Department of Education: 25 వేల మంది ఎస్‌జీటీల బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖ చేపట్టిన టీచర్ల బది లీలు, పదోన్నతుల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

జులై 1న‌ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 25 వేల మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు (ఎస్‌జీటీలు) బదిలీ ఉత్తర్వులు అందాయి. వీరితో పాటు స్కూల్‌ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు.. అంతా కలిపి ఇప్పటివరకూ 40 వేల మందికి స్థానచలనం కలిగింది.

కొత్తగా కేటాయించిన స్థానాల్లో వీలైనంత త్వరగా చేరాలని, విద్యార్థుల బోధనకు ఇబ్బంది లేకుండా చూడాలని పాఠశాల విద్య డైరెక్టరేట్‌ కార్యాలయం టీచర్లకు సూచించింది. కాగా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించేందుకు అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వారంలో సమస్యలన్నీ పరిష్కరించాలని నిర్ణయించారు.  

చదవండి: Best Teachers: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

ఎట్టకేలకు కొలిక్కి.. 

టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం కోర్టు వివాదాలు, ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలతో కొన్నేళ్లుగా జటిలంగా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత 317 జీవో అమలు సందర్భంగానూ ఈ వ్యవహారం అనేక సమస్యలకు దారి తీసింది.

సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జూనియర్లు దూర ప్రాంతాలకు వెళ్లారని, భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తమైంది. కాగా ప్రస్తుతం ఇవన్నీ కొలిక్కి వచ్చినట్టేనని అధికారులు చెబుతుండగా, మరోవైపు బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.  

చదవండి: Teaching Jobs: రండి.. బోధించండి

సమస్యలేంటి? 

స్కూల్‌ అసిస్టెంట్లు వివిధ సబ్జెక్టులకు బోధించే అర్హత ఉండటంతో అన్నింటికీ ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఒక్కదాంట్లోనే ప్రమోట్‌ చేయాలి. ఉదాహర ణకు సైన్స్, మేథ్స్‌ రెండు ప్రమోషన్లు వచ్చిన వ్యక్తి ఏదో ఒక దాంట్లోనే చేరతారు. దీంతో ఒక పోస్టు ఖాళీ అవుతుంది.

18,942 మందికి ప్రమోషన్లు ఇస్తే ప్రస్తుతం 17 వేల మంది విధుల్లో చేరారు. దీంతో మిగతా దాదాపు 2 వేల మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వివిధ మండలాల్లో ఒకే ఊరు పేరుతో ఉన్న స్కూళ్ళు ఉండటంతో ఆన్‌లైన్‌లో సమస్యలు వచ్చాయి. వీటిని సరి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వారం రోజుల్లో సమస్యల పరిష్కార ప్రక్రియ పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

ఖాళీలపై దృష్టి 

అన్ని స్థాయిల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు ముగియడంతో పాఠశాల విద్యాశాఖలో వాస్తవ ఖాళీలపై అధికారులు దృష్టి పెట్టారు. స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య, అవసరమైన టీచర్ల లెక్కతో హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన మేరకు కొన్ని బదిలీలు చేసే ఆలోచనలో ఉంది. విద్యార్థులు లేని స్కూళ్ళల్లో ఎక్కువగా ఉన్న టీచర్లను.. విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్ళకు బదిలీ చేసే అవకాశం ఉంది.

అయితే ఇందుకోసం క్షేత్రస్థాయిలో టీచర్‌ పోస్టుల ఖాళీలు గుర్తించాల్సి ఉంటుంది. మల్టీజోన్‌–1, జోన్‌–2 పరిధిలో దాదాపు 11 వేల మంది ఎస్‌జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. దీంతో ఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే విధంగా 2 వేల మంది స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించారు. హెచ్‌ఎంల పదోన్నతులతో కూడా కలుపుకుంటే మొత్తం 18,942 మందికి ప్రమోషన్లు దక్కాయి. ఈ ఏడాది చివరి నాటికి రిటైర్‌ అయ్యే టీచర్లను కలుపుకుంటే దాదాపు 21 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

#Tags