Admissions for Class 6th to Inter: 2024–25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకు భరోసా ఇస్తున్నారు. బాలికలు సమాజంలో ఎలా మెలగాలో అవగాహన కల్పిస్తున్నారు. విలువలను పెంపొందించుకునేలా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 22 కేజీబీవీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు ఈనెల 12 నుంచి ఏప్రిల్ 11 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. సీట్ల భర్తీలో నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వారీగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ విద్యాలయాల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించారు. విద్యార్థినులకు అత్యుత్తమ బోధనను అందుబాటులోకి తీసుకువచ్చారు.
- 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో పాటు 7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు అడ్మిషన్లు జరుగుతాయి. దరఖాస్తును హెచ్‌టీటీపీఎస్://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్ సైట్ ద్వారా పొందవచ్చు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. ఇందు కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది.
కేజీబీవీ ప్రత్యేకతలు
బాలికల్లో అత్మస్థైర్యం పెంపొందించేందుకు వారంలో రెండు రోజుల పాటు స్వీయ రక్షణ లక్ష్యంగా కరాటే తరగతులు నిర్వహిస్తారు. కేజీబీవీల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఏటా ప్రతిభా అవార్డులను గెలుచుకుంటున్నారు.
చదవండి: Free Admissions: ఒకటో తరగతిలో ప్రవేశానికి అనూహ్య స్పందన
బాలికలకు కాస్మోటిక్ కిట్స్, నాప్‌కిన్స్‌లతో పాటు రెండు జతల యూనిఫాం ప్రభుత్వం అందిస్తోంది. కేజీబీవీ పాఠశాలల్లో బాలికల భద్రత కోసం వాచ్‌మెన్ నుంచి ప్రత్యేకాధికారి వరకు అందరూ మహిళా ఉద్యోగులే ఉంటారు.
- కేజీబీవీలో 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతికి 40 సీట్ల చొప్పున కేటాయించారు.
- ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఒక్కో కేజీబీవీలో ఒక్కో గ్రూపును ప్రవేశపెట్టారు. 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు ఉంటాయి.
- ఆటలు, కరాటేలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ శిక్షణ ఇస్తారు.
- ఆరోగ్యం, నైతిక విలువలను పెంపొందించేలా వ్యక్తిత్వ వికాసం తరగతులను నిర్వహిస్తారు.
- ప్రతి కేజీబీవీలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరీక్షించేందుకు ఒక ఏఎన్‌ఎం ఉంటారు.
- విద్యలో వెనుకబడిన వారిలో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు.
- కంప్యూటర్, వ్యాయామం, ఆరోగ్యం, వృత్తి నైపుణ్య విద్యను అందించడం ద్వారా బాలికల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తారు.
- పదో తరగతి పూర్తి చేసుకున్న వారు ఉన్నత చదువులకు వెళ్లేలా ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టారు.