IT Employees Layoff: 800 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ టెక్‌ దిగ్గజం

EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్‌ కేంద్రంగా ఉన్న ఎక్సెల్‌ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్‌ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది.

ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్‌ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్‌ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది.

వారిపై తీవ్ర ప్రభావం
కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్‌, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది.  ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో  పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. 

ఎక్సెల్‌ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు.

కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

#Tags