Jagananna Vidya Kanuka: బడి తెరిచేలోపే విద్యాకానుక

Jagananna Vidya Kanuka

● సిద్ధమవుతున్న జగనన్న

విద్యా కానుక కిట్లు

● ఐదో విడత పంపిణీకి రంగం సిద్ధం

● 1.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

● జిల్లాకు 9.40 లక్షల పుస్తకాల అవసరం

సాక్షి, రాజమహేంద్రవరం: పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ చెబుతూ ఉంటారు. విద్యతోనే ప్రతి ఒక్కరికీ సమాజంలో గుర్తింపు లభిస్తుందని నమ్మి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ చదువులకు నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులు దూరం కాకూడదన్నదే ఆయన ఆశయం. ఇందుకు అనుగుణంగానే విద్యా రంగంలో సమూల మార్పులకు నాంది పలికారు. మన బడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా, వసతి దీవెన వంటి వినూత్న కార్యక్రమాలతో పేద విద్యార్థుల చదువులకు అండగా నిలిచారు.

సామాన్యులపై భారం పడకుండా..

ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులే అత్యధికంగా చదువుతూంటారు. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకునేలా శ్రమ పడుతూ మరీ తమ పిల్లలను బడికి పంపుతూంటారు. అటువంటి తల్లిదండ్రులకు విద్యా సంవత్సరం ఆరంభంలో తమ బిడ్డల చదువులకు అవసరమయ్యే పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి కొనుగోలు చేయడం తలకు మించిన భారమే అవుతుంది. వారిపై ఆ భారం పడకుండా ఉండేందుకే సీఎం వైఎస్‌ జగన్‌ జగనన్న విద్యాకానుక పథకానికి రూపకల్పన చేశారు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు తదితర సామగ్రితో జగనన్న విద్యాకానుక పేరిట ఏటా కానుక అందిస్తున్నారు. పాఠశాలలు తెరవక ముందే వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. బడి గంట మోగిన వెంటనే విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ నిరాటంకంగా జరిగింది. అదేవిధంగా ఐదో విడత కూడా జగనన్న విద్యా కానుక కిట్లను విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా సిద్ధం చేసేందుకు విద్యా శాఖ అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

ముందస్తుగా రెడీ

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా అసౌకర్యానికీ గురి కాకూడదనే తలంపుతో 2024–25 విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యా కానుక కిట్లు ముందస్తుగా సిద్ధం చేసింది. జిల్లాకు అవసరమైన పుస్తకాలు, బూట్లు, బెల్టులు తదితర సామగ్రి ఇండెంట్‌ తీసుకుని, వాటి సరఫరాకు చర్యలు తీసుకుంది. ఫలితంగా ఆయా మండలాల్లోని స్టాక్‌ పాయింట్లకు జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని గోదాముకు నోట్‌ బుక్స్‌ రావడం ఏప్రిల్‌లోనే మొదలైంది. వచ్చే నెల మొదటి వారానికి ఈ సామగ్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా 986 ప్రభుత్వ పాఠశాలల్లో 1,03,422 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో బాలురు 49,348, బాలికలు 54,074 మంది ఉన్నారు. వీరికి ఒకటి నుంచి పదో తరగతి వరకూ అన్ని టైటిల్స్‌ కలిపి 9,40,985 పాఠ్య పుస్తకాల ఆవశ్యకత ఉంది. ఇప్పటికే మండలాల్లోని స్టాక్‌ పాయింట్లకు 5,77,901 పాఠ్య పుస్తకాలు సరఫరా అయ్యాయి. మిగిలిన 3,63,084 పుస్తకాలు వారం రోజుల్లో సమకూరే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. విద్యార్థులకు బెల్టులు పూర్తి స్థాయిలో 68,298 సరఫరా అయ్యాయి. జగనన్న విద్యా కానుకలో భాగంగా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు, బెల్టులు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ తదితర సామగ్రి అందజేయనున్నారు.

స్టాక్‌ పాయింట్లకు..

ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాల సరఫరాలో రెండు పద్ధతులు అవలంబిస్తున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ను నేరుగా పుస్తక గోదాం నుంచి జిల్లా స్టాక్‌ పాయింట్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో 8, 9, 10వ తరగతుల పాఠ్య పుస్తకాలను ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి నేరుగా మండల స్టాక్‌ పాయింట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కవర్‌ పేజీలు ఆకర్షణీయంగా తయారు చేసి, క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. తద్వారా పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారం పొందే వెసులుబాటు విద్యార్థులకు కలుగుతుంది.

చిన్నారులపై పుస్తకాల బరువు లేకుండా..

విద్యా బోధనలో ప్రభుత్వం సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది ఒకటి నుంచి 9వ తరగతి వరకూ సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేయగా.. ఈ ఏడాది పదో తరగతిలో సైతం ఈ పద్ధతి తీసుకుని వచ్చింది. ఇందులో భాగంగా గణితం, సైన్స్‌ సబ్జెక్టులను రెండు సెమిస్టర్లుగా విడదీశారు. సిలబస్‌ మొత్తాన్ని జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ సెమిస్టర్‌–1గా, నవంబర్‌ నుంచి మార్చి వరకూ సెమిస్టర్‌–2గా విభజించారు. దీంతో పాటు 1 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు బైలింగ్వల్‌ విధానంలో ముద్రిస్తున్నారు. ఒక పేజీలో ఇంగ్లిష్‌, మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశం ముద్రించడం ద్వారా విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోగలుగుతున్నారు.

ప్రతి విద్యార్థికీ కానుక

ప్రతి విద్యార్థికీ ఐదో విడత విద్యా కానుక కిట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాకు వచ్చిన కిట్లను ఆలస్యం లేకుండా వెంటనే మండల కేంద్రాల్లోని స్టాక్‌ పాయింట్లకు పంపుతున్నాం. పాఠ్య పుస్తకాలు, బెల్టులు ఇప్పటికే అందాయి. మిగిలిన సామగ్రి సైతం జూన్‌ మొదటి వారంలోపు అందే అవకాశం ఉంది. పాఠశాలలు తెరచిన రోజునే విద్యార్థులకు కిట్లు అందజేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.

విద్యార్థులకు అవసరమైన సామగ్రి ఇలా...

సామగ్రి రకం ఆవశ్యకత

నోట్‌ పుస్తకాలు 7,08,822

బ్యాగులు 1,03,422

యూనిఫాం 1,03,422

బూట్లు 1,04,856

బెల్ట్‌ 68,298

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ 12,338

పిక్టోరియల్‌ డిక్షనరీ 5,988

#Tags