Deepthi Jeevanji: దీప్తి జివాంజీకి రూ.కోటి నగదు.. గ్రూప్‌–2 ఉద్యోగం

సాక్షి, హైదరాబాద్‌/పర్వతగిరి: వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన అథ్లెట్‌ దీప్తి జివాంజీ పారిస్‌ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8న‌ హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. దీప్తిని అభినందిస్తూ రూ.కోటి నగదుతో పాటు గ్రూప్‌–2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం, దీప్తి కోచ్‌కు రూ.10 లక్షల నజరానా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు కల్లెడ గ్రామస్తులు తెలిపారు.

అంతే కాకుండా పారా గేమ్స్‌ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. కార్యక్రమంలో శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, ఎంపీ బలరాంనాయక్, దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి, కోచ్‌ నాగపురి రమేశ్, అథ్లెట్‌ మృదుల, కాంగ్రెస్‌ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి శేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: Deepthi Jeevanji: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్ ఈమెనే..

బీఆర్‌ఎస్‌ పాలనలో క్రీడాకారులను అణచివేశారు: ముత్తినేని 

బీఆర్‌ఎస్‌ పాలనలో క్రీడాకారులను అణచివేశారని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, పారా ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచిన దీప్తి జివాంజీకి రూ.కోటితో పాటు 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్‌–2 స్థాయి ఉద్యోగం, కోచ్‌కు రూ.10 లక్షలు కేటాయించడం చారిత్రక నిర్ణయమన్నారు. సీఎంతో పాటు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్కకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి: World Para Championships: శభాష్‌ దీప్తి.. పేదరికం నుంచి పైకెగసిన‌ తెలంగాణ అమ్మాయి.!

#Tags