TGPSC Chairman: కమిషన్‌పై నిరుద్యోగుల్లో విశ్వసనీయత.. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ఇలా..
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కల్పన ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జాప్యం లేకుండా నిర్దేశించిన షెడ్యూల్‌కు అనుగుణంగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్‌ను యథాతథంగా అమలు చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియతో జాబ్ క్యాలెండర్ ప్రకా రం నోటిఫికేషన్ల జారీలో జాప్యం నెలకొందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామనే మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దొని నిరుద్యోగులకు ఆయన సూచించారు. అలాంటి మోసాలపై ఫిర్యాదులకు ప్రత్యేక నంబర్, మెయిల్ ఐడీని కేటాయిస్తామని చెప్పారు. కమిషన్ నూతన చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...
మరిన్ని పోస్టుల భర్తీ
ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఇప్పటికే 54 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. మరిన్ని పోస్టుల భర్తీకి కసరత్తు కొనసాగుతోంది. టీజీపీఎస్సీపై నిరుద్యోగులకు మరింత నమ్మకాన్ని కల్పించే బాధ్యత తీసుకున్నా. నిరుద్యోగులకు వేగంగా ఉద్యోగాల కల్పనేపైనే దృష్టి పెడతా.
యూపీఎస్సీ నమూనాను అనుసరిస్తాం...
అతిత్వరలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వద్దకు వెళ్లి అక్కడ అనుసరిస్తున్న విధానాలు టీజీపీఎస్సీలోనూ అమలయ్యేలా చూస్తా. యూపీఎస్సీపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు లేవు. యూపీఎస్సీ కంటే మంచిపేరు టీజీపీఎస్సీకి తెచ్చేందుకు కృషి చేస్తా. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో నియామక సంస్థలు సమర్థంగా పనిచేయడంతోనే వేగంగా ఉద్యోగం లభించింది. ఇప్పుడు టీజీపీఎస్సీ కూడా అదే తరహాలో పనిచేసేలా చర్యలు తీసుకుంటా.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
షెడ్యూల్ ప్రకారం పరీక్షలు...
గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి ఫలితాల ప్రకటన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. మిగిలిన గ్రూప్స్ పరీక్షల నిర్వహణను కూడా సకాలంలో పూర్తి చేస్తాం. వేగంగా ఫలితాలు ప్రకటిస్తాం. అభ్యర్థులకు పరీక్షలు వాయిదా పడతాయనే ఆందోళన వద్దు. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా పనిచేస్తా. యువకుడిగా ఉన్నప్పుడు ఉద్యోగం సాధించాలనే కలను నేను ఎలా సాకారం చేసుకున్నానో... ఇప్పటి యువత కలలను కూడా అదేవిధంగా సాకారం చేసే దిశగా బాటలు వేస్తా.
మధ్యవర్తులను నమ్మొద్దు...
కమిషన్‌లో ఉన్నతాధికారులు తెలుసంటూ నమ్మబలికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగలపై వల వేసే దళారులను అస్సలు నమ్మొద్దు. అలాంటి వ్యక్తులు మీకు తారసపడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా కమిషన్‌కు ఫిర్యాదు చేయండి.