Amma Adarsh ​​Schools: బడి పరిశుభ్రత బాధ్యత ‘అమ్మ’కే..!

మంచిర్యాలఅర్బన్‌: సర్కారు పాఠశాలల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్‌ హంగులతో తీర్చిదిద్దుతోంది.

మన ఊరు–మన బడితోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట పనులు సాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించకపోవడంతో పారిశుధ్య సమస్య తలెత్తుతోంది. నిత్యం తరగతి గదులు, ఆవరణ శుభ్రం చేసే పాఠశాల పారిశుధ్య కార్మికులను తొలగించడంతో ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది.

ఇదివరకు ఉపాధ్యాయుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పాఠశాలల పరిశుభ్రతకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రత్యేక నిర్వహణ గ్రాంటును మంజూరు చేస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను అమ్మ ఆదర్శ కమిటీకి అప్పగించింది. దీంతో పారిశుధ్య సమస్యలు తొలగనున్నాయి.

చదవండి: School Funds: పాఠశాలల్లో పరిశుభ్రతకు నిధులు

ప్రత్యేక నిధులు ఇలా..

ప్రభుత్వ, స్థానిక, మోడల్‌ స్కూళ్లకు ప్రత్యేకంగా విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా టాయిలెట్ల శుభ్రత, మొక్కలకు నీరు పోయడం, ఆవరణ శుభ్రత ఖర్చుల కోసం ప్రభుత్వం సౌకర్యాల నిర్వహణ గ్రాంటు(స్కూల్‌ ఫెసిలిటి మెయింటనెన్స్‌ గ్రాంటు) అందించాలని నిర్ణయించింది. సమగ్ర శిక్ష కింద అందిస్తున్న కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంటుకు అదనంగా గ్రాంటు అందించనున్నారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పది నెలలపాటు పాఠశాలల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు నిధులు విడుదలవుతాయి. జిల్లా మినరల్‌ ఫండ్‌ ట్రస్టు(డీఎంఎఫ్‌టీ) నుంచి స్కూల్‌ ఫెసిలిటి మెయింటనెన్స్‌ గ్రాంటు మంజూరు చేయనున్నారు. పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు శుభ్రం చేయడం, మూత్రశాలల క్లీనింగ్‌, మొక్కలకు నీరుపోయడం పనులు చక్కబెట్టేందుకు వీలుకు కమిటీలకు మూడు నెలల ముందుగానే డబ్బులు విడుదల చేస్తారు.

చదవండి: Teacher Jobs: గెస్ట్‌ టీచర్‌గా పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు విడుదల కానున్నాయి. జిల్లాలోని 719 పాఠశాలలకు ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయనున్నారు. 1నుంచి 30 మంది వరకు విద్యార్థులు ఉంటే రూ.3వేలు, 31నుంచి 100 మంది వరకు ఉంటే రూ.6వేలు, 101 నుంచి 250మంది వరకు విద్యార్థులకు రూ.8వేలు, 251నుంచి 500మంది వరకు రూ.12వేలు, 501 – 750 మంది వరకు రూ.15వేలు, 750పైన విద్యార్థులున్నా పాఠశాలకు రూ.20వేలు ప్రతీ నెల ఇవ్వనున్నారు. విద్యాసంవత్సరంలో 10 నెలలపాటు నిధులు చెల్లిస్తారు.

ఇదివరకు ఇలా..

కరోనాకు ముందు పాఠశాలల్లో విధులు నిర్వర్తించిన స్కావెంజర్లను కరోనా కాలం తర్వాత ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ మల్టీపర్పస్‌ సిబ్బందితో పాఠశాలలను శుభ్రపర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని చోట్ల ఆడపాదడపా పాఠశాలలను శుభ్రం చేస్తున్నా మెజార్టీ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత అంతంత మాత్రంగానే మారింది. పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది కొరత వల్ల వీలున్నప్పుడు వచ్చిన సందర్భాలు లేకపోలేదు.

ఉపాధ్యాయులు అడిగినప్పుడు మాత్రమే పంపించి శుభ్రత పనులు చేస్తున్నారు. ఊరిని ఊడ్చడం, మురుగు కాల్వలు శుభ్రం చేయడం, చెత్త సేకరణ, ఇతరత్రా పనులు చేయడానికి సమయం సరిపోవడం లేదని గ్రామాల్లో సిబ్బంది పాఠశాలలకు రాని పరిస్థితి.

దీంతో మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి దుర్వాసన వస్తుండడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. పాఠశాలకు ప్రత్యేక నిర్వహణ గ్రాంటులు మంజూరుతో పాఠశాల శుభ్రత గాడినపడే అవకాశం ఉంది.

#Tags