Tenth Exams 2024 : పదో తరగతి లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పదో తరగతి లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

మిరుదొడ్డి(దుబ్బాక): టెన్త్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని మోడల్‌ స్కూల్‌లో దుబ్బాక డివిజన్‌లోని ఐదు మండలాలకు చెందిన ఎంఈఓలు, హెడ్‌ మాస్టర్లతో కలిసి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టెన్త్‌ చదువుతున్న విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆదివారం మధ్యాహ్నం వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

Also Read : Biology Bit Bank

ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల మౌలిక వసతులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేస్తూనే వార్షిక పరీక్షల కోసం సంసిద్ధం చేయాలన్నారు. పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి ప్రతి ఉపాధ్యాయుడు అవిరళ కృషి చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలతాలను సాధించి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మిరుదొడ్డి, దుబ్బాక, అక్బర్‌పేట–ౖభూంపల్లి మండలాల ఇన్‌ఛార్జి ఎంఈఓ జోగు ప్రభుదాసు, దౌల్తాబాద్‌ ఎంఈఓ వనం నర్సవ్వ, ఐదు మండలాలకు చెందిన మండల నోడల్‌ అధికారులు ప్రవీణ్‌ బాబు, అంజయ్య, చక్రపాణి, నర్సయ్య, కనకరాజు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్‌ అఫీసర్‌ స్వర్ణ లత, మోడల్‌ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ భారతీ దేవి, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు, ఆయా మండలాలకు చెందిన ఉన్నత పాఠశాలల హెడ్‌మాస్టర్లు పాల్గొన్నారు.

#Tags