Intermediate Exams 2024: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు రేపటినుంచి ప్రారంభం

Intermediate Exams 2024: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు రేపటినుంచి ప్రారంభం
Intermediate Exams 2024 ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు రేపటినుంచి ప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లాలో ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల నిఘా నడుమ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 3,925మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

జిల్లాలో 35 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. 5 ప్రభుత్వ జూనియర్‌, 6 మోడల్‌ జూనియర్‌, 5 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, 2 ట్రైబల్‌ వెల్ఫేర్‌ హాస్టల్స్‌, 10 కేజీబీవీ, 2 సోషల్‌ వెల్ఫేర్‌, 1 మైనారిటీ, 4 బీసీ వెల్ఫేర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 3,925మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పరీక్షలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 16వ తేదీతో ముగియనున్నారు. ఈ నెల 28వ తేదీన మొదట ప్రథమ, 29వ తేదీన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకొని నేరుగా పరీక్ష సెంటర్‌కు రావచ్చు. విద్యార్థులు హాల్‌టికెట్‌, పెన్నులు, ప్యాడ్‌ మినహాయించి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సెల్‌ఫోన్‌ అనుమతి లేదు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పాత పద్ధతిలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు.

సిబ్బంది నియామకం

పరీక్షల నిర్వహణ కోసం దాదాపు 130 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షల పర్వవేక్షణ కోసం 8 పరీక్ష కేంద్రాల్లో 16మంది సీఎస్‌, డీఓలు, మాస్‌కాపీయింగ్‌, మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా చూసేందుకు రెండు ప్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు, ఒక టీమ్‌ సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద గొడవలు, జనసందోహం లేకుండా చూసేందుకు పోలీసు సిబ్బందిని కూడా నియమించనున్నారు.

ప్రత్యేక బస్సులు ఏర్పాటు..

పరీక్ష సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ అధికారులు పరీక్ష సమయానికి అనుగుణంగా ఉదయం, మధ్యాహ్నం ఐదు రూట్లలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. బోర్లగూడెం, ఆజాంనగర్‌ నుంచి భూపాలపల్లికి, తాడిచర్ల నుంచి గంగారం వరకు, కృష్ణారావుపేట, సర్వాయిపేట నుంచి మహదేవపూర్‌ వరకు వేర్వేరుగా, దామెరకుంట నుంచి వేర్వేరుగా కాటారం వరకు బస్సు సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అఽధికారులు బస్సు సర్వీసులను సిద్ధంచేసినట్లు తెలిపారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు..

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్ధం జిల్లాలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. 80088 78060, 94402 83351 ఫోన్‌నంబర్లలో విద్యార్థులకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

#Tags