప్రాక్టీస్‌ చేయాలి. ఇందుకోసం ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఇంగ్లిష్‌ దిన పత్రికలో వచ్చిన వ్యాసం లేదా వార్తను.. అదే అంశానికి సంబంధించి తెలుగులో ప్రచురితమైన వ్యాసాన్ని తులనాత్మక పరిశీలన చేస్తూ ప్రాక్టీస్‌ చేయడం ఉపకరిస్తుంది.

ఇడియమ్స్, ఫ్రేజెస్‌పై ప్రత్యేక దృష్టి

ఇంగ్లిష్‌లోనే అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన మరో రెండు అంశాలు.. ఇడియమ్స్‌(జాతీయాలు), ఫ్రేజెస్‌(పద బంధాలు). పలు సందర్భాల్లో నేరుగా ఏదైనా ఒక ఇడియమ్‌ను (ఉదా: A piece of cake, Miss the boat వంటివి). సాధారణంగా కొన్ని సార్లు ఇలాంటి ఇడియమ్స్‌ను ప్యాసేజ్‌లలోనే కూర్చి.. దాని కింద అడిగే ప్రశ్నల్లో సదరు ప్యాపేజ్‌లో పేర్కొన్న ఇడియమ్‌కు సందర్భానుసార అర్థం ఏంటి అని అడుగుతారు. లేదా మరికొన్ని సందర్భాల్లో నేరుగా ఒక ఇడియమన్‌ను ఇచ్చి.. దానికి అర్థం ఏంటని నేరుగా అడుగుతారు. కాబట్టి ఇడియమ్స్‌పైనా పట్టు సాధించడం ఎంతో అవసరం.

లెటర్‌ రైటింగ్‌

  • లాంగ్వేజ్‌ పేపర్ల విషయంలో లెటర్‌ రైటింగ్‌ కూడా ఎంతో కీలకంగా నిలుస్తోంది. అభ్యర్థులు పర్సనల్, అఫిషియల్, బిజినెస్‌ లెటర్లను రాసే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. లెటర్‌ రైటింగ్‌ విషయంలో పంక్చుయేషన్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. లెటర్‌ ఫార్మట్‌లపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ విధానాన్ని తెలుగు, ఇంగ్లిష్‌ రెండు భాషల్లోని లెటర్‌ రైటింగ్‌ విషయంలో అనుసరించాలి.
  • మొత్తం మీద ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్‌లో కనీస అర్హత మార్కులు సాధించాలంటే..అభ్యర్థులు గ్రామర్‌ మొదలు అన్ని అంశాలను తెలుసుకోవాలి.

హైస్కూల్‌ స్థాయి బుక్స్‌

  • గ్రూప్‌–1లో ఇంగ్లిష్‌ పేపర్‌లో రాణించడానికి అభ్యర్థులు ముందుగా హైస్కూల్‌ స్థాయి ఇంగ్లిష్‌ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల బేసిక్‌ గ్రామర్‌ అంశాల పునరావలోకనానికి వీలు కలుగుతుంది. అదే విధంగా ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్‌ వంటి విషయాల్లోనూ నిర్దిష్ట నమూనాలు, పంక్చుయేషన్స్‌ తదితర అంశాలపై అవగాహన లభిస్తుంది. పదోతరగతి స్థాయి పుస్తకాల అభ్యసనం ఫలితంగా వొకాబ్యులరీ కూడా పెంచుకునే అవకాశం లభిస్తుంది.
  • ఇలా పాఠ్య పుస్తకాల అభ్యసనం పూర్తి చేసుకున్న తర్వాత.. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రచురితమైన ఇంగ్లిష్‌ బుక్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. దీనివల్ల పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల తీరుపై అవగాహన లభిస్తుంది.

పట్టు సాధించాల్సిన అంశాలు

  • బేసిక్‌ గ్రామర్, ఫ్రేజెస్, ఫ్రేజల్‌ వెర్బ్స్, ఇడియమ్స్‌ అండ్‌ మీనింగ్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, ప్రిఫిక్స్, సఫిక్స్‌ సెంటెన్సెస్‌.

గ్రూప్స్‌ ఎగ్జామ్స్‌.. ఇంగ్లిష్‌ ముఖ్యాంశాలు

  • గ్రూప్‌1 మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌లో అర్హత పేపర్‌గా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్‌.
  • బేసిక్‌ గ్రామర్‌పై అవగాహనతో సులభంగా పునరావలోకనం చేసుకునే అవకాశం.
  • ట్రాన్స్‌లేషన్, లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ల్లో నేర్పుతో కనీసం 40 మార్కులు సాధించొచ్చు. 
  • బేసిక్‌ గ్రామర్‌పై పట్టుతో మరో 30 నుంచి 40 మార్కులు పొందే వీలుంటుంది. 
  • గ్రూప్‌–2లోనూ ఇంగ్లిష్‌ గ్రామర్‌ ఆధారిత ప్రశ్నలు.
  • ఇంగ్లిష్‌ దిన పత్రికలు చదవడం వల్ల కాంప్రహెన్షన్‌లో పట్టు సాధించే అవకాశం.


గ్రూప్‌–1 ఇంగ్లిష్‌.. రిఫరెన్స్‌ బుక్స్‌

  • Tips and techniques in English for competitive exams - Disha experts
  • General English for all competitive exams - S.C.Gupta
  • English grammar & Composition - S.C.Gupta
  • Objective English for competitive examination - Uma sinha

నో టెన్షన్‌.. కానీ

ఇంగ్లిష్‌ విషయంలో అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవనక్కర్లేదు. కానీ ఇదే సమయంలో కనీస అర్హత మార్కులు సాధించే విధంగా కసరత్తు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సీశాట్, క్యాట్‌ వంటి పరీక్షల పాత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. ఫలితంగా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నైపుణ్యాలు లభిస్తాయి. అదే విధంగా అభ్యర్థులు తప్పనిసరిగా ఇంగ్లిష్‌ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. దీని ఫలితంగా ఎస్సే రైటింగ్, ప్రెసిస్‌ రైటింగ్‌ వంటి నైపుణ్యాలు మెరుగవుతాయి.
–అరవింద్, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ 

చ‌ద‌వండి: APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!

#Tags