IB Syllabus in AP Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భేష్‌.. ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్‌..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియట్‌ (ఐబీ) సిలబస్‌ను అమలు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. 2025–26విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్‌ బోధనకు అన్ని ఏర్పాట్లు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, వాటిలోని సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు ఐబీ కరికులం అంతర్జాతీయ ప్రతినిధులు ఏడుగురు సభ్యుల బృందం ఇటీవల విజయవాడకు చేరుకుంది. వీరు మూడు బృందాలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల, ము న్సిపల్‌ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ యాజమా న్య పాఠశాలలను మార్చి 7వ తేదీ వరకు పర్యటించి అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం అమెరికాకు చెందిన ఐబీ కరికులమ్‌ రూపకల్పనలో సీనియర్‌ మేనేజర్‌ వెండీగ్రీన్‌, ఇంగ్లండ్‌కు చెందిన పర్సనల్‌ డెవెలెప్‌మెంట్‌ ప్రత్యేకాధికారి ఎరిక్‌బాబర్‌ తిరుపతి చిన్నబజారు వీధిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో అమలుచేస్తున్న కరికులమ్‌, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, డిజిటల్‌ విద్య, మౌలిక వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసనలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ఫాం(ఐఎఫ్‌పీ)ల పాత్రను పరిశీలించారు. విద్యార్థుల చేతుల్లో ట్యాబ్‌లను చూసి, వాటిని ఎలా వినియోగిస్తున్నారో స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిస్పందనలు, ఉపాధ్యాయుల బోధ నా మెళుకువలను పరిశీలించి అభినందించారు. సైన్సు ల్యాబ్‌, లైబ్రరీ, పాఠశాల ఆవరణలోని పరిశుభ్రత, విద్యార్థుల యూనిఫాం చూసి మెచ్చుకున్నారు.

ఐబీ బృందం ప్రశంసలు
జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ వి.శేఖర్‌ మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాల విద్య ఐబీ కరికులమ్‌కు సమకాలీకంగా ఉందని ఐబీ బృందం పేర్కొన్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విద్యావిధానం, బోధన, మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐబీ కరికులమ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌, ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్‌ వై.గిరిబాబు యాదవ్‌, తిరుపతి అర్బన్‌ ఎంఈఓ–1 బాలాజీ, అసిస్టెంట్‌ ఏఎంఓ మధు, హెచ్‌ఎం వెంకటసుబ్బమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags