Inter Fees: అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు.. ఫీజుల తీరు ఇలా..
గత ఏడాదితో పోలి స్తే ఏకంగా 40–50% అదనంగా డిమాండ్ చేస్తున్నా యి. ఇటీవలే టెన్త్ పరీక్షలు మొదలైన నేపథ్యంలో.. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియట్‌లో చేర్చేందుకు కాలేజీల్లో ఆరా తీస్తున్నారు. ఇదే అదనుగా కాలేజీల యాజమాన్యాలు ఫీజు దోపిడీకి తెరతీశాయి. నిర్వహణ ఖర్చు, బోధన వ్యయం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి.
కాలేజీలు చెప్తున్న ఫీజుల మొత్తాన్ని చూసి.. తల్లిదండ్రులు హతాశులవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని.. ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీల అడ్డగోలు ఫీజు వ్యవహారంపై ఇంటర్ బోర్డు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫీజుల కట్టడిపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ప్రస్తుతం తామేమీ చేయలేమని అంటున్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
4 లక్షల మంది విద్యార్థులపై భారం
రాష్ట్రంలో ఏటా 4 లక్షల మంది వరకు విద్యార్థులు టెన్త్ పాసవుతున్నారు. గత ఏడాది గణాంకాలను చూస్తే ఇంటర్ ఫస్టియర్‌లో 3,27,202 మంది చేరారు. రాష్ట్రంలో మొత్తం 3,339 ఇంటర్ జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో ప్రైవే టువి 1,441 ఉన్నాయి. వాటిలో 2,02,903 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 2 లక్షల మందికిపైగా ప్రైవేటు కాలేజీల్లోనే ఉంటారు. వారంతా కాలేజీల యాజ మాన్యాలు చెప్పినంత ఫీజులు కట్టాల్సి న పరిస్థితి. వాస్తవానికి కరోనా మహ మ్మారి ఎఫెక్ట్ తర్వాత కాలేజీలు ఏటా 10– 20% మేర ఫీజులు పెంచుతున్నాయి. ఈసారి గరిష్టంగా 50% వర కూ పెంచాయి.
అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. కోవిడ్ సమయంలో కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారని, కొరత కారణంగా ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నాయి. నిర్వహణ భారం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి.
అఫిలియేషన్ ఫీజు పెంచకున్నా..
రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు మూడు కేటగిరీల కింద అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇస్తుంది. ప్రతీ విద్యాసంస్థలో గరిష్టంగా 960 మందిని చేర్చుకునేందుకు అనుమతిస్తారు.
అఫిలియేషన్ ఫీజు కింద ఏటా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలేజీల నుంచి రూ.1.20 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీల నుంచి రూ.60 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల నుంచి రూ.20వేల చొప్పున వసూలు చేస్తారు. రెండేళ్లకోసారి ఈ ఫీజులను సమీక్షించి పెంచాల్సి ఉన్నా.. ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా పెంచలేదు.
50శాతం దాకా పెంపు..
సాధారణ జూనియర్ కాలేజీల్లో గత ఏడాది వరకూ గరిష్టంగా రూ.60 వేల ఫీజు ఉంటే.. ఈసారి రూ.90 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు రూ.1.25 లక్షల నుంచి రూ. 2 లక్షలకుపైగా (కాలేజీని బట్టి) డిమాండ్ చేస్తున్నాయని.. అదే హాస్టల్‌నూ కలిపితే ఏకంగా రూ.3.25 లక్షల వరకు చెప్తున్నారని వాపోతున్నారు.
కార్పొరేట్ కాలేజీలు ఫీజులు పెంచడాన్ని చూసి.. సాధారణ కాలేజీలు కూడా పెంచుతున్నాయని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల పరిధిలోనూ వార్షిక ఫీజులను రూ.75 వేలకు తక్కువ వసూలు చేయడం లేదని అంటున్నారు. మరోవైపు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కుల ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 20శాతం మేర పెరిగాయని.. ప్రైవేటు కాలేజీల రవాణా, ఆటో చార్జీలు కూడా 30శాతం వరకూ పెంచారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దీంతో ఇంటర్మీడియట్ విద్య కోసమే రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు.
అంత ఫీజు ఎలా కట్టగలం?
ఇటీవల టెన్త్ పరీక్షలు రాసిన మా అబ్బాయిని చేర్పించాలంటూ ఓ ప్రైవేటు కాలేజీ సిబ్బంది వెంటపడ్డారు. అడ్మిషన్ కోసం వెళ్తే ఏటా రూ.2.25 లక్షల ఫీజు అని చెప్పారు. కావాలంటే ఓ రూ.25 వేలు రాయితీ ఇస్తామన్నారు. అంత ఫీజేమిటని అడిగితే ఈ ఏడాది ఖర్చులు పెరిగాయని, అందుకే ఫీజులు పెంచామని చెప్పారు. రెండేళ్లకు రూ.4 లక్షల ఫీజు ఎలా కట్టగలం. వేరే కాలేజీల్లో ఆరా తీసినా అడ్డగోలుగా పెంచారు. ప్రభుత్వం నియంత్రణ చేపడితే పేదలకు ఊరటగా ఉంటుంది.
– సుచిత్ర, ఇంటర్ విద్యార్థి తల్లి, హైదరాబాద్
దోపిడీని నియంత్రించకుంటే ఆందోళన
ప్రైవేటు కాలేజీల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సర్కారు నుంచి ఏ విధమైన ఆదేశాలూ లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలు భరించలేని విధంగా కాలేజీలు ఫీజులు పెంచుతున్నాయి. తక్షణమే నియంత్రణ చేపట్టాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడతాం.
– టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
కార్పొరేట్ ఆగడాలను అడ్డుకోరా?
అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవకుండానే ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అడ్మిషన్లు చేపట్టడం చట్ట విరుద్ధం. దీనికితోడు పేదలు ఏమాత్రం భరించలేని విధంగా ఫీజులు పెంచడం దుర్మార్గం. పాలక వర్గాలు దీన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడీని అడ్డుకోవాలి.
– చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
ఫీజుల నియంత్రణ అవసరం
కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు పెంచడం వల్ల అన్ని కాలేజీలూ ఆ నింద మోయాల్సి వస్తోంది. ప్రభుత్వమే కాలేజీలను కేటగిరీలుగా విభజించి, ఫీజుల నిర్ణయం చేయాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. పేదలకు ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవడానికి ఫీజుల కట్టడి చట్టాలు అవసరం.
– గౌరీ సతీశ్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు
ఫిర్యాదులు వస్తున్నాయి.. పరిశీలిస్తున్నాం
ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నియంత్రణ కోసం ఏం చేయాలనేది పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డ్ సిద్ధంగా ఉంది.
– జయప్రదాబాయి, ఇంటర్ బోర్డ్ సీనియర్ అధికారి
ఇంటర్ ఫీజుల తీరు ఇలా.. (రూ.లలో)
కాలేజీల తరహా |
గత ఏడాది |
ఈ సంవత్సరం |
కార్పొరేట్ కాలేజీలు (డే స్కాలర్) |
1.25 లక్షలు |
2.25 లక్షలు |
కార్పొరేట్ కాలేజీలు (విత్ హాస్టల్) |
2.25 లక్షలు |
3 నుంచి 3.25 లక్షలు |
హైదరాబాద్‌లోని సాధారణ కాలేజీలు |
75 వేలు |
1.25 నుంచి 1.50 లక్షలు |
సాధారణ కాలేజీలు (విత్ హాస్టల్) |
1.25 లక్షలు |
1.50 నుంచి 1.75 లక్షలు |
మున్సిపాలిటీల్లో కాలేజీలు |
60 వేలు |
90 వేలు |
మున్సిపాలిటీల్లో (విత్ హాస్టల్) |
90 వేలు |
1.25 లక్షలు |
గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు |
40 వేలు |
60 నుంచి 70 వేలు |